close

తాజా వార్తలు

Published : 24/10/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 1 PM

1. సరిహద్దుల వరకే బస్సులు: పేర్నినాని

తెలంగాణలో స్థిరపడిన వారు దసరాకు ఏపీకి వెళ్లేందుకు చూస్తున్నారని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ మేరకు బస్సులు నడపాలని భావించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఇంకా కుదరనందువల్ల అది సాధ్యపడలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. పంచలింగాల, గరికపాడు,వాడపల్లి, పైలాన్‌, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టు వద్ద బస్సులు ఉంటాయన్నారు. ప్రయాణికులు సరిహద్దు వద్దకు వస్తే చెక్‌పోస్టుల వద్ద విరివిగా బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.35కే కిలో ఉల్లిగడ్డలు: నిరంజన్‌రెడ్డి

ఆకాశాన్ని అంటిన ఉల్లిధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం వ్యాపారులు నిల్వ చేసే పరిమితులపై ఆంక్షలు విధించింది. రాష్ట్రం ప్రభుత్వం రాయితీపై ఉల్లి సరఫరా చేపట్టింది. జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు సరఫరా చేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్‌ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి వ్యక్తికీ 2 కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి తీసుకోవచ్చని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వర్సిటీ నిర్మాణాల కూల్చివేతపై తెదేపా కన్నెర్ర

విశాఖ గీతం వర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడంపై తెదేపా మండిపడింది. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో రాష్ట్రాన్ని బలి చేస్తోందని విమర్శించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదుగానీ, విధ్వంసం మాత్రం మెండుగా ఉందని మాజీ మంత్రి చినరాజప్ప ఎద్దేవా చేశారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే వర్సిటీపై జగన్‌ కన్నుపడటం దురదృష్టకరమన్నారు. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ విమర్శించారు. కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా గీతం ఆస్పత్రి సేవలందించిందని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంటర్‌ ప్రవేశాలపై ఆందోళనలో విద్యార్థులు

ఇంటర్మీడియట్‌.. విద్యార్థి భవిష్యత్తులో ఎంతో కీలకమైన దశ. అందుకే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇంటర్‌లో చదవాల్సిన కాలేజీ, కోర్సుల ఎంపిక విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఈ ఏడాది వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 ఇంటర్మీడియట్‌ కళాశాలల అనుమతుల్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొన్నింటికి అగ్నిమాపక ధ్రువపత్రాలు లేవని, మరికొన్ని కాలేజీలు వాణిజ్య సముదాయాల్లో ఉన్నాయంటూ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. కోరుకున్న కాలేజీలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో తమ పిల్లల్ని చదివించేందుకు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంకా పుంజుకోని వాహన ఎగుమతులు!

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వాహన విక్రయాలు దేశీయంగా క్రమంగా పుంజుకుంటున్నాయి. కానీ, ఎగుమతుల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదు. మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రధాన వాహన తయారీ కంపెనీలన్నీ దేశీయంగా రెండంకెల వృద్ధి సాధించాయి. కానీ, ఎగుమతులు మాత్రం మరింత కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా ప్యాసెంజర్‌ వాహన విక్రయాల్లో 17.02 శాతం వృద్ధి నమోదైంది. అదే ఎగుమతులు మాత్రం 41.96 శాతం తగ్గాయి. గడిచిన రెండు త్రైమాసికాల్లో మొత్తంగా వాహన ఎగుమతులు 57.52 శాతం పడిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రమాదం ముంగిట్లో ఆ దేశాలు..

కరోనా వైరస్‌ మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకించి ఉత్తరార్థ గోళంలో ఉన్న దేశాలు ప్రమాదం ముంగిట ఉన్నాయని అథనోమ్‌ వెల్లడించారు. మనం ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని.. రానున్న కొద్ది నెలలు మరింత కఠినంగా ఉండనున్నాయని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దేశవ్యాప్తంగా 70 లక్షలు దాటిన రికవరీలు

7. ‘మెహబూబా ముఫ్తీని వెంటనే అరెస్టు చేయాలి’

జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భాజపా ఆరోపించింది. వెంటనే ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ భూమిపై ఏ శక్తీ జమ్మూ-కశ్మీర్‌లో తిరిగి ప్రత్యేక జెండాను ఎగురవేయలేదని వ్యాఖ్యానించింది. ముఫ్తీ వ్యాఖ్యల్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణించాలని భాజపా జమ్మూకశ్మీర్‌ శాఖ అధ్యక్షుడు రవీందర్‌ రైనా కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహేశ్‌భట్‌ నన్ను వేధించాడు: నటి

బాలీవుడ్‌లో పేరుపొందిన నిర్మాత మహేశ్‌భట్‌ తనని వేధింపులకు గురి చేశాడంటూ నటి లువియానా లోధ్ ఆరోపణలు చేశారు. ఆయన నుంచి తనకి ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. మహేశ్‌భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ను వివాహం చేసుకున్న లువియానా ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే మహేశ్‌భట్‌పై పలు ఆరోపణలు చేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. బాధగా ఉంది.. తప్పెక్కడో గుర్తించాలి

2020 సీజన్‌లో చెన్నై కథ ముగిసింది. ముంబయితో గత రాత్రి తలపడిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ ప్రదర్శన పట్ల బాధగా ఉందన్నాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ ఏడాది తమది కాదని.. ఒకటి, రెండు మ్యాచ్‌ల్లోనే తాము సమష్టిగా రాణించామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో పది వికెట్లతో ఓడామా, ఎనిమిది వికెట్లతో ఓడామా అనేది ప్రాధాన్యం కాదని, ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నా విశ్వ ప్రయత్నం చేస్తున్నారని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కోలుకుంటున్న కపిల్‌ దేవ్‌ 

10. మీరు స్టార్ట్‌ చేస్తారా? వేరే ప్రాజెక్ట్‌ చూసుకోనా?

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు-2’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ విషయంలో దర్శకుడు శంకర్‌ తీవ్ర అసహనానికి గురైనట్లు పలు కోలీవుడ్‌ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌కు ఓ లేఖ రాసినట్లు సమాచారం. షూటింగ్‌ విషయంలో తమ ఆలోచనలేంటో త్వరగా చెప్పాలని... లేకపోతే తాను వేరే ప్రాజెక్ట్‌ చేసుకునేందుకు అంగీకారమైనా తెలపాలని శంకర్‌ సదరు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.