close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. వ్యవస్థలో మార్పు తెస్తాం: జగన్‌

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల సమస్యలను పాదయాత్రలో చూశానని, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లద్దాఖ్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షిస్తున్నారు. లద్దాఖ్‌లోని నిము ప్రాంతంలో సీనియర్‌ ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిము కఠినమైన భూభాగాలలో ఒకటి. ఇక్కడ ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని మాట్లాడారు. సరిహద్దులో తాజా పరిస్థితులను ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో 837 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38,898 మంది నమూనాలు పరీక్షించగా 837 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 46 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 789 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్‌‌? 

‘కరోనా’ వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)  భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ రాసిన ఓ లేఖ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో క్లినికల్‌ ట్రయల్స్‌ వేగవంతంగా జరిపేందుకు డీసీజీఐ అనుమతి సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు, సస్పెన్షన్‌ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున తాను ఎన్నికయ్యాయని  కానీ,  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌హెడ్‌పై తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని  రఘురామకృష్ణరాజు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. అధికారం ఉందని విర్రవీగొద్దు : ఎంపీ కనకమేడల

ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలను తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌  ఖండించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వ రాజ్యాంగ పరిధిలోకి లోబడి నిర్ణయాలు తీసుకుంటేనే చెల్లబాటు అవుతాయని.. బీఆర్‌ కపూర్‌ వర్సెస్‌ తమిళనాడు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందని గుర్తు చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు విర్రవీగి చేయటం తగదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌గా తాజాగా ఈసంఖ్య 20వేలు దాటింది. గడి‌చిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 20,903 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం ఒక్క‌రోజులోనే ఈ స్థాయిలో న‌మోదుకావ‌డం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 6,25,544కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. స్టేడియంలో ప్రత్యక్షమైన ఒసామా బిన్‌లాడెన్‌

అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్‌ ఇటీవల ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న ఓ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. తొమ్మిదేళ్ల కిందటే చనిపోయిన లాడెన్‌ ఇప్పుడు ఎలా వచ్చాడని తలపట్టుకోకండి.. చనిపోయిన మనిషి తిరిగి రాలేడు.. కానీ ఆయన కటౌట్‌ ఒకటి స్టేడియంలో ప్రేక్షకుల గ్యాలరీలో దర్శనమిచ్చింది. వివరాళ్లోకి వెళ్తే.. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా క్రీడాపోటీలు ప్రేక్షకులు లేకుండానే జరుపుకొనేందుకు ప్రభుత్వాలు అనుమితిచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. వ్యాక్సిన్‌: భార‌త్‌లో మ‌రో కంపెనీ ముంద‌డుగు!

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంటున్న‌‌ కొవిడ్-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌లో ఫార్మా కంపెనీలు త‌ల‌మున‌క‌లయ్యాయి. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకా‌పై మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు డ్ర‌గ్ కంట్రోల‌ర్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త్‌కు చెందిన‌ మరో కంపెనీకి డీసీజీఐ అనుమ‌తినిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. జియోలోకి ఇంటెల్‌ రూ.1,894 కోట్ల పెట్టుబడులు

ప్రముఖ టెలికాం రంగ సంస్థ జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌కు చెందిన ‘ఇంటెల్‌ క్యాపిటల్‌’ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 1,894 కోట్లు. జియోలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఇది పన్నెండోది. ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్‌, కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఎల్ కాటర్‌టన్‌, వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.