close

తాజా వార్తలు

Updated : 08/08/2020 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

కేరళలోని కొలికోడ్‌ విమాన ప్రమాద స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి పరిశీలించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు.. స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. మరోవైపు విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

2. ‘రికవరీ రేటు పెరిగింది.. మరణాల శాతం తగ్గింది’

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం తాజాగా రూ.100 కోట్లు కేటాయించిందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విలువైన ఇంజెక్షన్లను జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉంచామన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, పడకలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా రోగులు కోలుకునే విధంగా ప్రభుత్వం ధైర్యం కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునే రికవరీ రేటు పెరిగి, కరోనా మరణాల శాతం తగ్గిందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరగాలి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ లేఖ రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్రమంత్రి సూచించారు. పెండింగ్‌ అంశాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీ త్వరలో జరగాలని చెప్పారు. నీటి వివాదాల గురించే లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని కేంద్రమంత్రి లేఖలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నౌహీరా షేక్ భూములు స్వాధీనం

హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన భూములును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్‌ఏ కాలనీలో రూ. 70 కోట్ల విలువైన 81  ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈడీ తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు రూ. 300 కోట్ల  ఆస్తులను ఈడీ  జప్తు  చేసింది. హీరో గోల్డ్‌ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మానీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

5. కరోనా వ్యాక్సిన్‌ సరఫరాకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు?

కరోనా వైరస్‌ను కట్టడి చేసే కొవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆతృతగా వేచిచూస్తోంది. కాగా, కరోనా వ్యాక్సిన్‌ను అందిపుచ్చుకునేందుకు వివిధ దేశాలు తయారీదారులతో ముందస్తు చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ తయారీ మాత్రమే కాకుండా దాని పంపిణీ కూడా ప్రభుత్వాలకు సవాలు కానుందని స్పష్టమవుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్టు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆ పైలట్‌కు భాగ్యనగరితో అనుబంధం ఎక్కువే!

కోలికోడ్‌ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. టేబుల్‌ టాప్‌ రన్‌వే పై నుంచి విమానం జారి రెండు ముక్కలవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో అనేకమంది ప్రయాణికులు మరణించారు. విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్‌, కెప్టెన్‌ దీపక్‌ వీ సాథె రెండుసార్లు ప్రయత్నించినా ప్రమాదం జరగడం దురదృష్టకరమని వైమానిక వర్గాలు అంటున్నాయి. దీపక్‌ వీ సాథెకు హైదరాబాద్‌ నగరంతో మంచి అనుబంధం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వీడియో సాంగ్‌తో అదరగొట్టిన శ్రుతిహాసన్‌

తాజాగా శ్రుతి హాసన్‌ ఓ పాట రాసి.. స్వరాలు సమకూర్చి.. ఓ వీడియో సాంగ్‌ను రూపొందించింది. ఆ పాటను ‘ఎడ్జ్‌’ పేరుతో శ్రుతి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేసింది. ఆంగ్లంలో ఉండే ఈ పాటను శ్రుతి హాసన్‌ హాలీవుడ్‌ సింగర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా పాడింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ ఆమె అభిమానులను, నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. పక్షిని ఢీకొట్టిన విమానం.. ప్రయాణికులు సేఫ్‌

కోలికోడ్‌ ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సారి పక్షి తగలడంతో విమానాన్ని ఆపేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఎయిర్‌ ఏషియా విమానం టేకాఫ్‌ సమయంలో పక్షి తగలడంతో అధికారులు అప్పటికప్పుడు నిలిపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. విమానం రాంచీ నుంచి ముంబయి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగింది. 

9. కేరళ చేరిన ఎయిరిండియా ఏంజెల్స్‌

కేరళలోని కొలికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో.. సహాయ చర్యలను సమన్వయం చేయడానికి, బాధితులు, వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సిబ్బంది, చిన్నారులు, ప్రయాణికులతో కలిపి 190 మందితో కొలికోడ్‌కు చేరుకున్న విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇప్పటికే 19 మంది మరణించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా నెగెటివ్ 

కరోనా వైరస్‌పై పోరాటంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ ఎట్టకేలకు విజయం సాధించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలినట్లు శనివారం ఆయన ట్విటర్ వేదికగా  వెల్లడించారు. బచ్చన్‌ కుటుంబంలో జయా బచ్చన్ మినహా, అమితాబ్ బచ్చన్‌, అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్య అందరూ వైరస్‌ బారిన పడ్డారు. అయితే  కొన్నిరోజుల చికిత్స అనంతరం వారు వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. కానీ అభిషేక్ రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో ఇంకా కొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.