close

తాజా వార్తలు

Published : 18/10/2020 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు:డీకే అరుణ

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని.. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ అండర్ గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌కే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాగల 24గంటల్లో మళ్లీ వర్షం

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఉదయమంతా ఎండ, పొడి వాతావరణం ఉన్నా, సాయంత్రమైతే చిరు జల్లులతో మొదలై కుంభవృష్టి కురుస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అదే విధంగా తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వచ్చే ఫిబ్రవరి కల్లా చివరి దశకు కరోనా!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత గరిష్ఠ స్థాయి దాటిపోయిందని కేంద్రం నియమించిన కొవిడ్‌ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది. అన్ని జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం కరోనా వైరస్‌కు సంబంధించి పలు కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో కొవిడ్‌ తీవ్రత, అంచనాలపై కేంద్రం ఐఐటీ, ఐసీఎంఆర్‌ సభ్యులతో కొవిడ్‌-19 భారత్‌ సూపర్‌ మోడల్‌ పేరుతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ నేతృత్వం వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ముంపుబారిన 37,409 కుటుంబాలు:లోకేశ్‌ కుమార్‌

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కమార్‌ తెలిపారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయని.. వరద ప్రభావంతో 37,409 కుటుంబాలు ముంపు బారిన పడ్డారని చెప్పారు. గుర్రం చెరువుకు వరద వచ్చేందుకు అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల నుంచి 2,100 కుటుంబాలను నిన్న సాయంత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాట్సాప్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఎలా?

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ సరికొత్త సేవలను తమ ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్‌ ద్వారానే బిల్లులు చెల్లించేలా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకునేలా వీలు కల్పించింది. బ్యాంకింగ్ రంగంలో వాట్సాప్‌ ద్వారా ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఐసీఐసీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలను ఇది వరకే అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల నుంచి మంచి స్పందన రావడంతో తాజాగా మరికొన్ని జత చేసింది. అవేంటో తెలుసుకుందామా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

రక్షణ రంగంలో భారత్‌ మరో మైలు రాయిని దాటింది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని కోల్‌కతా శ్రేణి డెస్ట్రాయర్‌ ‘ఐఎన్‌ఎస్‌ చెన్నై’ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ఇవాళ పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీవో ట్విటర్‌లో ప్రకటించింది. ఇటీవల బ్రహ్మాస్‌ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయోగాలు చేపడుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోస్‌ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భయపడుతూ బ్యాటింగ్‌ చేయలేను: ధావన్‌

భయపడుతూ బ్యాటింగ్‌ చేయడం తనవల్ల కాదని దిల్లీ డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. శనివారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో దిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్‌కు టీ20 లీగ్‌ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అయినప్పటికీ సంబరాలు చేసుకోలేదు. మ్యాచ్‌ ముగిసే వరకు ఎదురుచూశాడు. తన జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాతే బ్యాట్‌ ఎత్తి తనదైన స్టైల్‌లో సెంచరీని ఆస్వాదించాడు. ఈ శతకంపై ధావన్‌ మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌Xకోల్‌కతా: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

8. ఉద్యోగుల కోసం మారుతీ కొత్త ఆఫర్‌!

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంగా ఉద్యోగులకు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఈ పండగ సీజన్‌లో మారుతీ కార్ల కొనుగోలుపై వారికి రూ.11 వేలకు వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు.. పోలీసు, పారామిలటరీ సిబ్బంది కొత్త కారు కొనేటప్పుడు ఈ ప్రయోజనాలను అందిస్తామని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టిందని, తమవంతు బాధ్యతగా వీటిని అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  (మార్కెట్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఆడపిల్లల్ని కాదు.. అపరాధుల్ని రక్షిస్తున్నారు’

యూపీలో భాజపా సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమం కంటే ఆపరాధుల్ని రక్షించే పనులే కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. పరోక్షంగా.. జైల్లో బంధించిన ఓ నిందితుణ్ని భాజపా ఎమ్మెల్యే విడిపించి తీసుకెళ్లిన ఘటనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బేటీ బచావోతో ప్రారంభమైన పథకం.. అపరాధీ బచావో(నేరగాళ్లను రక్షించండి) దిశగా సాగుతోంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అఫ్గాన్‌లో బాంబు పేలుడు.. 16 మంది మృతి

10. వేధింపులు తాళలేక కారులో నుంచి దూకేసి..

ఓ క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులు భరించలేక ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారులోంచి బయట దూకేశారు. ఇది గమనించిన స్థానికులు కారును వెంబడించి అందులో ఉన్న మరో మహిళను రక్షించారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది. రంజిత్‌ ఎవెన్యూ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు ఓ క్యాబ్‌ను‌ మాట్లాడుకున్నారు. అయితే, దారిమధ్యలో క్యాబ్‌ డ్రైవర్‌ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో క్యాబ్‌ వేగాన్ని పెంచి తన దుశ్చర్యను కొనసాగించాడు. అతడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు మహిళలు నడుస్తున్న కారులో నుంచి బయటకు దూకేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.