close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ట్వీట్‌ చేస్తే చాలు.. తాట తీస్తారు

రాజధాని నగరంలో వాణిజ్య సముదాయం.. సినిమా హాలులో మీ వాహనం ఉంచితే పార్కింగ్‌ ఫీజు వసూలు చేశారా? అయితే మీరు చేయాల్సింది ఒక్కటే.. సంబంధిత రసీదును విజిలెన్సు విభాగానికి ట్వీట్‌ చేయండి చాలు.. వాళ్లు వసూలుదారుల తాట తీస్తారు. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) విజిలెన్సు విభాగం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు, మాల్స్‌ తదితర వాటిలో ద్విచక్రమోటారు వాహనాలతో పాటు కార్లకు పార్కింగ్‌ చేస్తే మొదటి అరగంట ఛార్జి వసూలు చేయొద్దని కొన్నాళ్ల కిందటే రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వివేకా హత్య వెనుక రాజకీయ పెద్దలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం ఉందని మృతుని భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె ఎన్‌.సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గురువారం హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు.. సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి తగినదని విన్నవించారు. ఈ మేరకు వారి తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదంటున్నారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌ కోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మహారాష్ట్రలోనూ దిశ బిల్లు

మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి దర్యాప్తు, విచారణను 21 రోజుల్లోనే పూర్తిచేసి దోషులకు శిక్షపడేలా చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘దిశ’’ బిల్లును మహారాష్ట్రలోనూ తీసుకొస్తామని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. అందుకవసరమైన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి స్వీకరిస్తామని చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ అభినందనీయులని పేర్కొన్నారు. దిశ బిల్లుపై అధ్యయనానికి ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసింది. ఆ రాష్ట్ర డీజీపీ సుభోద్‌ జైస్వాల్‌, అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు కుటుంబ ఆస్తులు రూ.102.49 కోట్లు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్‌ ఎక్కువ ఆస్తిపరుడు. చంద్రబాబు ఆస్తులతో పోలిస్తే మనవడి ఆస్తుల విలువ రూ.15.55 కోట్లు ఎక్కువ. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువను ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గురువారం ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన తమ కుటుంబసభ్యులు ఐదుగురితో పాటు, తమ కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్‌ ఆస్తుల వివరాలు తెలిపారు. ఈ వివరాలన్నీ ఆయా ఆస్తుల్ని తాము కొన్నప్పుడు, పెట్టుబడులు పెట్టినప్పుడు ఉన్న విలువలని లోకేశ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సరోగసి అన్నాడు.. సరసానికి రమ్మన్నాడు

ఆయన వయసు 70కి దగ్గరవుతోంది. సరోగసీలో బిడ్డను కనివ్వమని ఓ మహిళను కోరాడు. అందుకు డబ్బు ఇస్తానన్నాడు. తీరా ఆ మహిళ అంగీకరించాక... సరోగసీ కాదు... తనతో సహజీవనం చేయాలంటూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. ఎస్సై శివకృష్ణ కథనం ప్రకారం.. ఖైరతాబాద్‌లోని ఓ వసతిగృహంలో ఉండే మహిళ మహారాష్ట్రీయురాలు. భర్త సహా కుటుంబమంతా అక్కడే ఉంటారు. ఉపాధి కోసం ఆమె హైదరాబాద్‌లో నివసిస్తోంది. తన ఆర్థిక ఇబ్బందులను ఇక్కడ పరిచయస్తురాలైన మరో మహిళ వద్ద ప్రస్తావించింది. సరోగసీ ద్వారా గర్భం దాల్చి పిల్లలను కని ఇస్తే డబ్బులొస్తాయని ఆశ చూపడంతో బాధితురాలు అంగీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నా ప్రాణానికి ముప్పు ఉంది

తన భద్రతను ఉపసంహరించాలనే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం విస్మయానికి గురిచేసిందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా సీనియర్‌ నేత శిద్ధా రాఘవరావు అన్నారు. భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఇంటెలిజెన్స్‌ ఐజీకి గురువారం ఆయన లేఖ రాశారు. ‘‘ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మావోయిస్టులు, సంఘవ్యతిరేక శక్తులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి నా ప్రాణానికి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో నా భద్రతను గతంలో ఉన్నట్లే కొనసాగించండి’’ అని లేఖలో ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తృణధాన్యాలు పెట్టండి

విద్యార్థులకు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాలను వినియోగించాలని కేంద్ర మానవ వనరులశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్‌సీ మీనా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. వీటిని వినియోగించడం వల్ల విద్యార్థులకు సూక్ష్మపోషకాలతోపాటు, బి-కాంప్లెక్స్‌ అంది వారికి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉండే జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలను నూక, పిండి రూపంలో పిల్లలకు అందించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యాప్‌తో చెప్పండి.. చల్లగా ఉండండి

ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ) విపణిలో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరకు 10 శాతం వాటా సాధించడమే లక్ష్యమని పానసోనిక్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ గౌరవ్‌ సాహ్‌ తెలిపారు. దేశంలో ఏటా 70 లక్షల ఏసీలు అమ్ముడవుతుండగా, ప్రస్తుతం తమ వాటా 6 శాతంగా ఉందని గురువారం ఇక్కడ తెలిపారు. వచ్చే వేసవి కోసం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మిరాయ్‌ ప్లాట్‌ఫాం కింద ఇంటర్నెట్‌కు అనుసంధానించిన ఇన్వర్టర్‌ ఏసీలు 30 మోడళ్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏ సమయంలో ఎంత ఉష్ణోగ్రత కావాలన్నది యాప్‌లో నమోదు చేస్తే.. ఆ విధంగానే ఏసీ పనిచేస్తుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ. 5 కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం

త్యంత మత్తును కలిగించే ఎఫెడ్రెన్‌ను బాబిన్‌ల మధ్యలో ఉంచి ఆస్ట్రేలియాకు తరలిస్తున్న చెన్నైకి చెందిన ఒకరిని అరెస్టు చేశామని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితుడి నుంచి స్వాధీనపరచుకున్న 5.115 కిలోల మాదకద్రవ్యాల విలువ రూ.5 కోట్లుగా లెక్కగట్టారు. ప్లాస్టిక్‌లో ప్యాక్‌ చేసిన మాదకద్రవ్యాన్ని 45 బాబిన్‌లు, అలంకరణ వస్త్రాలమధ్యఉంచి తరలిస్తూ నిందితుడు దొరికిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఫటాఫట్‌.. ధనాధన్‌

క్రికెట్‌ ప్రేమికులకు  మరో ధనాధన్‌ వినోదం!  టీ20 ప్రపంచకప్‌ వచ్చేసింది. అయితే ఈసారి మెరుపులు మెరిపించేది అమ్మాయిలు. పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్న టోర్నీకి నేడే ఆరంభం. టోర్నీపై ఎప్పుడూ లేనంత ఆసక్తి ఉంది ఈసారి. ఇప్పటిదాకా మూడు జట్లే ప్రపంచకప్‌ను ముద్దాడగా ఇప్పుడు ఇతర జట్లూ గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. మరి ఈసారి కొత్త ఛాంపియన్‌ అవతరిస్తుందా? మళ్లీ పాత జట్టే గెలుస్తుందా? ఎప్పుడూ కప్పెరగని భారత్‌ ఈసారి భారీ ఆశలతోనే బరిలోకి దిగుతోంది. భారీ అంచనాల మధ్య హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని యువ జట్టు కప్పు వేటకు సిద్ధమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో శుక్రవారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.