
తాజా వార్తలు
ఒక్క ఆర్డర్ చేస్తే..42 మంది డెలివరీ ఇచ్చారు
మనీలా: ఒక్కోసారి చిన్న పొరపాట్లు కూడా నలుగురి దృష్టిలో పడేంత పెద్ద విషయాలవుతుంటాయి. నెట్ నిదానంగా ఉండటంతో ఫిలిప్పైన్స్కు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు వింత అనుభవం ఎదురైంది. ఇంతకీ విషయం ఏంటంటే..
ఫిలిప్పైన్స్కు చెందిన ఏడేళ్ల బాలిక, తన బామ్మకు తనకు కలిపి ఫ్రైడ్ చికెన్ రైస్‌ను ఆర్డర్ చేయాలనుకుంది. దానికోసం ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ చేస్తుండగా.. నెట్ నిదానించింది. దాంతో ఆ పాప గమనించుకోకుండా పదే పదే దానిపై క్లిక్ చేయడంతో ఒకే రకం ఆహారం కోసం నలభై సార్లకు పైగా ఆర్డర్ వెళ్లింది. అప్పటికే తాము ఆర్డర్ చేసిన ఆహారం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి..నిమిషాల వ్యవధిలో సుమారు 42 డెలివరీలు వచ్చాయి. ఆ వీధి అంతా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌తో నిండిపోయింది. దాంతో ఆ చిన్నారికి, ఆ బామ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. ఫిలిప్పైన్స్ కరెన్సీలో 189 పీసోలు అవ్వాల్సిన మొత్తం..ఈ దెబ్బతో 7,945 పీసోలుగా మారింది. అంత డబ్బు ఎలా చెల్లించాలా అని వారు కంగారు పడుతుండగా..పొరుగువారు వెంటనే స్పందించి ఆదుకున్నారు. వారు ఆ ఆర్డర్లను స్వీకరించి, డెలివరీ సంస్థకు డబ్బు చెల్లించారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ఆన్లైన్ కంటే బయటే ఎక్కువ కొనుగోళ్లు జరిగాయంటూ ఆ నెటిజన్ చమత్కరించారు.