
తాజా వార్తలు
చరిత్రలో తొలిసారి.. ఎందుకిలా?
ఏటా ఘనంగా నిర్వహించే టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో తొలిసారి చెన్నై ప్లేఫ్స్ లేదా సెమీఫైనల్స్ చేరకుండా లీగ్ నుంచి నిష్క్రమించనుంది. ఆదివారం సాయంత్రం బెంగళూరుపై అద్భుత విజయం సాధించినా ఆ జట్టుకున్న ఆఖరి అవకాశాలు పోయాయి. ఈ విషయం ఇదివరకే స్పష్టమైనా నిన్నటి వరకూ మిగతా జట్ల ఫలితాల ఆధారంగా ధోనీసేనకు గణంకాల పరంగా చివరి అవకాశం ఉండేది. అయితే, ముంబయిపై రాజస్థాన్ గెలవడంతో చెన్నై అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పటికే ముంబయి, దిల్లీ, బెంగళూరు తలో 14 పాయింట్లతో కొనసాగుతుండగా, తర్వాతి స్థానాల్లో కోల్‌కతా 12, పంజాబ్ 10 పాయింట్లతో కొనసాగుతున్నాయి. మరోవైపు చెన్నై ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతుంది. అంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా చెన్నై మొత్తం 12 పాయింట్లే సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ధోనీసేన ఇక ప్లేఆఫ్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది.
చరిత్రలో తొలిసారి..
2008 తొలి సీజన్ నుంచీ చెన్నై ఇలా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే మిగతా పది సీజన్లలోనూ ఈ జట్టు అదరగొట్టింది. ప్లేఆఫ్స్, సెమీస్, లేదా ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్‌గా అవతరించింది. గతేడాది సైతం ఫైనల్స్ చేరి చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే తొలిసారి ఇప్పుడిలా విఫలమైంది.
ఆది నుంచీ అడ్డంకులే..
కరోనా వైరస్ కారణంగా సుమారు ఆరు నెలలు వాయిదా పడిన ఈ సీజన్ ప్రస్తుతం యూఏఈలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆగస్టులోనే అక్కడికి వెళ్లిన చెన్నైకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. తొలుత జట్టులో ఇద్దరు సభ్యులకు కరోనా సోకడంతో వారిని ప్రత్యేక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. మిగతా ఆటగాళ్లను ఇంకో వారం రోజులు తమ హోటల్ గదులకే పరిమితం చేశారు. దాంతో ధోనీసేనకు సరైన ప్రాక్టీస్ సమయం దొరకలేదు. పైగా అప్పుడే సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి కీలక ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఇవే చెన్నై వైఫల్యానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. తర్వాత ఆటగాళ్లు కోలుకున్నాక తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయిని ఓడించడంతో జట్టు బాగానే ఉందనుకున్నారు. కానీ తర్వాత నుంచే పరిస్థితి మారిపోయింది.
ధోనీ మెరుపుల్లేవ్..
మరోవైపు ఏడాదికిపైగా ఆటకు దూరమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రాక్టీస్ సమయంలో అద్భుతంగా సాధన చేశాడు. అక్కడ నెట్స్‌లో సాధన చేస్తూనే సిక్సర్లు సంధించాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలలేదు. కీలకమైన మ్యాచ్‌ల్లో ధోనీ నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడిలో మునుపటి ఉత్సాహం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ధోనీ కాస్తంత బ్యాట్ ఝుళిపించినా చెన్నై పరిస్థితి మరో రకంగా ఉండేది. అలాగే బ్రావో గాయపడడం, ఇమ్రాన్ తాహిర్‌కు అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ఆ జట్టు వైఫల్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. చివరగా మొన్న ముంబయి చేతిలో ఘోర పరాభవం తర్వాత యువకులపై దృష్టి సారిస్తామని చెప్పాడు. అన్నట్లుగానే నిన్న బెంగళూరుతో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి వారిని పరీక్షిస్తున్నాడు. దాంతో వచ్చే ఏడాదికి జట్టును బలంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
-ఇంటర్నెట్‌డెస్క్