close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. కరోనాతో వృద్ధుడి మృతి

తెలంగాణలో కరోనాతో ఓ వృద్ధుడు మృతి చెందారు. మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆయనలో కరోనా వైరస్‌ ఉన్నట్లు శనివారం నిర్ధారణ అయింది. ఈ వృద్ధుడితో కలిపి శనివారం 8 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య 67కు పెరిగింది. గాంధీఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 10 మందికి పూర్తిగా నయమైంది. మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌ అని తేలితే వారిని ఇళ్లకు పంపిస్తామని మంత్రి ఈటల చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రతి పదిమందికీ ఒక వైద్యుడు

పొరుగురాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులు, రాష్ట్ర సరిహద్దుల వరకు వచ్చినవారి బాగోగులు చూసేందుకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అధికారులతో సమన్వయం చేసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సతీష్‌చంద్ర, పీయూష్‌కుమార్‌లను ముఖ్యమంత్రి జగన్‌ నియమించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి.. పర్యవేక్షణలో ఉన్న ప్రతి పదిమందికీ ఒక వైద్యుడిని కేటాయించాలని, వీరిపై పల్మనాలజిస్టుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతివ్వాలని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డోర్‌ డెలివరీ సంస్థలతో పాల సరఫరా

స్విగ్గి, బిగ్‌ బాస్కెట్‌ తదితర డోర్‌ డెలివరీ సంస్థల ద్వారా పాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో శనివారం వివిధ డెయిరీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. విజయ డెయిరీ ఎండీ మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలో లాక్‌డౌన్‌కు ముందు రోజూ 30 లక్షల లీటర్ల పాలు సరఫరా కాగా, ఇప్పుడు 27 లక్షలకు తగ్గిందని తెలిపారు. పాల సరఫరాకు సిబ్బంది ముందుకు రాకపోవడమే కారణమని చెప్పడంతో మంత్రి పై విధంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టాటా ఉదారత

కరోనా వైరస్‌ కారణంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. ఆ మహమ్మారిపై పోరు కోసం రూ.1500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కోసం టాటా ట్రస్ట్‌ తరఫున రూ.500 కోట్లు, టాటా సన్స్‌ సంస్థ తరఫున రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఆ సంస్థల ఛైర్మన్‌లు రతన్‌ టాటా, ఎన్‌.చంద్రశేఖర్‌లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అంతర్జాలంలో ఉచితంగా తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలు

కరోనా నిరోధంలో భాగంగా ఇంటి పట్టునే ఉంటున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల’ పత్రికలను అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్టు ‘రామోజీ ఫౌండేషన్‌’ ఓ ప్రకటనలో తెలిపింది. కమ్మటి కథలు, కవితలు, మన భాష, సంస్కృతి, చరిత్రల గొప్పదనాల్ని తెలియచెప్పే కథనాలతో కూడిన 90కి పైగా ‘తెలుగువెలుగు’ సంచికలు; పిల్లల కోసం మంచి కథలు, వింతలు - విశేషాలు, మహనీయుల స్ఫూర్తిగాథలు, వైజ్ఞానిక కథనాలు అందించే 82 ‘బాలభారతం’ సంచికలనూ ఒకేచోట చదువుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఊపిరి పీల్చుకుంటున్న వుహాన్‌

కరోనా వైరస్‌కు జన్మస్థానమైన చైనాలోని వుహాన్‌ నగరం క్రమంగా ఊపిరి తీసుకుంటోంది. జన సందోహం ఆరంభమవుతోంది. శనివారం పాక్షికంగా ఆంక్షల ఛట్రం నుంచి బయటపడింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి దాదాపు రెండు నెలలుగా వుహాన్‌ నగరం నిర్బంధంలో ఉండిపోయింది. ప్రజలను బయటకు రాకుండా అధికారులు నిషేధం విధించారు. నగర శివార్లలో కంచె వేశారు. ఇప్పుడు వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో సుదీర్ఘ ఐసోలేషన్‌ నుంచి ఈ రవాణా, పారిశ్రామిక నగరం బయటపడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక తొలిసారిగా ఇక్కడికి ప్రయాణికుల రైలు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సేవలకు ఆటంకం ఉండదు

బ్యాంకుల అధిపతులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లు వారందరూ అన్ని శాఖలనూ తెరచి ఉంచి.. వినియోగదార్ల సేవలకు ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటామని హామీనిచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో వారంతా అత్యుత్తమంగా సేవలందిస్తున్నారన్నారు. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఐఓబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ల సీఎండీలతో నిర్మలా సీతారామన్‌ విడివిడిగా మాట్లాడినట్లు ఒక ట్వీట్‌ వివరిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కరోనాపై బ్రావో పాట

వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సంగీతాభిరుచి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌తో కలిసి పని చేసే అతను.. అప్పుడప్పుడూ సందర్భానుసారంగా పాటలు రూపొందించి అభిమానులతో పంచుకుంటుంటాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పైనా అతనో పాటను తీర్చిదిద్దాడు. ‘వుయ్‌ నాట్‌ గివింగ్‌ అప్‌’ పేరుతో రూపొందించిన ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నాడు బ్రావో. కరోనాపై అవగాహన పెంచడంతో పాటు జనాల్లో పోరాట స్ఫూర్తిని నింపడం ఈ పాట ఉద్దేశమని అతను వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చిరంజీవి ఆధ్వర్యంలో... మన కోసం

సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా‘సీసీసీ  (కరోనా క్రైసిస్‌ ఛారిటీ) -  మన కోసం’ పేరుతో చిరంజీవి ఆధ్వర్యంలో ఓ సంస్థని ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. ఇందుకోసం డి.సురేష్‌బాబు, ఎన్‌.శంకర్‌, సి.కల్యాణ్‌, దామోదర్‌ప్రసాద్‌, బెనర్జీ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చిరంజీవి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ వివరాల్ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వింత ప్రవర్తనతో ముగ్గురి మృతి

వింత ప్రవర్తనతో నిజామాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. కల్లు దొరక్కపోవడంతోనే వీరు ఇలా ప్రవర్తించినట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఇలా వింతగా ప్రవర్తించిన నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌కు చెందిన శంకర్‌ (45) శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయినగర్‌కు చెందిన శకుంతల(60) వింత ప్రవర్తనతో శుక్రవారం రాత్రి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ముదిరాజ్‌ వీధికి చెందిన మరో వ్యక్తి(50) మూర్ఛతో నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో శనివారం మృతిచెందాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.