close

తాజా వార్తలు

Updated : 20/05/2020 12:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీగా తరలివెళ్లిన విదేశీ పెట్టుబడులు!

కరోనా సంక్షోభంలోనూ భారత వృద్ధిరేటు పాజిటివ్‌: సీఆర్‌ఎస్‌ నివేదిక

వాషింగ్టన్‌: కరోనా సంక్షోభం వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆసియా దేశాల నుంచి విదేశీ మదుపర్లు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. భారత్‌ సహా ఆసియాలోని పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి గత కొన్ని నెలల్లో 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లినట్లు పేర్కొంది. వీటిలో భారత్‌ నుంచే ఏకంగా 16 బిలియన్‌ డాలర్లు ఉండడం గమనార్హం. ఆసియాలో భారీ మాంద్యం తప్పదేమోనన్న సంకేతాలను ఇది బలపరుస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావం’ పేరిట ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌’(సీఆర్‌ఎస్‌) జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. అయితే, భారత్‌ సహా మరో రెండు దేశాల వృద్ధి రేటు మాత్రం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొనడం కాస్త ఊరట కలిగించే అంశం. నివేదికలో మరికొన్ని కీలక అంశాలు..

* జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, స్పెయిన్‌, ఇటలీ వంటి ఐరోపా దేశాల్లో దాదాపు మూడు కోట్ల మంది ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. యూరోజోన్‌ ప్రాంతంలో 2020 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 3.8 శాతం కుంగిపోయింది. 1995 తర్వాత ఈ స్థాయి కుంగుబాటు ఇదే తొలిసారి.

* అమెరికాలో 2020 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.8 శాతం కుచించుకుపోయింది. 2008 మహా సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.

* కరోనా సంక్షోభం నుంచి పౌరుల్ని కాపాడుకుంటూ.. వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ తరుణంలో మార్కెట్లకు అండగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ద్రవ్య, ఆర్థికపరమైన విధానాలను అమలు చేయడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది.

* సంస్కరణలు అమలు చేసే క్రమంలో వివిధ దేశాల మధ్య విధానపరమైన సమస్యలు తలెత్తి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్యా భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు.

* దాదాపు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుంగిపోతున్నప్పటికీ.. చైనా, భారత్‌, ఇండోనేషియాల్లో మాత్రం 2020లో వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది.

* కరోనా లాక్‌డౌన్‌ల నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన సినిమా, విమానయాన రంగాలు రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నాయి. 2020లో విమానయాన రంగం 113 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయని అంచనా. చాలా విమానయాన సంస్థలు 2020లో దివాలా తీసే అవకాశం ఉంది.

* చైనా పర్యాటక రంగం దెబ్బతినడం ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే, డ్రాగన్‌ దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడడం వల్ల ప్రపంచ దేశాలకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఆటబొమ్మలు, వైద్య పరికరాల దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని