close

తాజా వార్తలు

Updated : 19/10/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. ప్రతి ఇంటికి ₹10వేల ఆర్థిక సాయం: కేసీఆర్‌

భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు వరదలపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరదల కారణంగా హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంత ప్రజలు ఎన్నో అష్టకష్టాలకు గురయ్యారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌ చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం

2. వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటన

వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఆయన‌ పర్యటించారు. ఉదయం జగ్గయ్యపేట చేరుకున్న ఆయనకు తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగ్గంపేట మండలం రామవరం నుంచి తన పర్యటనను ప్రారంభించిన లోకేశ్‌.. వరదలకు కూలిన ఇళ్లు, ముంపులో ఉన్న పొలాల్ని పరిశీలించారు. అనంతరం కిర్లంపూడి మండలం గోనెడలో ఏలేరు వరద ముంపులో ఉన్న పంట పొలాల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చిక్కుల్లో ట్విటర్‌

జమ్మూకశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపించి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ వివాదంలో చిక్కుకుంది. లద్దాఖ్‌లోని లేహ్‌ ప్రాంతంలో ఉన్న యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఓ పాత్రికేయుడు ట్విటర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ భద్రత వ్యవహారాల విశ్లేషకులైన నితిన్ గోఖలే అమరవీరుల చిహ్నమైన హాల్‌ ఆఫ్ ఫేమ్ నుంచి ట్విటర్‌ వేదికగా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో ట్విటర్‌ వీడియోలో లొకేషన్ ట్యాగ్ ‘జమ్మూకశ్మీర్, పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్ చైనా’గా దర్శనమిచ్చింది. గోఖలేతో పాటు ఇతర ట్విటర్‌ యూజర్లు వెంటనే ఆ తప్పును గుర్తించారు. ట్విటర్, ట్విటర్ ఇండియా అధికార ఖాతాల్లో దాన్ని ఎత్తిచూపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కమలకు అవమానం, భారతీయ అమెరికన్ల ఉద్యమం

జార్జియా రాష్ట్రంలోని మెకాన్‌ నగరంలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో.. డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పేరును.. రిపబ్లిక్‌ పార్టీ సెనేటర్ డేవిడ్‌ పెర్‌డ్యూ తప్పుగా సంబోధించిన సంగతి తెలిసిందే. ‘‘కాహ్‌-మా-లా? కాహ్‌-మాహ్‌-లా? కమలా-మలా- మాలా? ఏదో నాకు తెలియదు.. ఏదైనా కానీయండి..’’ అంటూ వేలాది మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఆయన అనటం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ విధమైన ప్రవర్తనను కమల మద్దతుదారులే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఖండిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీధుల్లో భిక్షమెత్తుకుంటున్న విద్యాకుసుమం

ఆమె ఓ విద్యాకుసుమం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు అంగ్లంలో పట్టభద్రురాలైన హన్సీ ప్రహారి అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. అక్కడి గ్రంథాయంలో ఉద్యోగం చేస్తుండేవారు. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన హన్సీ ప్రస్తుతం హరిద్వార్‌లోని రైల్వే స్టేషన్, బస్టాండు, గంగా తీరంలోని ఘాట్‌లలో భిక్షమెత్తుకుంటున్నారు. ఆమె గతంలో.. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్‌ టమ్‌టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆమెతోనే వీధుల వెంటే జీవిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 19 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌

ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ తినడం అలవాటైన రోజులివి. అందుకే మొబైల్‌ ఛార్జింగ్‌ విషయంలోనూ యూజర్లు వేగం కోరుకుంటున్నారు. భారీ బ్యాటరీ ఉన్నా నిమిషాల్లో ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వాలని ఆశిస్తున్నారు. దీంతో చాలా సంస్థలు ఫాస్ట్‌ ఛార్జర్లను రంగంలోకి దించాయి. ఈ క్రమంలో షావోమి ఓ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసింది. షావోమీ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జర్లను తీసుకురావడం కొత్తేమీ కాదు. గతంలో 50 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌ను ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ ఛార్జర్‌ 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ చేసింది. ఇప్పుడు 80 వాట్‌ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌ను రూపొందించింది. ఇది 4,000 బ్యాటరీని 19 నిమిషాల్లో  పూర్తి ఛార్జి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దసరాకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇస్తానన్న బాలకృష్ణ

పౌరాణిక, జానపద చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే అతికొద్దిమంది నటుల్లో అలనాటి నటుడు ఎన్టీఆర్‌ ఒకరు. ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు బాలకృష్ణ కూడా ఈ జానర్‌ సినిమాల్లో అందెవేసిన చేయి. సుదీర్ఘ సంభాషణలను సైతం అలవోకగా చెప్పేస్తారు బాలయ్య. దసరా పండగ రోజు ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వన్నట్లు ప్రకటించారు. ఆయన కీలక పాత్రల్లో స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘నర్తనశాల’. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన షూటింగ్‌ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బ్రహ్మాజీ ఇంట్లోకి చేరిన వరద నీరు

8. లాభాల్లో ముగిసిన మార్కెట్లు: కారణాలివే!

దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్లు లాభపడి, 40,431 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 11,873 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.37గా ఉంది. ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 318 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 82 పాయింట్లతో ముందుకు కదలాడింది.ఫైనాన్షియల్‌, మెటల్‌ షేర్ల అండతో ఒకానొక దశలో సెన్సెక్స్‌ 40,519 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకగా, చివరకు 448 పాయింట్ల లాభంతో 40,431 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11,850 పాయింట్ల మార్కుపైనే ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీస్‌ లాకప్‌లో 10 రోజులు.. దారుణం!

లాకప్‌లో పోలీసులు తనపై పది రోజులు అత్యాచారానికి  పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళ ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని జైలులో ఉన్నారు. హత్య కేసుకు సంబంధించి తనను ఈ ఏడాది మేలో అరెస్టు చేసిన పోలీసులు అదే నెల 10వ తేదీ నుంచి 21 వరకూ తమ కస్టడీలో ఉంచుకొని అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తనకు రక్షణగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ వాళ్లు బెదిరించారని మహిళ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాస్కులు పనిచేయవన్నందుకు..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు పనిచేయవని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుపై ట్విటర్ చర్యలు తీసుకొంది. ఆయన చేసిన పోస్టును తొలగించింది. కరోనావైరస్‌ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు స్కాట్ అట్లాస్‌ ఆగస్టులో శ్వేతసౌధంలో సలహాదారుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన ‘మాస్కులు పనిచేస్తాయా? లేదు’ అంటూ ట్వీట్ చేశారు. వాటి విస్తృత వినియోగానికి మద్దతు లేదన్నారు. ఈ ట్వీట్ కొవిడ్-19 గురించి తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తికి దోహదం చేస్తోందని, ఇది తమ సంస్థ విధానానికి విరుద్ధమంటూ ట్విటర్ దానిపై తొలుత తప్పుడు సమాచారం అనే ట్యాగ్‌ ఇచ్చింది. ఆదివారం ఆ ట్వీట్‌ను పూర్తిగా తొలగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.