close

తాజా వార్తలు

Published : 28/11/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. ‘కొవాగ్జిన్‌’ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా నివారణకు రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ పురోగతిపై భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్‌ జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ సన్నద్ధత, ట్రయల్స్‌ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పర్యటన ముగిసిన అనంతరం భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవాగ్జిన్‌ పురోగతిపై మోదీ సమీక్ష

2. డిసెంబర్‌ 2న 'బురేవి' 5న ‘టకేటి’ తుపాన్లు

ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. డిసెంబర్‌2న  'బురేవి తుపాను' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై  దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుపాను' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేంద్ర ప్యాకేజీ ఎవరికైనా అందిందా?: కేటీఆర్‌

కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించిందని, అది ఎవరికైనా అందిందా అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. శనివారం బేగంపేట మ్యారీగోల్డ్‌ హోటల్‌లో అగర్వాల్‌, మహేశ్వరి, మార్వాడి, గుజరాతీ వ్యాపారవేత్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఫలాలు ఎవరికీ అందలేదని వివరించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నట్లు భాజపా ఆరోపిస్తోందని.. అలాగైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌లో 69% కొత్త కేసులు ఇక్కడే!

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ చలికాలంలో వైరస్‌ వ్యాప్తి క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 41,452 కొత్త కేసులు, 615 మరణాలు నమోదయ్యాయి. అయితే, కరోనా తీవ్రత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లలోనే అధికం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడిక్‌మెట్‌లో నిర్వహించిన రోడ్‌షోలో సంజయ్‌ పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మళ్లీ జరిగే ఎన్నికల్లో భాజపా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యమని.. సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనా గురించి అలా చెప్పడం ఊహాజనితమే

కరోనా వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందలేదని మేము చెప్పడం అత్యంత ఊహాజనితమవుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలోని ఆహార మార్కెట్‌లో మొదట ఈ మహమ్మారిని గుర్తించిన సంగతి తెలిసిందే. దానిపై వెంటనే సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఈ కమ్యూనిస్టు దేశంపై విమర్శలు చేస్తున్నాయి. దాంతో ఆరోగ్య సంస్థ చైనాకు వచ్చి కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనున్న నేపథ్యంలో..ఆ వైరస్‌కు తమ దేశం జన్మస్థానం కాదంటూ చైనా కొత్త వాదనను ప్రచారం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్‌ 

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. టెహ్రాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్‌ ఫక్రజాదే శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అయితే తమ శాస్త్రవేత్త హత్య వెనుకు ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొసిన్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్‌కు పరోక్ష హెచ్చరిక చేశారు. ఓ ప్రభుత్వ సమావేశంలో రౌహనీ మాట్లాడుతూ.. ‘మొసిన్‌ హత్యతో మా అణ్వాయుధ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు. శాస్త్రవేత్త హత్యకు సరైన సమయంలో ప్రతిస్పందిస్తాం’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాండ్య నాణ్యమైన బ్యాట్స్‌మన్‌: ఆకాశ్‌

నైపుణ్యం గల బ్యాట్స్‌మెన్‌ కన్నా అతడేం చేయగలడో నిరూపించాడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ తీరును మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రశంసించాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో పాండ్య(90) తృటిలో శతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. అతడున్నంత సేపు భారత శిబిరంలో ఆశలు నిలిపాడని ఆకాశ్‌ పేర్కొన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన చోప్రా ఈ మ్యాచ్‌పై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా పాండ్య ఆటను పొగడ్తలతో ముంచెత్తాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాహుల్‌కు క్షమాపణలు చెప్పా: మాక్స్‌వెల్‌

9. తిరుమలలో డిసెంబర్‌ 5నుంచి వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 5వ తేదీ నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేయించనున్నట్లు చెప్పారు. నడక దారిలోని గోపురాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యూపీలో బలవంతపు మతమర్పిడి ఇక నేరమే!

బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించారు. ‘యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడుల బిల్లు 2020’కి గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ శనివారం ఆమోదం తెలిపారు. ఇవాళ్టి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై ఎవరైనా వివాహం పేరుతో చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూ.50వేలు జరిమానా విధిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని