close

తాజా వార్తలు

Updated : 31/10/2020 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తా: కేసీఆర్‌

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరుపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతానని సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి ఒక్కరికీ విజన్‌ ఉండాలి‌: చంద్రబాబు

విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో పరిపాలనను అనేక సంక్షోభాలతో ప్రారంభించాం...అయినా, రెండంకెల వృద్ధి రేటు సాధించామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. దేశవృద్ధి రేటు కంటే 3.5శాతం ఎక్కువ వృద్ధిరేటుసాధించినట్లు చెప్పారు. ముంబయి ఐఐటీ విద్యార్థులతో ఆన్‌లైన్‌ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలతోపాటు కరోనా సంక్షోభం గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్‌ వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సమర్థత బయటపడుతుంది. వర్చువల్‌ కార్యాలయాలు, డిజిటల్‌ వేదికలు ఈ సంక్షోభంలో వచ్చిన వినూత్న ఆలోచనలే. కొత్త రాష్ట్రంలో అనేక సంక్షేమాలతో పాలన ప్రారంభించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరెంటు మీటరా? కారు మోటరా? తేల్చుకోండి

వ్యవసాయ బోర్ల వద్ద కరెంటు మీటరా? 24 గంటల పాటు ఉచిత కరెంటా? ప్రజలే నిర్ణయించుకోవాలని తెరాస సీనియర్‌ నేత, మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో భాగంగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. రేపటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ఉదయం నుంచే గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. రాయపోల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన హరీశ్‌రావు భాజపాపై మండిపడ్డారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో ఆఫర్‌

4. బ్రీత్ టెస్ట్‌ ద్వారా కొవిడ్‌ నిర్ధారణ!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్‌-19ను నిర్ధారించేందుకు ముక్కు లేదా నోటి ద్వారా స్వాబ్‌ను సేకరించి కొవిడ్‌ ఉందో లేదో పరీక్షిస్తున్నాం. వ్యాధి సంక్రమణను అరికట్టే ఉద్దేశంతో ఈ టెస్టులను నిర్వహిస్తున్నాం. దీనివల్ల డబ్బుతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. పైగా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడమూ కష్టంతో కూడుకున్న వ్యవహారం. అదే క్షణాల్లో చిన్నపాటి బ్రీత్‌ టెస్ట్‌ ద్వారా కొవిడ్‌-19ను నిర్ధారించగలిగితే? అమెరికా ఫ్లోరిడాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకులు అలాంటి ఓ కొత్త టెస్టును అభివృద్ధి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇల్లెక్కిన స్కార్పియో.. మహీంద్రా ఫిదా

సొంత సంపాదనతో లేదా తొలిసారిగా కొనుక్కున్న వస్తువులపై ఎంతో మమకారం చూపిస్తాం. దాన్ని అపురూపంగా చూసుకుంటాం. అది సహజమే. బిహార్‌కు చెందిన ఇంతజార్‌ ఆలమ్‌కు తన తొలి కారు స్కార్పియో అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే.. ఏకంగా తన ఇంటిపైన అచ్చం స్కార్పియో ఆకారంలో నీటి ట్యాంకును కట్టుకుని.. కారు మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. భగల్‌పూర్‌కు చెందిన ఇంతజార్‌ ఇటీవల తాను కూడబెట్టుకున్న డబ్బుతో ఒక స్కార్పియో కొనుగోలు చేశాడు. అది తన తొలి కారు అవడంతో చాలా అపురూపంగా చూసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఉచిత టీకా హామీ ఉల్లంఘనేమీ కాదు: ఈసీ

బిహార్‌లో భాజపా ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్‌ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త సాకేత్‌ గోఖలే కోరిన సమాచారం మేరకు ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన విషయంలో పార్ట్‌-VIIIలో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత టీకా హామీ ఉల్లంఘించడం లేదని ఈసీ వివరించింది. ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఎలాంటి సమంజసమైన హామీలనైనా మేనిఫెస్టోలో చేర్చవచ్చని గుర్తుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా ఎన్నికలు: ఏ వర్గం ఎవరివైపు?

మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వెలువడుతున్న సర్వేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా ‘2020 కోఆపరేటివ్‌ ఎలక్షన్‌ స్టడీ’ తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. మొత్తం 71 వేల మందిని ఆన్‌లైన్‌లో సర్వే చేశారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్య ఈ ప్రక్రియ జరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌ వైపు మొగ్గుచూపుతుండగా... 43 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు మద్దతు పలికారు. ఈ అధ్యయనాన్ని 2006 నుంచి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది పరిశోధకులు జరుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: 700 కి.మీల ట్రాఫిక్‌జామ్‌

8. అవి గుర్తొస్తే కన్నీళ్లొస్తాయి కానీ..: పూరీ

జీవితంలో మనం అనుకున్న విజయం సాధించిన తర్వాతే.. అసలైన కష్టాలు మొదలౌతాయని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అంటున్నారు. తిండి, ఇంటి అద్దె కోసం ఇబ్బందిపడే రోజులే బాగుంటాయని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘స్ట్రగ్లింగ్‌ డేస్‌’ గురించి మాట్లాడారు. ‘నిజానికి మన ‘స్ట్రగ్లింగ్‌ డేస్‌’లో తిండి కోసమో, అద్దె కట్టడం కోసమో ఇబ్బందిపడి ఉంటాం. అవి అసలు కష్టాలే కాదు. ఒక పూట తినకపోయినా ఏం కాదు.. ఎండలో ఎండినా ఫర్వాలేదు. ఏదో తెలియని కసితో పరిగెడుతుంటాం. వారానికి ఓసారి అర కిలో చికెన్‌ తెచ్చుకుంటే పండగ. నమ్మండి.. ఇవే మంచి రోజులు. ఒకవేళ మీరు అనుకున్న సక్సెస్‌ డేస్‌ వచ్చేస్తే ఇకంతే..’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నితీశ్ అవినీతిని మోదీనే బయటపెట్టారు: తేజస్వీ

ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వంలో 60 కుంభకోణాలు చోటుచేసుకున్నాయని శనివారం మహాగట్‌ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ విమర్శలు చేశారు. వాటివిలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని వెల్లడించడంతో పాటు..వాటికి ఆధారమిదే అంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియో ఒకదాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 30కు పైగా కుంభకోణాలకు పాల్పడిందంటూ మోదీ వ్యాఖ్యానించడం అందులో కనిపిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గేల్‌ 99 ఔట్‌: జోఫ్రాకు ముందే తెలుసా?

క్రికెట్లో జోఫ్రా ఆర్చర్‌ను నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. తాజాగా క్రిస్‌గేల్‌ను 99 పరుగుల వద్ద ఔట్‌ చేస్తానని అతడికి ముందే తెలుసని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2013లో అతడు చేసిన ట్వీటును విపరీతంగా షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు.  గేల్‌ను ఆర్చర్‌ 99 వద్ద ఔట్‌ చేయడంతో తాజాగా అతడు 2013లో చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘నేను గనక బౌలింగ్‌ చేస్తే అతడు 100 పరుగులు చేయలేడని నాకు తెలుసు’ అన్న ట్వీట్‌ను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. జోఫ్రాకు ఈ విషయం ముందే తెలుసని అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ముంబయిXదిల్లీ: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.