
తాజా వార్తలు
మనుషులపై ప్రయోగించిన తొలి టీకా ఫలితాలివే..
బీజింగ్: మనుషుల్లో తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరిన మొట్టమొదటి కొవిడ్-19 వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలిచ్చినట్లు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది ల్యాన్సెట్’లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మనుషుల్లో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే తటస్థ ప్రతిరక్షకాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. అలాగే వైరస్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే రోగనిరోధక వ్యవస్థలోని ‘టీ-సెల్స్’ సమర్థంగా ప్రతిస్పందించాయని తెలిపారు. తొలి దశలో 108 మందిపై ప్రయోగించినట్లు వెల్లడించారు. 28 రోజుల తర్వాత వీరిలో ఆశాజనక ఫలితాలు గమనించినట్లు పేర్కొన్నారు.
లోతైన పరిశోధనకు బాటలు..
అయితే ఈ వ్యాక్సిన్ మనుషులను వైరస్ నుంచి ఏ మేరకు రక్షించగలుగుతుందో నిర్ధారించడానికి ముందు మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు సహా మరికొంత మంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ‘‘వ్యాక్సిన్ కనుగొనే ప్రయాణంలో ఈ ఫలితాలు ఓ కీలక మైలురాయనే చెప్పాలి. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకంగా ‘సార్స్-కొవ్-2’ వైరస్‌ను ఎదుర్కోగలిగే ప్రతిరక్షకాలు, ‘టీ సెల్స్’ను 14 రోజుల్లో ఉత్పత్తి చేసింది’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న వే చెన్ తెలిపారు. ఈ ఫలితాలను బట్టి ‘Ad5-nCoV’గా పేర్కొంటున్న వ్యాక్సిన్‌పై మరిన్ని లోతైన పరిశోధనలు జరపేందుకు బాటలు పడ్డాయన్నారు. అయితే, వ్యాక్సిన్ అభివృద్ధిలో అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చెన్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన ప్రతిస్పందనలు కచ్చితంగా మనుషుల్ని కొవిడ్-19 నుంచి బయటపడేస్తాయని ఇప్పుడే నిర్ధారించలేమన్నారు.
ఈ టీకా ఎలా పనిచేస్తుందంటే..
ఈ వ్యాక్సిన్‌ను సాధారణ జలుబుకు కారణమయ్యే అతి బలహీనమైన అడినోవైరస్ నుంచి తయారు చేశారు. ఇది ‘సార్స్-కొవ్-2’లో ఉండే ‘స్పైక్ ప్రోటీన్’ను పోలిన ప్రోటీన్ వృద్ధి చెందడానికి కావాల్సిన జన్యు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏర్పడ్డ స్పైక్ ప్రోటీన్.. ప్రతిరక్షకాల్ని విడుదల చేసే రోగనిరోధక వ్యవస్థలలోని శోషరస గ్రంథుల(లింఫ్ నోడ్స్) వద్దకు చేరుతుంది. దీంతో కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌ను గుర్తించి పోరాడే సామర్థ్యాన్ని రోగనిరోధక వ్యవస్థ సంపాదిస్తుంది.
ప్రయోగం ఇలా జరిగింది..
ఈ వ్యాక్సిన్‌ను 18-60 ఏళ్ల మధ్య ఉన్న 108 మందిపై ప్రయోగించారు. వీరంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. వివిధ మోతాదుల్లో వీరికి వ్యాక్సిన్‌ను ఇచ్చారు. అనంతరం తరచూ వారి రక్త నమూనాల్ని పరిశీలించారు. తద్వారా వైరస్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే ప్రతిరక్షకాలు, ‘టీ-సెల్స్’ ప్రతిస్పందన ఎలా ఉందో గమనించారు. 28 రోజుల్లోగా చాలా మందిలో పెద్ద దుష్ప్రభావాలేమీ కనిపించలేదు. తక్కువ, మోస్తరు మోతాదులో వ్యాక్సిన్‌ను తీసుకున్న 83 శాతం మందిలో.. ఎక్కువ మోతాదులో తీసుకున్న 75 శాతం మందిలో వారం రోజుల గడువులో అతిస్వల్ప దుష్ప్రభావాలు గమనించినట్లు పరిశోధకులు తెలిపారు. మరో వారంలో దాదాపు అందరిలో రోగనిరోధక వ్యవస్థ స్పందించినట్లు పేర్కొన్నారు. తక్కువ, మోస్తరు మోతాదులో తీసుకున్న 50 శాతం మందిలో, ఎక్కువ మోతాదులో తీసుకున్న 75శాతం మందిలో ప్రతిరక్షకాలు విడుదలైనట్లు తెలిపారు. 28 రోజుల్లో ఇవి నాలుగింతలైనట్లు గుర్తించామన్నారు. చాలా మందిలో ‘టీ-సెల్స్’ సైతం ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నారు. మొత్తానికి 28 రోజుల్లోగా దాదాపు అందరిలో ‘టీ-సెల్స్’గానీ, ప్రతిరక్షకాలు గానీ గుర్తించామన్నారు. అయితే, జలుబుకు కారణమయ్యే అడినో వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే మనుషుల్లో అభివృద్ధి చెందడం వల్ల కూడా ఎక్కువ మోతాదులో టీసెల్స్గానీ, ప్రతిరక్షకాలుగానీ ఉత్పత్తి అయ్యుండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి..