టాప్‌ 10 న్యూస్ @ 9 AM
close

తాజా వార్తలు

Published : 01/04/2020 09:00 IST

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. తెలంగాణ నుంచి 1,030 మంది!

ఒకరు కాదు ఇద్దరు కాదు... వెయ్యి మందికి పైగానే.. దిల్లీలో ఆధ్యాత్మిక సభలకు వెళ్లి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిపై ఆరా తీసే కొద్దీ సంఖ్య పెరుగుతోంది. వారిలో కొందరికి కరోనా సోకినట్లు వెల్లడవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా గాలించి, ఇప్పటి వరకు 900 మందిని గుర్తించారు. అవసరమైన వారిని వైద్య పరీక్షలకు, అనుమానితులను పరిశీలన కేంద్రాల (క్వారంటైన్‌)కు తరలిస్తున్నారు. కరీంనగర్లో పది మంది ఇండోనేసియా వాసులను గుర్తించడం, వారందరికీ కరోనా సోకినట్లు తేలడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు రూ.20 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు పది కోట్ల రూపాయల చొప్పున ఈ విరాళాన్ని అందించారు.కరోనా వల్ల దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయిన నేపథ్యంలో వార్తామాధ్యమాలుగా ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌లు ప్రజా చైతన్యం కోసం యథాశక్తి కృషి చేస్తున్నాయి. ఆర్థికంగా కూడా తెలుగు వారికి చేదోడుగా నిలవాలన్న లక్ష్యంతో రామోజీరావు తన గ్రూపు సంస్థల తరఫున ఈ విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీ వెళ్లినవారు స్వచ్ఛందంగా చెప్పాలి

రాష్ట్రం నుంచి దిల్లీ వెళ్లినవారు, వారితో కలిసి ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులూ దిల్లీ వెళ్లిన వారిని గుర్తించి పరీక్షలు చేయించాలని ఆదేశించారు.  రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే భారీగా కేసులు నమోదైన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీరిలో చాలా మంది దిల్లీలో నిర్వహించిన తబ్లీగ్‌ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. రాష్ట్రం నుంచి వెళ్లినవారు, అదే రోజు రైల్లో ప్రయాణం చేసినవారి వివరాలను సేకరించామని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మాస్కులతో కరోనాకు అడ్డుకట్ట

దేశంలో 80% మంది మాస్కులు ధరించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంగళవారం సూచించింది. ఇలా చేయడం ద్వారా తక్షణం కొవిడ్‌ వ్యాప్తి నిలిచిపోతుందని పేర్కొంది. ఇంట్లోనే మాస్కులు తయారు చేసుకోవడం ఎలాగో సూచిస్తూ ఇచ్చిన ప్రకటనలో వివిధ అంశాలను వెల్లడించింది. అవేమిటంటే.. ఒక విశ్లేషణ ప్రకారం ప్రజల్లో 80 శాతం మంది మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి ఆగిపోతుంది. మాస్కులు ధరిస్తే.. కరోనా సోకిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు, వాటిలోని వైరస్‌లు గాలిద్వారా మన శ్వాసకోశ వ్యవస్థలోకి చొరబడే అవకాశాలు తగ్గిపోతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చైనాను దాటిన అమెరికా

కరోనా దెబ్బకు అమెరికాలో పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ఆ దేశంలో వైరస్‌ బారిన పడి మరణించినవారి సంఖ్య 3,400 దాటింది. దీంతో కొవిడ్‌ తీవ్రతకు చోటుచేసుకున్న మరణాల సంఖ్య విషయంలో చైనా(3,305)ను అమెరికా దాటినట్లయింది. న్యూయార్క్‌లో కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 250 మందికిపైగా మృత్యువాతపడ్డారు. బాధితులకు చికిత్స అందించేందుకు తమ రాష్ట్రంలో అదనంగా 10 లక్షల మంది వైద్య సిబ్బంది అవసరమని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో పేర్కొన్నారు. 80 వేలమంది విశ్రాంత వైద్యులు, నర్సులు, సిబ్బంది సేవలందించేందుకు ముందుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నయమైనా కళ్లె, మలంలో వైరస్‌

కొవిడ్‌-19 నుంచి కోలుకున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో కరోనా వైరస్‌ లేదని తేలినప్పటికీ వారి కళ్లె, మల నమూనాల్లో ఈ వైరస్‌ ఉంటోందని చైనా వైద్యులు తెలిపారు. దీంతో పరీక్షల్లో ‘నెగిటివ్‌’గా తేలినవారిలో నిజంగానే వైరస్‌ లేదా మరింత నిర్ధారణ కోసం శరీరంలోని ఇతర భాగాల నుంచి కూడా నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలను ఇది లేవనెత్తుతోంది. బీజింగ్‌లోని డిటాన్‌ ఆసుపత్రిలోని కొవిడ్‌-19 రోగులపై వైద్యులు పరిశోధన సాగించారు. గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో ‘నెగిటివ్‌’ అని తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజుల వరకూ వైరస్‌ ఉంటున్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆర్థిక మాంద్యం కమ్ముకుంటోంది

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తీవ్ర మాంద్యంలోకి జారుకుంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కరోనా కాటుతో ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతాయని అంచనా వేసింది. భారత్‌, చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం(యూఎన్‌సీటీఏడీ) ఓ నివేదికను విడుదలచేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభివృద్ధి చెందిన దేశాలకు సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎక్కడి ర్యాంకులు అక్కడే

కరోనా వైరస్‌ కారణంగా టోర్నీలన్నీ వాయిదా పడడంతో క్రీడాకారుల ర్యాంకింగ్స్‌ను స్తంభింపచేయాలని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది. దీని ప్రకారం మార్చి 17 వరకు ఎవరు ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకులోనే కొనసాగనున్నారు. తర్వాత నిర్వహించే టోర్నీల్లో పాల్గొనడానికి లేదా సీడింగ్‌ ఇవ్వడానికి ఈ ర్యాంకులు ఉపయోగపడతాయని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. ‘‘తదుపరి నోటీసు ఇచ్చే వరకు ప్రపంచ సీనియర్‌, జూనియర్‌ ర్యాంకింగ్స్‌ను అలాగే నిలిపి వేయాలని నిర్ణయించాం. ఆ ఏడాది ఆఖరిగా ఆడిన ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ టోర్నీ తర్వాత షట్లర్లు ఏ ర్యాంకుల్లో ఉంటే వాటిని అలాగే ఉంచుతాం’ అని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రోజూ 21 వాక్యాలు

థానాయికలు లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఒకొక్కరు ఒక్కో రకంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. వాళ్లు రోజువారీగా ఏం చేస్తున్నారో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ తెలుగు నేర్చుకొంటోంది. లాక్‌డౌన్‌ కొనసాగనున్న 21 రోజులపాటు రోజూ 21 వాక్యాలు చొప్పున తెలుగు నేర్చుకుంటున్నట్లు ఆమె చెబుతోంది. అంతర్జాలం సహాయంతో ఆమె తెలుగు పదాల్ని హిందీలో రాసుకుంటూ సాధన చేస్తోంది. కష్టమైనా... నేర్చుకుంటున్నానని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కిరోసిన్‌ బాంబులతో ప్రార్థనా మందిరాన్ని పేల్చేందుకు కుట్ర

పౌరసత్వ సవరణ చట్టం... ఎన్‌ఆర్‌సీకి నిరసనగా ఓ ప్రార్థనా మందిరాన్ని కిరోసిన్‌ బాంబులతో పేల్చేందుకు కుట్ర పన్నిన ఇద్దరు యువకులను మంగళవారం అరెస్ట్‌ చేశామని టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు మార్చి 14న తెల్లవారుజామున పాతబస్తీలోని ఓ ప్రార్థనామందిరం వద్దకు వెళ్లి కిరోసిన్‌ బాంబులకు నిప్పంటించి విసిరేందుకు యత్నించారు. స్థానికులు గుర్తించడంతో ద్విచక్రవాహనంపై పారిపోయారు. అనంతరం కంచన్‌బాగ్‌లో ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని