close

తాజా వార్తలు

Published : 21/10/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్@ 5 PM

1. ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారా? అనే కోణంలో శిథిలాలను వేగంగా తొలగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు: నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదైనా అవసరం ఉంటే ఎస్‌ఈసీ తమను సంప్రదించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సూచించగా.. తాము గమనిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. హైదరాబాద్‌లో వారంలో 700మి.మీ వర్షపాతం

నగరంలో ఏటా సగటున 800 మి.మీల వర్షపాతం నమోదవుతుందని.. ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 700 మి.మీల వర్షపాతం నమోదైందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ తెలిపారు. జంట నగరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలసౌధలో ఆ శాఖ కమిషనర్‌, అధికారులతో రజత్‌ కుమార్ సమీక్ష నిర్వహించారు. చెరువులకు గండ్లు పడకుండా అధికారులను అప్రమత్తం చేసే విషయంపై ప్రధానంగా చర్చించారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. బిహార్‌ సమరం: 31% మందిపై క్రిమినల్‌ కేసులు

బిహార్‌‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలిదశలో పోటీచేస్తున్న 1064 మంది అభ్యర్థుల్లో 328 మందిపై (26%) క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌-ఏడీఆర్‌) పేర్కొంది. వీరిలో 244 మంది తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఈ నెల 28న పోలింగ్‌ జరగనున్న తొలిదశ 71 స్థానాల నుంచి మొత్తం 1066 మంది పోటీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భాజపాకు ఏక్‌నాథ్ ఖడ్సే గుడ్‌బై!

మహారాష్ట్ర భాజపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే ఆ పార్టీకి రాజీనామా చేశారని, శుక్రవారం తమ పార్టీలో చేరతారని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, నీటిపారుదల శాఖ మంత్రి జయంత్‌ పాటిల్‌ వెల్లడించారు. ఆయన్ను ఎన్సీపీలో చేర్చుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జయంత్‌ పాటిల్‌ ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ.. ఖడ్సే భాజపాను వీడారని, అధికారికంగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు ఎన్సీపీలో చేరతారని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్‌

గతవారం రోజులుగా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది రాగల 24గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. జోరు కొనసాగించనీ..!

టీ20 క్రికెట్‌ లీగ్‌లో భాగంగా 39వ మ్యాచ్‌కు అబుదాబి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. ఇప్పటి వరకూ రెండు జట్లు చేరో తొమ్మిది మ్యాచ్‌లాడాయి. అందులో ఆరు విజయాలతో బెంగళూరు ఒకడుగు ముందు ఉండగా.. కోల్‌కతా ఐదు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ రోజు రాత్రి 7.30గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. గత మ్యాచుల్లో సాధించిన విజయాలతో రెండు జట్లూ మంచి జోరులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఆ జాబితాలో తొలి స్థానం మైక్రోసాఫ్ట్‌దేనట!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 ప్రభావంతో కార్యాలయాలు మూతబడ్డాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ మెయిల్స్‌తో దాడి చేస్తున్నారు. చెక్‌ పాయింట్ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరస్థులు ఎక్కువగా ప్రముఖ కంపెనీల పేర్లను ఉపయోగించి ఫిషింగ్ మెయిల్స్‌ పంపుతూ ఉద్యోగులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ధోనీసేనపై మరో పిడుగు!

వరుస ఓటములతో విలవిల్లాడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీకి పూర్తిగా దూరమవుతున్నాడు. మిగిలిన ఐదు మ్యాచుల్లో అతడు ఆడడని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 3 పొరల మాస్కు 3 రూపాయలకే..

కరోనా వ్యాప్తి సమయంలో మాస్కులను అధిక ధరలకు విక్రయించకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలు జారీ చేసింది. రెండు, మూడు పొరలున్న మాస్కులను రూ.3 నుంచి రూ.4కే విక్రయించాలని నిర్ణయించింది. నాణ్యతను బట్టి ఎన్‌95 మాస్కులను రూ.19 నుంచి రూ.49 మధ్యలోనే విక్రయించాలని పేర్కొంది. ఈ నిర్ణయంతో మాస్కుల ధరలను నిర్ణయించిన తొలి రాష్ట్రంగా అవతరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.