
తాజా వార్తలు
రైతుల నిరసన: కూరగాయలకు కటకట
దిల్లీ: నగరంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న రైతుల నిరసనల ప్రభావం పండ్లు, కూరగాయలపై పడింది. సింఘు, టిక్రి సరిహద్దుల్లోని నిరసనల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఆజాద్‌పూర్ టోకు ధరల మండికి వచ్చే వాహనాలు ఆగిపోయాయి. ఫలితంగా నగరంలో కొరత ఏర్పడటంతో కూరగాయల ధరలు రూ.50-100కి పెరిగాయని విక్రయదారులు తెలిపారు. సింఘు, టిక్రి వద్ద వాహనాలు నిలవడంతో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ నుంచి కూరగాయలు తక్కువగా సరఫరా అవుతున్నాయి.
‘సాధారణంగా ఆజాద్‌పూర్ మండికి 2,500 వాహనాలు కూరగాయలు, పండ్లు తీసుకొచ్చేవి. ఇప్పుడు ఆ వాహనాల సంఖ్య వెయ్యికి పడిపోయింది. మరికొన్ని రోజులు సరిహద్దులు ఇలాగే మూతబడితే పరిస్థితి మరింత దిగజారుతుంది’ అని ఆజాద్‌పూర్ వ్యవసాయ ఉత్పత్తుల కమిటీ ఛైర్మన్ ఆదిల్‌ఖాన్ తెలిపారు. స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల వల్ల కూరగాయల ధరలు మరీ ఎక్కువగా ఏమీ పెరగలేదని ఆయన అంటున్నారు. అయితే సరఫరా తగ్గడంతో కొన్ని కూరగాయల ధరలు రూ.50-100కు పెరిగాయని విక్రయదారులు చెబుతున్నారు.
సాధారణ రోజుల్లో పంజాబ్‌లోని అమృత్సర్-హోసియార్పుర్ నుంచి దిల్లీకి 40-45 ట్రక్కుల్లో బఠాణీలు వస్తాయి. ఇప్పుడా సంఖ్య 16-20 ట్రక్కులకు తగ్గింది. హైవేల నుంచి కాకుండా ఇతర రహదారుల నుంచి రావడంతో రవాణా ఖర్చులు ట్రక్కుకు రూ.10వేలు పెరిగాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి టమోటా, ఆలుగడ్డల రవాణా తగ్గిపోయింది. ఇప్పటికే వీటి ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు, కొరతపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చెప్పామని భాజపా దిల్లీ అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ తెలిపారు.