close

తాజా వార్తలు

Updated : 29/11/2020 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్నా:అమిత్‌షా

గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపాకు అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తామని.. ఐటీ పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దారిపొడవుగా అంగుళం ఖాళీ లేకుండా తనకు స్వాగతం పలికిన హైదరాబాద్‌ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలుపారు. రోడ్‌షోలో ప్రజల ఆదరణ చూశాక హైదరాబాద్‌ మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కేంద్రంతో చర్చలకు రైతు సంఘాల తిరస్కరణ!

కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తాము చేపట్టిన ‘చలో దిల్లీ’ ర్యాలీ ప్రధాన అజెండా అని పంజాబ్‌ రైతు సంఘాలు తెలిపాయి. రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రతిపాదనను ఆదివారం తిరస్కరించాయి. అంతేకాకుండా తమ ఆందోళనలను దిల్లీలోని బురారీ మైదానానికి తరలించేందుకు సైతం రైతు సంఘాలు నిరాకరించాయి. దిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ సంఘాల నాయకులు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

*రాజధాని నడిబొడ్డున గళం వినిపిస్తాం

3. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో ఓట‌రు స్లిప్‌ల జారీ

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్వయం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల ద్వారా ప్రత్యేక ఓట‌రు చైత‌న్య కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. స‌ర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లతో స‌మావేశాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా ఓట‌రు స్లిప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. చైనా చర్యలు రెచ్చగొట్టేవే..!

భారత సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌లో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తోన్న వార్తలపై అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే, అవి కచ్చితంగా భారత్‌ను రెచ్చగొట్టే చర్యలేనని, దక్షిణ చైనా సముద్రంలో అవలంబిస్తోన్నట్లుగానే ఇక్కడ కూడా చైనా ప్రవర్తిసున్నట్లు వెల్లడించారు. సరిహద్దులో నిర్మాణాలపై శాటిలైట్‌ చిత్రాలు వెలువడ్డ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యులు చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఇన్వర్టర్లు పోయి.. ఇన్వెస్టర్లు వచ్చారు: కేటీఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలిస్తేనే హైదరాబాద్‌లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గోషామహల్‌ నియోజకవర్గంలోని జుమ్మేరాత్‌ బజార్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడారు. నోటికొచ్చిన హామీలిస్తూ భాజపా నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. ఇవాళ రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భాజపా ఎదగడానికి తెరాసనే కారణం: రేవంత్‌

చారిత్రక నగరం హైదరాబాద్‌ సంస్కృతి, పేరును మారుస్తామని కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ... అభివృద్ధి చేయకున్నా ప్రచారం చేసుకోవచ్చని గోబెల్స్‌ అన్నదమ్ములు మోదీ, అమిత్‌ షా నిరూపించారని ఎద్దేవా చేశారు. తెరాస, ఎంఐఎం రెండూ కలిసి కాంగ్రెస్‌ను బలహీన పరచడం వల్లే భాజపా ఎదుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో భాజపా ఎదగడానికి ప్రధాన కారణం తెరాసనే అని రేవంత్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వాట్సాప్‌: తెలియకుండా స్టేటస్‌ చూడొచ్చు

వాట్సాప్‌లో మీ స్టేటస్‌ ఎవరెవరు చూశారనేది ఎలా చూడాలో తెలుసా? ఏముంది... వాట్సాప్‌లో స్టేటస్‌ ట్యాబ్‌కి వెళ్లి అందులో మన స్టేటస్‌కు దిగువన ఉన్న ‘కన్ను’ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే ఎవరెవరు చూశారో తెలిసిపోతుంది. ఇక్కడే ఓ మతలబు ఉంది. కళ్లకు కనిపించేదంతా నిజం కాదు అన్నట్లు... ఆ లిస్ట్‌లో లేని వాళ్లు కూడా మీ వాట్సాప్‌ స్టేటస్‌ని‌ చూసి ఉండొచ్చు. అవునా.. అదెలా సాధ్యం అంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇందులోని ట్రిక్‌ పాటిస్తే... మీకూ ఆ అవకాశం దక్కుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కువైట్‌కూ కొవిడ్‌ కష్టాలు

కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత మన దేశంలో ఏం జరుగుతోంది? దుకాణాలు తెరిచారు.. బస్సులు నడుపుతున్నారు. విమానాలూ ఎగురుతున్నాయ్‌. కువైట్‌లోనూ అదే జరిగింది. అయితే.. ఒక విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. అదేంటంటే.. అన్ని దేశాల్లో సరుకుల కోసమో, ఆహారం కోసమో క్యూ లైన్లలో నిలబడ్డారు. కువైట్‌లో మాత్రం నగల దుకాణాల వద్ద సందడి కనిపించింది. అవును.. మీరు చదివింది నిజమే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రైతులు చట్టాల్ని అర్థం చేసుకోలేదు: నీతిఆయోగ్‌

ఆందోళన చేస్తున్న రైతులు నూతన వ్యవసాయ చట్టాల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు(వ్యవసాయం) రమేశ్‌ చంద్‌ అభిప్రాయపడ్డారు. అన్నదాతల ఆదాయాల్ని భారీ ఎత్తున పెంచడానికి కొత్త చట్టాలు దోహదం చేస్తాయని తెలిపారు. తప్పనిసరి వినియోగ వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్‌ కమొడిటీస్‌ యాక్ట్‌-ఈసీఏ) పూర్తిగా తొలగించి.. దళారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు రైతులు భావిస్తున్నారన్నారు. కానీ, వాస్తవానికి ఆ చట్టంలో కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మత మార్పిడి: యూపీలో తొలి కేసు నమోదు!

బలవంతపు మత మార్పిడిని అరికట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని గవర్నర్‌ ఆమోదించి ఒక రోజైనా గడవక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి కేసు నమోదైంది. ఓ మహిళ మతాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణతో ఓ యువకుడిపై బరేలీ జిల్లా, దేవార్నియన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన