close

తాజా వార్తలు

Published : 26/09/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. భాజపా జాతీయకార్యవర్గంలోకి తెలుగు మహిళలు

భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు!

ఏపీ ప్రభుత్వంపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై కరోనా కేసు పెట్టి.. కరోనా అంటించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ పెద్దల చర్యలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కొందరు ఆలయాలు, తన కార్యాలయంపై దాడులకు ప్రయత్నిస్తున్నారనీ..  రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆవేశంలో మాట్లాడితే తనపై కేసులు పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మత మార్పిడిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బిహార్‌ బరిలో శివసేన?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతి రోజు నుంచే నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి వ్యవహారాన్ని పావుగా వాడుకోవాలని బిహార్‌లో నేతలు చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్పందించారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, పరిపాలన తదితర సమస్యల పరిష్కారమే అజెండాగా బిహార్‌ ఎన్నికలు జరగాలని, తీర్చడానికి సమస్యలు లేవని అక్కడి నేతలు భావిస్తే.. ప్రజా సమస్యలను ముంబయి నుంచి పార్సిల్‌లో పంపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అనుష్కతో వివాదం: సన్నీకి పెరుగుతున్న మద్దతు!

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యత సునీల్‌ గావస్కర్‌, సినీనటి, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై దుమారం రేగుతోంది. గావస్కర్‌కు మద్దతుగా ‘WeSupportGavaskar’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. అనుష్కపై ఆయన ఎక్కడ ‘సెక్సీస్ట్‌’ వ్యాఖ్యలు చేశారో నిరూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సన్నీ అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌ చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘దిశా’ ఘటనపై వర్మ చిత్రం: ట్రైలర్‌ చూశారా?

నగర శివారులో గతేడాది ‘దిశా’ అనే యువతిపై కొంతమంది యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం ఆ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ కూడా చేశారు. అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘దిశా ఎన్‌కౌంటర్‌’ పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం ఆర్జీవీ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఆనంద్‌ చంద్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌, సోనియా, ప్రవీణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహమ్మారిని ఆఫ్రికా అడ్డుకుంటోంది

6. ఇలాగే అయితే..20 లక్షల మరణాలు!: WHO

ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాటం కొనసాగించకపోతే..20 లక్షల కొవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ‘పది లక్షలు అనేది భయంకరమైన సంఖ్య. ఇప్పుడు 20 లక్షలు అనే సంఖ్యను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామా? కలిసిపనిచేయకపోతే..ఆ సంఖ్యను కూడా చూస్తాం. అది చాలా ఎక్కువ. ఊహించదగినది, దురదృష్టవశాత్తూ చాలా అవకాశం కూడా ఉంది’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్ మైకల్‌ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహీ.. నువ్వేం మారలేదు

భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్నాడు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన మహీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాది దాటింది. అయినా.. తనలోని కీపర్‌లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ వికెట్‌ కీపింగ్‌లో మెరుపు విన్యాసాలు చేస్తున్నాడు. శుక్రవారం దిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా సామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌ ఆడిన బంతిని ధోనీ అద్భుతంగా ఫుల్‌లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. పూర్తిగా గాల్లోకి ఎగిరి ధోనీ అందుకున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ క్యాచ్‌ చూసి మైదానంలోని ఆటగాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హేమంత్‌ హత్యకు నెల ముందే కుట్ర

రాష్ట్రంలో కలకలం రేపిన హేమంత్‌ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. హేమంత్‌ హత్యకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఎలా ప్రణాళిక రంచించాడు.. తదితర విషయాలను పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... చందానగర్‌కు చెందిన హేమంత్‌, లక్ష్మారెడ్డి కుమార్తె అవంతి రెడ్డి జూన్‌ 10న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. జూన్‌ 11న అవంతి- హేమంత్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి నాలుగు నెలల పాటు అవంతి తల్లిదండ్రులు అవమానంతో ఇల్లు దాటి బయటకు రాలేదు. పగతో రగిలిపోతున్న లక్ష్మారెడ్డి హేమంత్‌ను అడ్డు తొలగించేందుకు నెల రోజుల క్రితమే హత్యకు ప్లాన్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సాధారణ జీవితం గడుపుతున్నా: అనిల్‌ అంబానీ

‘నేను సాధారణ జీవితం గడుపుతున్నాను. ఒక్క కారు మాత్రమే వాడుతున్నాను. చట్టపరమైన రుసుములు చెల్లించడానికి నా బంగారాన్ని అమ్ముకున్నాను’ ఈ మాటలు మాట్లాడింది మరెవరో కాదు రుణాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త, దేశంలోనే ధనవంతుల్లో ఒకరిగా కొనసాగిన అనిల్ అంబానీ. భారత్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే హైకోర్టు ఎదుట హాజరైన ఆయన ప్రస్తుత తన జీవన శైలి, ఆస్తులు, అప్పుల గురించి తెలియజేశారు. అంబానీ సంస్థ ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్‌ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే యత్నాల్లో భాగంగా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్‌ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్‌, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆయన్ను బ్రిటన్‌లో కోర్టుకు లాగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి: సునీత

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది సంగీత కళాకారులకు మార్గం చూపించారని, ఆయన మరణం తీవ్రంగా బాధిస్తోందని సినీ గాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పాడుతా తీయగా..’ కార్యక్రమం ద్వారా తమను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత బాలుదేనని గుర్తు చేసుకున్నారు. ‘ఛిద్రమైన నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ.. నాకు బాసటగా నిలుస్తూ.. జీవితం మీద మమకారం పెంచిన నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే...’ అని గాయని సునీత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.