close

తాజా వార్తలు

Published : 26/11/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 1 PM

1. సమాచారముంటే.. చర్యలేవి?:బండి సంజయ్‌

మాజీ ప్రధాని, దివంగత మాజీ సీఎంలపై అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించాలని భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.పీవీ జయంతి ఉత్సవాలు జరపడమే కాదు ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని తెరాసకు హితవు పలికారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రల జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపిన నేపథ్యంలో బండి సంజయ్‌ స్పందించారు. దానిపై పక్కా సమాచారం ఉంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చెన్నై ఫ్లైఓవర్‌పై విలాసవంతమైన కార్లు

తమిళనాడును అతలాకుతలం చేసిన నివర్ తుపాన్‌ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, భారీ వర్షాల కారణంగా తమ కార్లు వరద నీటిలో మునిగిపోకుండా చెన్నై ప్రజలు ఓ ఉపాయం కనుక్కున్నారు. రాజధాని నగరంలోని వెలాచెరీ ప్రాంతంలోని మాస్‌ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్‌ను సురక్షితమైన ప్రదేశంగా గుర్తించారు. దాంతో యజమానులు ఒకరితరవాత ఒకరు తమ వాహనాలను పార్క్‌ చేశారు. దాంతో ఎన్నడూ చూడని విధంగా విలాసవంతమైన, ఖరీదైన కార్లన్నీ ఒక దగ్గర దర్శనమిచ్చాయని అక్కడి పురపాలక సిబ్బంది మీడియాకు వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో కొత్తగా 862  కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 41,101 పరీక్షలు నిర్వహించగా 862 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 2,66,904కి పెరిగింది. తాజాగా కరోనా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,444కి చేరింది. ఈ మేరకు గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా 961 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,54,676కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రికవరీ రేటు 93.66 శాతం

4. బలహీన పడిన ‘నివర్’‌ 

అతి తీవ్ర తుపాన్‌ నివర్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారింది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కి.మీ వేగంతో పెనుగాలులు వీయగా.. తర్వాత కూడా కొద్ది గంటలపాటు ప్రభావం కొనసాగింది. తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై సహా  కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఏపీలో నెల్లూరుపై ప్రభావం ఎక్కువగా ఉండగా.. చిత్తూరులోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉద్రిక్తంగా రైతుల ‘చలో దిల్లీ’ ఆందోళన 

నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కరోనా నేపథ్యంలో రైతుల ఆందోళనకు దిల్లీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయినప్పటికీ రైతులు దేశ రాజధాని దిశగా కదం తొక్కారు. దీంతో దిల్లీ సరిహద్దుల్లో హరియాణా రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా-అంబాలా హైవే వద్ద రైతులను బలగాలు నిలువరించాయి. దీంతో ఆగ్రహించిన రైతులు భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టిన బారికేడ్లను వంతెనపై నుంచి నదిలోకి పడేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ మారణహోమానికి 12ఏళ్లు

దేశ వాణిజ్య రాజధానిలో ముంబయిలో బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా 12ఏళ్లు. లష్కరే తోయిబా ఉగ్రమూకకు చెందిన 10 మంది ముంబయిలో 12 చోట్ల నరమేధం సృష్టించారు. పోలీసులు స్పందించలోపే ఘోరం జరిగిపోయింది. అయితే, పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు. ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌, ముంబయి అదనపు పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌‌ కాంతే తదితరులు అమరులయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మొబైల్‌లో క్రోమ్‌ స్పీడ్ పెంచాలా.. ఇలా చేయండి

మీ స్నేహితుడు, మీరు ఒకేసారి ఒకే మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారు. ఇద్దరి ఫోన్లలోను దాదాపు ఒకే విధమైన యాప్స్ వాడుతున్నారు. కానీ మీ ఫోన్‌తో పోలిస్తే స్నేహితుడి ఫోన్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ ఎంతో స్పీడ్‌గా ఉంటోంది. కారణమేంటని అడిగితే నవ్వుతూ నేను పవర్‌ యూజర్‌నంటూ కాలర్ ఎగరేశాడు. ఇంతకీ పవర్‌ యూజర్‌ అంటే ఎవరు.. దాని వల్ల ఉపయోగాలేంటి.. వాళ్లు ఏం చేస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలి. ఇలాంటి సందేహాలకు సమాధానాలు కావాలంటే కిందకో లుక్కేయండి మరి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్యాస్ట్రో మరణించిన సరిగ్గా నాలుగేళ్లకు డీగో..!

ఒకరేమో ఫుట్‌బాల్‌ దిగ్గజం. మరొకరేమో రాజకీయ దిగ్గజం. ఇద్దరివీ వేర్వేరు దేశాలు, భిన్న నేపథ్యాలు. కానీ, ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. స్నేహంతో ఒక్కటైన ఆ ఇద్దరు అంతకుమించి అనుబంధం ఏర్పర్చుకున్నారు. చివరికి ఒకే రోజు(నవంబర్‌ 25) ప్రాణాలు విడిచి మరణంలోనూ ఒక్కటయ్యారు. ఆ ఇద్దరే అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ డీగో మారడోనా, క్యూబా మాజీ దేశాధినేత ఫిడెల్‌ క్యాస్ట్రో. డీగో బుధవారం తుదిశ్వాస విడువగా క్యాస్ట్రో సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజు కన్నుమూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బైడెన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు.. ఎవరికంటే..

ఈ సంవత్సరం ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలిచిందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అన్నారు. కరోనా వైరస్‌ కమ్ముకున్న సమయంలో కూడా రికార్డు సంఖ్యలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని అమెరికా ప్రజలు తీర్పును వెలువరించారన్నారు. ‘థ్యాంక్స్‌గివింగ్‌’ ప్రసంగంలో బైడెన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రరాజ్యంలో ప్రతి సంవత్సరం నవంబర్‌లో జరుపుకునే ఈ థ్యాంక్స్‌గివింగ్ కార్యక్రమంలో.. ప్రజలకు, ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేయటం సంప్రదాయం. కాగా, కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ వీటన్నిటికీ తోడు ఈసారి ప్రజాస్వామ్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇండస్ట్రీ ఆ కుటుంబాలది కాదు: కంగన

విషయమేదైనా సరే ధైర్యంగా తన మనసులోని భావాలను బయటపెడుతుంటారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. దీంతో కొన్నిసార్లు ఆమె వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులపై విరుచుకుపడిన కంగన తాజాగా మరోసారి బీటౌన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ‘జల్లికట్టు’ చిత్రం 93వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి భారతదేశం తరఫున ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జల్లికట్టు’ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్‌ పెట్టారు. ఈ క్రమంలోని బాలీవుడ్‌ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టాప్‌ కొరియోగ్రాఫర్‌ మెచ్చిన డ్యాన్స్‌ ఇది..!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన