close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. తెలంగాణలో వేతనాల్లో కోత

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వ్యయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలోనూ కోత విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోతలుపోను మిగిలిన వేతనాలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  మూడు  వార్డులకో వైద్యుడు

నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున రెండు రకాల బృందాలతో పటిష్ఠ నివారణ చర్యలను చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మొదటి దశలో రోజూ ప్రతి ఇంట్లో సర్వే చేపట్టాలని, విదేశాల నుంచి వచ్చిన  వారున్నా.. లేకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే గుర్తించాలని సూచించారు. రెండో దశలో నగర పాలక సంస్థల్లో ఒక్కో డివిజన్‌కు, పురపాలక సంఘాల్లో 3 వార్డులకో వైద్యుడిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కువ జనసాంద్రత, విదేశాల నుంచి వచ్చినవారు ఉండటంతో పట్టణాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా... వయా దిల్లీ

తెలుగు రాష్ట్రాల్లో కొత్త కలకలం చెలరేగింది. దిల్లీలోని ఒక మతపరమైన సమావేశంలో పాల్గొని వచ్చిన వారు కరోనాతో మరణించడంతో ఉభయ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 1 నుంచి 15 వరకు దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తబ్లిగ్‌-ఏ-జమాత్‌ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వేర్వేరు చోట్ల నుంచి అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఆరుగురు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశాఖలో రోగులు.. కాకినాడలో పరీక్షలు

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో రోగులు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నా అక్కడ మాత్రం నమూనాల పరీక్షలు జరగడంలేదు. అక్కడ సేకరించిన నమూనాలను ప్రస్తుతం కాకినాడ బోధనాసుపత్రికి పంపిస్తున్నారు. అక్కడకు నమూనాలు పంపి, పరీక్షలు జరిగి నివేదికలు వచ్చేంత వరకు రోగుల్లో ఆందోళన నెలకొంటోంది. వైద్యుల పరిస్థితీ ఇంతే. విశాఖ కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో 11 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఈ జాబితాలో కరోనా వైరస్‌ పరీక్షలు లేవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బతుకుల్లో కల్లోలం!

కల్తీకల్లు ప్రభావం మనుషుల మానసిక స్థితిపై ఎంత తీవ్రంగా ఉంటుందో మరోసారి రుజువవుతోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ మత్తు కల్లు దొరక్క చాలా మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మతితప్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఒక్క ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. సోమవారం ఇద్దరు మరణించడంతో ఈ కారణంగా జిల్లాలో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్‌ నగరంలో ఆరుగురు, వికారాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనాతో నష్టపోయిన మీడియాకు 10 కోట్ల డాలర్లు

కరోనా వైరస్‌ తెచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న మీడియా సంస్థలకు తోడ్పాటు అందించేందుకు 10 కోట్ల డాలర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు సామాజిక మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ తెలిపింది. ‘‘కొవిడ్‌-19 మహమ్మారి గురించి ప్రజలకు సమాచారం అందించడానికి మీడియా అసాధారణ పరిస్థితుల్లో పనిచేస్తోంది. జర్నలిజం ఆవశ్యకత బాగా ఉన్న ఈ తరుణంలో.. ప్రకటనలతో వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. ప్రాంతీయ పాత్రికేయులపై ఈ ప్రభావం బాగా పడింది. ఇదే సమయంలో ప్రజలు తమకు అవసరమైన కీలక సమాచారం కోసం వీరిపై ఆధారపడుతున్నారు’’ అని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పోలీసుల అదుపులో రాజస్థాన్‌ వాసులు

కోయంబత్తూరు నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన 24 మంది రాజస్థాన్‌ వాసులను, 9 ద్విచక్రవాహనాలను శంకర్‌పల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఓ ఫంక్షన్‌హాలుకి తరలించారు. వసతి సదుపాయం కల్పించారు. సర్కారు ఉత్తర్వులు వచ్చే వరకు తమ అదుపులోనే ఉంటారని సీఐ గోపీనాథ్‌ స్పష్టం చేశారు. శంకర్‌పల్లిలో చిక్కుకున్న వారంతా రాజస్థాన్‌కి చెందిన కరౌలి జిల్లా వాసులు. ఉపాధి కోసం కోయంబత్తూరుకి వెళ్లారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పని దొరకడం కష్టమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 5000 ‘క్వారంటైన్‌’ గదులకు సన్నాహాలు

కరోనా వైరస్‌ (కొవిడ్‌ -19) వ్యాప్తి మరింత విస్తృతమైనా, వైద్యసాయం అందించేందుకు అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఆసుపత్రుల్లో గదులు దొరకని పరిస్థితి ఏర్పడితే, ప్రత్యామ్నాయంగా హోటళ్లలోని గదులను బాధితులకు ఇచ్చేందుకు ‘ప్రాజెక్టు స్టే-ఐ’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓయో రూమ్స్‌, జింజెర్‌. లెమన్‌ ట్రీ హోటల్స్‌ కలిసి 5,000 గదులు సమకూర్చుతాయి. ఈ గదుల్లో పడకలను ‘హాస్పిటల్‌ ఐసొలేషన్‌’ పడకలుగా తీర్చిదిద్ది, అపోలో హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ సారధ్యంలో టెలీమెడిసిన్‌ పద్ధతిలో వైద్య సేవలు అందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒలింపిక్స్‌ కొత్త తేదీలొచ్చాయ్‌!

కరోనా మహమ్మారి కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌కు కొత్త ముహూర్తం కుదిరింది. ఈ సంవత్సరం జులై 24న ఆరంభమై ఆగస్టు 9 వరకు జరగాల్సిన క్రీడలను 2021లో జులై 23-ఆగస్టు 8 తేదీల మధ్య నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), ఆతిథ్య జపాన్‌ నిర్ణయించాయి. వేసవిలో ఒలింపిక్స్‌ నిర్వహించాలని మొదట జపాన్‌ భావించినా.. యూరో కప్‌ ఫుట్‌బాల్‌, ఉత్తర అమెరికా క్రీడా లీగ్‌లు అదే సమయంలో ఉండడంతో జులై-ఆగస్టు నెలలే సరైనవిగా టోక్యో ఒలింపిక్‌ నిర్వాహక కమిటీ భావించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పీఎం కేర్స్‌ నిధికి... రిలయన్స్‌ రూ.500 కోట్లు

కొవిడ్‌-19పై పోరుకు పారిశ్రామిక దిగ్గజాలు కదలి వస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి తమ వంతు సేవగా భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. కొవిడ్‌-19 బాధితులకు అండగా ఉండేందుకు విరాళాల కోసం ప్రారంభించిన పీఎం-కేర్స్‌ (ప్రధానమంత్రి సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్‌) నిధికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ రూ.500 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే ఆయన కోట్లాది రూపాయల వ్యయంతో దేశంలోనే తొలి కొవిడ్‌-19 ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దానికి అదనంగా సోమవారం పీఎం-కేర్స్‌కు భారీ విరాళం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.