close

తాజా వార్తలు

Published : 26/10/2020 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. పోలవరం ‘డ్యామ్‌’ నిర్మాణానికే నిధులు:కేంద్రం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలపై సమాచార హక్కుచట్టం కింద దాఖలు చేసిన అర్జీకి కేంద్రం సమాధానమిచ్చింది. విజయవాడకు చెందిన సౌరబ్‌ఖమర్‌ ఈ అర్జీ దాఖలు చేశారు. ప్రాజెక్టు డ్యామ్‌ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పునరావాస, పరిహార ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వైద్య కళాశాలల్లో 50% ఓబీసీ కోటాకు సుప్రీం ‘నో’!

వైద్య కళాశాలల్లో 50శాతం ఓబీసీ కోటాతో సీట్ల కేటాయింపు వ్యవహారంలో తమిళనాడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో ఈ ఏడాది 50% ఓబీసీలకు కేటాయించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఎస్సీ,ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోవద్దు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఉద్దేశించిన ‘జగనన్న వైఎస్‌ఆర్‌ బడుగు వికాసం’ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు.  2020-23 ఏడాదికి ఈ ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినట్లు సీఎం చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రూ.కోటి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా కొత్తకొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నామని జగన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 3లక్షల మంది వీధివ్యాపారులకు చేయూత

కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన వీధి వ్యాపారులను కేంద్రం ఆదుకోనుంది. వారిలో 3లక్షల మందికి మంగళవారం వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రుణాలు అందజేయనున్నారు. పీఎం స్వనిధి(ప్రధాన్‌మంత్రి స్ట్రీట్ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన) పథకం కింద వారికి ఈ ప్రయోజనం చేకూరనుంది. రుణాలు అందజేసిన సమయంలో ప్రధాని వారితో మాట్లాడతారని ఉన్నతాధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి లోకేశ్ ‌వెళ్లారు. ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లేందుకు లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో రహదారి పక్కన ఉప్పుటేరులోకి ట్రాక్టర్‌ జారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆధారాలు లేవు

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌ ప్రముఖుల కోసం 2019లో ఏర్పాటు చేసిన పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు ఆధారాలు లభ్యం కాలేదు. ఈ మేరకు ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) కరణ్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. నటులు డ్రగ్స్‌ సేవించినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. వీడియోలో కనిపిస్తోన్న తెల్లటి గీత ట్యూబ్‌లైట్‌ ప్రతిబింబమని నిర్ధారించినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. విలీనాలు ఏమీ లేవు..

కొంత కాలంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో విలీనం కానుందన్న వార్తలకు చెక్‌ పడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటార్లు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా ఈ అంశంపై కామెంట్‌ చేయడానికి ఏమీ లేదని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ రోహిత రావ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘ట్రంప్‌’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడివేడీగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇది స్మార్ట్‌యుగం.. కేవలం ప్రసంగాలతో ఎదుటి పార్టీని దెబ్బతీయలేరు. అందుకే డెమొక్రటిక్‌ పార్టీ మరో అడుగు ముందుకేసి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన పేరుతోనే వ్యంగ్యంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. కరోనా నిర్మూలనకు ట్రంప్‌ ప్రణాళిక ఇది అంటూ డెమొక్రటిక్‌ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ఇటీవల దీన్ని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఉద్ధవ్‌.. మీరు ఆ ధైర్యం చేయకండి: కంగన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నిప్పులు చెరిగారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసు విషయమై ఇటీవల కంగన ముంబయి నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనపై ఫైర్‌ అయ్యింది. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన శివసేన పార్టీ దసరా వేడుకల్లో ఉద్ధవ్‌ ఠాక్రే.. కంగన రనౌత్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. కూటి కోసం ముంబయికి వచ్చిన కొంతమంది కావాలనే ఈ మహానగరంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సరికొత్త ఐ-20 ఇదిగో..! 

భారత్‌లో సరికొత్త ఐ20 కారు విడుదలకు హ్యూందాయ్‌ మోటార్స్‌ వేగంగా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన డీలర్ల వద్ద బుకింగ్స్‌ స్వీకరిస్తున్న ఈ కంపెనీ తాజా కారు ఫొటోలను విడుదల చేసింది. ఇది మూడో తరం ఐ20 కారు. ఇది వచ్చేనెల మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్‌ను 2014లో విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.