close

తాజా వార్తలు

Updated : 26/11/2020 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ తీరు సరిగా లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యం 50వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. నివర్‌ ఎఫెక్ట్‌: ఏపీలో భారీ వర్షాలు

నివర్‌ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు తదితర జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*కర్ణాటక దిశగా నివర్‌!

3. కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ గవర్నర్‌

కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుంజుకుంటుందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. అయితే, పండుగల సీజన్‌ ముగిసిన వేళ.. ఈ కొనుగోలు శక్తి స్థిరత్వంపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫారెన్‌ ఎక్స్ఛేంజి‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రపంచదేశాల మాదిరిగానే భారత్‌ కూడా ఆర్థికవృద్ధి క్షీణతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. 26/11 గాయాలను భారత్‌ ఎన్నటికీ మరువదు: మోదీ

ముంబయి పేలుళ్ల గాయాలను యావత్‌ భారత్‌ ఎన్నటికీ మరువదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై భారత్‌ పోరు కొనసాగిస్తుందన్నారు. ముంబయి పేలుళ్లు జరిగి 12ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, పౌరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం: కేటీఆర్‌

మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న జరగనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వస్తూ పోతుంటాయని.. కానీ నగరంలో శాంతియుత వాతావరణం ఉండే చూడటం ప్రభుత్వం బాధ్యతన్నారు. ప్రభుత్వం నడుపుతున్న తమకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కేసీఆర్‌ సంజాయిషీ చెప్పాలి: కిషన్‌రెడ్డి

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ ప్రజలను భయపెట్టేలా ఆరోపణలు చేస్తున్నారని.. గ్రేటర్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇతరులపై నిందలు మోపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎన్నిక సమయంలో మంత్రి కేటీఆర్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని.. ఇప్పుడు కేసీఆర్‌ అలా అంటున్నారని విమర్శించారు.  ఎంఐఎంతో కలిసి స్నేహం చేస్తున్నందున ప్రజలకు సీఎం కేసీఆర్‌ సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షల పొడిగింపు

అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కరోనా వైరస్‌ వ్యాప్తితీవ్రత కారణంగా ఈ నిషేధం డిసెంబర్‌ 31 వరకు అమలులో ఉంటుందని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని సంస్థ తెలిపింది. కాగా, ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో మాత్రమే.. ప్రతి ఒక్క సందర్భం, పరిస్థితిని పరీశీలించిన తర్వాతే విమాన సర్వీసులను అనుమతిస్తామని డీజీసీఏ వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రెచ్చగొట్టే పోస్టులు ఫార్వర్డ్‌ చేయొద్దు: డీజీపీ

గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఆయా పోస్టులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. రెచ్చగొట్టే పోస్టులను ఫార్వర్డ్‌ చేయొద్దని ప్రజలకు మహేందర్‌రెడ్డి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఎన్టీఆర్‌పై భాజపాది కపట ప్రేమ:ఎల్.రమణ

రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే విషయాన్ని విస్మరించిన భాజపా, తెరాస, ఎంఐఎం పార్టీలు.. ఓట్ల కోసం కొత్త ప్రయోగం చేస్తున్నాయని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. దుబ్బాక ఫలితాలతో సీఎం కేసీఆర్‌కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రూ.10వేలు వరద సాయం ప్రకటించారన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో రమణ మీడియాతో మాట్లాడారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వని భాజపా.. ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తోందని ఎద్దేవా చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఒకే వారం.. ఒక్క సిటీ @ 4వేల పెళ్లిళ్లు!

ఓ వైపు కరోనా వైరస్‌ బుసలు కొడుతున్నా వివాహ వేడుకల విషయంలో ప్రజలు వెనక్కి తగ్గడంలేదు. మంచి ముహూర్తాలు ఉండటంతో ఒక్క జైపూర్‌ నగరంలోనే రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లో రోజూ 3వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ బుధవారం నుంచి ఈ నెల 30 వరకు 4వేల వివాహాలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25, 27, 30 తేదీల్లో రికార్డు స్థాయిలో 4వేల వివాహాలు జరగబోతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన