close

తాజా వార్తలు

Updated : 04/08/2020 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. హెచ్‌-1బీ వీసా: మరోసారి షాకిచ్చిన ట్రంప్‌‌ 

కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఆయన దృష్టి హెచ్‌-1బీ వంటి వలసదారుల వీసాల మీదే ఉంది. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను, మరీ ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాలో ఉన్న వారిని నియమించకుండా నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సోమవారం ట్రంప్‌ సంతకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం(3వ తేదీన) 1,286 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 68,946కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 563కి చేరింది. కరోనా నుంచి కోలుకుని సోమవారం 1066 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 49,675కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అమరావతి రైతుల మానవహారం

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్‌ యాక్సిస్‌ రహదారిపై నిరసన చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మరికొందరు వేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌: 24గంటల్లో 803 మంది మృతి!

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా రికార్డుస్థాయిలో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 803 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 38,938కి చేరింది. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 52,050 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 18,55,745గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టిక్‌టాక్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించారు. తమ దేశంలో టిక్‌టాక్‌  కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించాలని.. అలా జరగకపోతే నిషేధం విధిస్తామని హెచ్చరించారు. అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ కార్యకలాపాలను, సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. మైక్రోసాఫ్ట్‌ లేదా ఏ ఇతర అమెరికన్‌ కంపెనీ కొనుగోలు జరిపినా.. చేతులు మారిన మొత్తంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలని ఆయన నిబంధన విధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చిన్నారిని హతమార్చిన నిందితుడికి ఉరిశిక్ష

ఏపీలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్‌  కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ప్రకాష్‌కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే... 2019 నవంబర్‌ 10న విజయవాడ గొల్లపూడిలోని ఇంటి వద్ద ఆడుకుంటున్న ద్వారక అనే చిన్నారిని అపహరించిన నిందితుడు అనంతరం హత్య చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముంబయి సురక్షితం కాదు: అమృత ఫడణవీస్!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు విచారణపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిహార్‌ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించడంలేదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసుపై ముంబయి పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడంలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్‌ ముంబయి పోలీసుల తీరుపై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరి మృతి 

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎ.బాలు(50) మృతి చెందాడు. భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ  బాలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఆగ్రహంతో ప్రత్యర్థులకు సంబంధించిన నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరి మృతి

 కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కుటుంబ సోమవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అవనిగడ్డ-విజయవాడ కృష్ణా కరకట్టపై అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అధీర పాత్ర డిజైన్‌ వెనుక..

ఇటీవల సంజయ్‌దత్‌ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్: చాప్టర్‌-2లోని ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కేజీఎఫ్‌-1లోని గరుడను మించిన క్రూరుడిగా ఆ పాత్ర రూపం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వైకింగ్‌ లుక్‌లో సంజయ్‌దత్‌ స్టిల్‌తో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ పాత్ర ఆహార్యంపై సంజయ్‌ దత్‌ ఎంతో శ్రద్ధ చూపారని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.