close

తాజా వార్తలు

Published : 24/11/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రికవరీ రేటు చూసి నిర్లక్ష్యం పెరుగుతోంది

కొవిడ్‌ మహమ్మారి వల్ల ఎదురైన తీవ్ర సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం తగదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ భవిష్యత్తు కార్యాచరణపై అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు కూడా బాగుంది. అయితే ఈ రికవరీలను చూసి చాలా మంది వైరస్‌ బలహీనపడిందని భావిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది. ఈ నిర్లక్ష్యం తగదు’ అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం: కేసీఆర్

శాస్త్రీయంగా ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైన కార్యాచరణ రూపొందించినట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కరోనా పరీక్షల ధరలపై కేంద్రానికి నోటీసులు

కరోనా నిర్ధారణ కోసం చేసే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా ఒకే గరిష్ఠ ధర నిర్ణయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. న్యాయవాది అజయ్‌ అగర్వాల్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. భారత మార్కెట్లలో ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్లు కేవలం రూ.200 కంటే తక్కువకే లభిస్తుంటే ఆసుపత్రులు, ల్యాబ్‌లు మాత్రం ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం కేంద్రం సహా అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 2021లో ఇవే అత్యంత కీలకం!

వచ్చే ఏడాది అత్యంత కీలక సాంకేతికతలుగా కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లు (ఐఓటీ) నిలుస్తాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈఈఈ) సర్వే వెల్లడించింది. 2021లో అత్యంత ముఖ్యమైన సాంకేతికతలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై కొవిడ్‌-19 ప్రభావం, సాంకేతికత వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలపై ఈ సర్వే నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ప్రైవేటు టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్‌

ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘‘ఇంటరాక్షన్‌ విత్‌ కేటీఆర్‌’’ పేరిట హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో విద్యా సంస్థల యాజమాన్యాలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమకు అవకాశం ఇస్తే ప్రతిరోజూ తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే దృష్టి సారించామని.. తప్పకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఫైజర్‌ వ్యాక్సిన్‌ అవసరం ఉండకపోవచ్చు

భారత్‌లో అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు ఉత్తమ ఫలితాలిస్తున్నాయని, అమెరికాకు చెందిన ఫైజర్‌ టీకా భారత్‌కు అవసరమయ్యే అవకాశం ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశానికి చెందిన ఉత్తమ సంస్థలు ఐదు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయని, అలాంటప్పుడు అమెరికాలోనే వినియోగానికి ఇంకా అనుమతులు లభించని ఫైజర్‌ టీకాను భారత్‌లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న రాష్ట్రపతికి పద్మావతీ అతిథి గృహం వద్ద తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతి దంపతులకు అర్చకులు ఇస్లికఫాల్ (పూర్ణకుంభం)‌ స్వాగతం పలికారు. అనంతరం వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఒకట్రెండు తప్ప అన్నీ పాత అంశాలే:కోదండరాం

ఈ ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం సమయాన్ని వృథా చేసిందే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం భవనాల కూల్చివేతకే సమయాన్ని కేటాయించారని ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా వెళ్లడించిన తెరాస మేనిఫెస్టోలో ఒకట్రెండు అంశాలు తప్ప మిగతావన్నీ పాత అంశాలేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఈ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ చుట్టేయొచ్చు... 

ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌ మార్కెట్‌లో ఫోల్డింగ్ డిస్‌ప్లే ఫోన్ల సందడి కొనసాగుతోంది. శాంసంగ్, మోటోరోలా, హువావే ఇప్పటికే ఫోల్డింగ్ మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేశాయి. ధర ఎక్కువగా ఉండటంతో కొంతమందికే పరిమితమైపోయాయి. ఈలోగా ఎల్‌జీ లాంటి సంస్థలు రోలింగ్‌ మొబైల్స్‌ను తీసుకురావాలని చూస్తున్నాయి. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా ఈ మొబైల్స్‌ ఉండనున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా ముందుకొస్తున్నాయి. అది కూడా ఎల్‌జీ నుంచే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: రామకృష్ణ

పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. కేంద్రంపై పోరాటానికి ఉమ్మడిగా కలిసిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క పార్టీ, వ్యక్తుల అజెండా కాదని.. రాష్ట్ర ప్రజల ఉమ్మడి అజెండాగా అభివర్ణించారు. ప్రాజెక్టును చూసేందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన