close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/03/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఇళ్ల వద్దకే కూరగాయలు

ఇక కూరగాయలు, నిత్యావసర సరకుల కోసం పోలీసు కట్టడిని దాటుకుంటూనో దొంగచాటుగానో రెతు బజార్లకు పరుగెత్తనవసరం లేదు.. సరకులు, కూరగాయల వంటివి ఇళ్ల వద్దకే పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే కూరగాయల సరఫరాకు కొన్ని వాహనాలను ప్రవేశపెడుతోంది. వీలు వెంబడి నిత్యావసర సరకులను కూడా పంపాలని భావిస్తోంది. నిత్యావసర సరకుల కొనుగోలుకు గుంపులుగా వస్తున్న ప్రజలను, రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పదికి చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదికి చేరింది. గుంటూరు, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కొక్కటి వంతున కొత్తగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరో 13 కేసుల నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కరోనా బాధితుల కోసం 4 బోధనాసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దుకాణాలు రాత్రి 7లోపు మూయాల్సిందే

తెలంగాణలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలను కఠినంగా అమలు చేయాలని, అనుక్షణం నిఘా ఉంచాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో ప్రతి రోజు రాత్రి ఏడు గంటల లోపు దుకాణాలను మూసివేయకపోతే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై బుధవారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘దుకాణాలను ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తెరిచి ఉంచాలి. ఆలోగా కొనుగోళ్లు చేసుకుని, ఏడు గంటల్లోపే ఇళ్లకు చేరుకోవాలి’ అని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పారాసిటమాల్‌తో ఏమార్చారు!

ఇండోనేసియా నుంచి 17 రోజుల కిందట కరీంనగర్‌కు వచ్చిన పదిమంది విదేశీయులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నారు. వారందరికీ కరోనా పాజిటివ్‌ అని తేలడంతో పాటు వారితో తిరిగిన మరో వ్యక్తి కూడా కరోనా బారిన పడ్డాడు. ఈనెల 9న ఇండోనేసియా నుంచి పదిమంది దిల్లీలో దిగారు. అప్పటికే వారిలో కొందరు తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. విమానాశ్రయంలో పట్టుబడితే ఆస్పత్రిలో చేరుస్తారన్న ఉద్దేశంతో విమానం దిగడానికి ముందు, దిగాక కూడా నాలుగైదు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నారని పోలీసు విచారణలో వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికా వణుకుతోంది

కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతోంది. మంగళవారం ఒక్కరోజే ఆ దేశంలో దాదాపు 10 వేల కేసులు నమోదయ్యాయి. 150 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 55 వేలు దాటగా, మరణాల సంఖ్య 780కి పైగా ఉంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అక్కడ ఒక్కరోజే 53 మంది కన్నుమూశారు. కొత్తగా 5 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాల్లోనూ కొవిడ్‌ బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పత్రికల ద్వారా కరోనా సోకదు

వార్తా పత్రికలు, మ్యాగజీన్ల్ల ద్వారా కరోనా వైరస్‌ సోకిన దాఖలా ప్రపంచవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరిపిన తర్వాత ప్రపంచస్థాయి అత్యుత్తమ వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నారు. ముద్రిత లేఖలు లేదా ప్రింటెడ్‌ బండిళ్ల ద్వారా కూడా ఈ వైరస్‌ సోకినట్లుగా ఎక్కడా తేల్లేదని స్పష్టంచేస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేకుండా వ్యాప్తిచెందే అపోహలపై అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విదేశీయుల వీసాల గడువును పెంచిన బ్రిటన్‌

కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా తమ దేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల వీసాల గడువును బ్రిటన్‌ రెండు నెలల పాటు పొడిగించింది. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బ్రిటన్‌ తమ దేశం నుంచి ఇతర దేశాలకు రాకపోకలు నిషేధించింది. దీంతో లండన్‌లో ఉంటున్న భారతీయులు అక్కడి ఇండియన్‌ హైకమిషన్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించారు. ‘‘జనవరి 24 నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్న, ప్రయాణ సాధనాలు లేక బ్రిటన్‌లోనే ఉండిపోయిన విదేశీయుల వీసాల గడువును మే, 31 వరకూ పొడిగిస్తున్నాం’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అవన్నీ నకిలీవే...

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) శరవేగంగా విస్తరిస్తున్న అమెరికాలో నకిలీ టెస్ట్‌ కిట్లు, మందుల బెడద ఎక్కువైంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భయభ్రాంతులను సొమ్ము చేసుకునేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మా కంపెనీ టెస్ట్‌ కిట్‌తో మీరు ఇంట్లోనే సొంతంగా పరీక్ష చేసుకొని కరోనా వ్యాధి వచ్చిందీ లేనిదీ నిర్ధారించుకోవచ్చు... అని ప్రచారం చేసుకుంటూ టెస్ట్‌ కిట్లు విక్రయించే సంస్థలు అధికమయ్యాయి. అదేవిధంగా  ఈ వ్యాధికి మేం తయారు చేస్తున్న మందులు పరిష్కారాన్ని చూపుతాయి- అని చెప్పుకునే కంపెనీలు కూడా తయారయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫెదరర్‌ విరాళం రూ.7.75 కోట్లు

కరోనా వైరస్‌పై పోరాటం కోసం స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రూ.7.75 కోట్ల విరాళం ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. అక్కడ 8,800 మంది కరోనా బారిన పడగా.. 86 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుండగా.. ఫెదరర్‌ కూడా ఈ జాబితాలో చేరాడు. మరోవైపు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్‌.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 21 రోజులు మంచి అవకాశం

ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు కథానాయికలు. పక్కాగా ప్రణాళికలు వేసుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ విషయంలో  తమన్నా మరింతగా ఆరితేరిపోయారు. కరోనా కారణంగా దొరికిన ఖాళీని కూడా పక్కాగా వాడుకుంటానని చెబుతోంది తమన్నా. ‘‘ఇది కూడా ఓ మంచి అవకాశంగా భావిస్తా. ఇన్నాళ్లు చేయాలనుకుని చేయలేకపోయిన పనులపై దృష్టి పెట్టే సమయం వచ్చింది. అందుకే ఈ 21 రోజుల వ్యవధిని నేను నా జీవన శైలిని మరింత ఆరోగ్యకరంగా, మరింత స్థిరంగా మార్చుకోవడానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.