close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. సీఏఏను రద్దు చేయాలి

భారత పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని, అన్ని మతాలను సమానంగా చూడాలని తెలంగాణ మంత్రిమండలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లౌకికత్వానికి ప్రమాదంగా పరిణమించే పౌరసత్వ సవరణ చట్టా (సీఏఏ)న్ని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ శాసనసభలో కూడా దీనిపై తీర్మానం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి, వసతులు, సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు ‘పట్టణ ప్రగతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఏఏపై పునరాలోచన ఉండదు

ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ 370 అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ల విషయమై పునరాలోచన చేసేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో జరిగిన బహిరంగ సభతోపాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ‘శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్టును ఏర్పాటు చేశామని, దీని ఆధ్వర్యంలో పనులు త్వరితగతిన జరుగుతాయని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని, స్మృతి కేంద్రాన్ని ఆవిష్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మన సౌర విద్యుత్తు మనకే

ప్రతిపాదిత 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పూర్తిగా రాష్ట్రంలోనే వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)కు 50 శాతం వాటా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌)ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈసీఎల్‌) ద్వారా ఏర్పాటయ్యే సోలార్‌ ప్రాజెక్టుల్లో 50 శాతం సెకీకి వాటా ఇవ్వాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.25,698 కోట్లు కావలెను!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు రూ.25,698 కోట్ల నిధులు అవసరమని జలవనరుల శాఖ అధికారులు తాజాగా లెక్కించారు. పోలవరం ప్రాజెక్టుపై చేసే ఖర్చు కాకుండా నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఖర్చు ఇది. ఇవికాకుండా కొత్త ప్రాజెక్టులపైనా సర్కార్‌ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం వాటి విలువను రూ.1,17,842 కోట్లుగా లెక్కిస్తున్నా తుది అంచనాలు తేలే సరికి ఈ అంకెలు మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురానున్నారనేది చర్చనీయాంశమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అధునాతనంగా 108

అత్యవసర సేవల(108), గ్రామీణ వైద్య సేవల అంబులెన్సు(104)ల సేవలు మరింత అధునాతనంగా ప్రజలకు చేరువ కాబోతున్నాయి. బాధితులకు నాణ్యమైన సేవలు అందే విధంగా అంబులెన్స్‌ల్లో అత్యాధునిక పరికరాలు మరికొన్నింటిని అదనంగా చేరుస్తున్నారు. ఇక నుంచి ఒకే సంస్థ ద్వారా కాకుండా అత్యవసర స్పందన కేంద్రం (కాల్‌ సెంటర్‌), అంబులెన్సుల నిర్వహణ వేర్వేరు సంస్థల ద్వారా జరగబోతుంది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చక్రాల్లోకి చున్నీ వెళ్లకుండా ఏర్పాట్లు

ద్విచక్ర వాహనాల్లో ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. బైక్‌పై వెనకవైపు కూర్చున్న మహిళల చీర, చున్నీ వంటివి చక్రాల్లోకి వెళ్లిపోయి ప్రమాదాలకు కారణమవుతున్న దృష్ట్యా కొన్ని మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. వెనక చక్రంలో కనీసం సగ భాగాన్ని కప్పి ఉంచేలా వాహన తయారీదారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వెనక వైపు కూర్చున్నవారు పట్టుకునేందుకు వీలుగా వాహనానికి పక్కన గానీ, డ్రైవరు సీటుకు వెనక గానీ ఒక హ్యాండిల్‌ తప్పనిసరిగా బిగించాలని, పాదాన్ని ఆన్చడానికి తగిన ఏర్పాట్లూ చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంజారాహిల్స్‌ శాఖ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు శ్రీనివాస్‌, ఫణీంద్ర ఈ నెల 13న బాలకృష్ణ అకౌంటెంట్‌ వెలిగల సుబ్బారావుకు ఫోన్‌ చేసి వసుంధర ఖాతాకు సంబంధించి మొబైల్‌ బ్యాంకింగ్‌ దరఖాస్తును యాక్టివేట్‌ చేయాలా? అని అడిగారు. తాము ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వారు వసుంధరను సంప్రదించగా.. ఆమె సైతం ఇదే విషయం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బీపీసీఎల్‌ విక్రయానికి మరో అడుగు

దేశంలోనే రెండో అతి పెద్ద ముడి చమురు శుద్ధి సంస్థ అయిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) విక్రయానికి మరో అడుగు ముందుకు పడింది. బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించేందుకు బిడ్‌ దరఖాస్తుల విక్రయానికి మంత్రివర్గ సంఘం ఆమోదించింది. ఇందులో ఆర్థిక, పెట్రోలియం, న్యాయ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల ప్రతినిధులున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం కూడా బీపీసీఎల్‌ విక్రయానికి సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ), ప్రాథమిక సమాచార పత్రాన్ని (పీఐఎమ్‌) ఆమోదించింది. దీన్ని ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థకు పంపించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బీసీసీఐ సీఈవో జోహ్రి రాజీనామా!

బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాహుల్‌ జోహ్రి తన పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడి రాజీనామాను బోర్డు ఇంకా అంగీకరించలేదు. జోహ్రి 2016లో బీసీసీఐకి తొలి సీఈవోగా బాధ్యతలు అందుకున్నాడు. సుప్రీంకోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ నిరుడు నిష్క్రమించడం, గంగూలీ నేతృత్వంలో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని జోహ్రి నిర్ణయించుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మళ్లీ మల్టీస్టారర్‌ చిత్రమా?

అగ్ర దర్శకుడు రాజమౌళికి కథల కొరతే ఉండదు. ఆయన ఇంట్లోనే బోలెడన్ని కథలు సిద్ధమైపోతుంటాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతుంటాయి. ఆయనే రాజమౌళి సినిమాల కోసం కథలు సిద్ధం చేస్తుంటారు. తదుపరి ఏ కథతో సినిమా చేయాలనే విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికొచ్చే అవకాశం రాజమౌళికి ఉంది. అలా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత సినిమాకి కూడా ఇప్పటికే కథ సిద్ధమైందని, అది కూడా మల్టీస్టారర్‌ చిత్రంగానే రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి సినిమాల స్థాయి పెరిగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.