close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ప్రాణాలే ముఖ్యం

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు సామాజిక అత్యయిక పరిస్థితి (సోషల్‌ ఎమర్జెన్సీ)ని తలపిస్తున్నాయని, విధిలేక కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నిరంతర నిఘా ఉంచాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చాలా రాష్ట్రాలు, జిల్లా పరిపాలన యంత్రాంగాలు ప్రస్తుత లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుతున్నాయన్నారు. లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేయలేమని, దీనిపై ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నానని చెప్పారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లోని వివిధ పక్షాల నేతలతో మాట్లాడారు. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో అందరూ తనకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమెరికపై...  ఎందుకీ మరక!

వైరస్‌ బలంపై అంచనా ఉన్నా.. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందేమోననే అతి జాగ్రత్త, ఎదుర్కోగలమనే అతి విశ్వాసం, ఉదాసీనత, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అమెరికాలో ఈ పరిస్థితికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను తాను యుద్ధ సమయపు(కొవిడ్‌-19పై పోరు) అధ్యక్షుడిగా అభివర్ణించుకున్న ట్రంప్‌.. ప్రారంభంలో వాస్తవాల్ని, సైన్స్‌ని విస్మరించి దేశాన్ని యుద్ధరంగంలోకి లాగారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. సంపన్న సమాజాలుగా, విజ్ఞాన తరంగాలుగా, భూతల స్వర్గాలుగా పేరొందిన అనేక దేశాలు కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. క్యాన్సర్‌ రోగుల్లో కరోనా ముప్పు

సాధారణ ప్రజలతో పోలిస్తే.. కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) వల్ల ప్రమాద తీవ్రత క్యాన్సర్‌ రోగుల్లో అధికంగా ఉంటుందని  హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప అన్నారు. చైనాలో ఈ వైరస్‌ సోకిన సాధారణ పౌరుల్లో మరణాలు 2-3 శాతం ఉండగా.. కొవిడ్‌ 19 బారిన పడిన క్యాన్సర్‌ రోగుల్లో మరణాలు సుమారు 20 శాతం వరకూ ఉన్నట్లు   అధ్యయనాలు చెబుతున్నాయని ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. క్యాన్సర్‌ రోగుల్లో ఎక్కువమంది 60 ఏళ్లు పైబడిన వారుంటారు. వారిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటివి ఉండడం సాధారణమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహమ్మారితో కుటుంబాలు విలవిల

కరోనా వైరస్‌ పేరెత్తితేనే వణుకు పుడుతోంది. ఇంట్లో ఒకరికి ఈ వ్యాధి సోకితేనే కుటుంబమంతా హడలిపోతోంది. అలాంటిది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు.. ముగ్గురు.. తొమ్మిది మందికి కూడా వైరస్‌ వ్యాప్తి చెందితే.. వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించడమే కష్టం. ఇలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు రాష్ట్రంలో 20కి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందిన కేసులతో పాటు దేశీయ ప్రయాణాలు.. ముఖ్యంగా మర్కజ్‌ ప్రయాణానంతరం ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. సామాజిక, కుటుంబ, ఆర్థిక పరిస్థితులూ మరో కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆదాయపు పన్ను రీఫండ్‌ శుభవార్త

కొవిడ్‌-19 కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వ్యాపారులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న రూ.18వేల కోట్ల పన్ను రీఫండ్‌ను వెంటనే చెల్లించనుంది. ఆదాయ పన్ను విభాగం నుంచి తిరిగి రావాల్సిన మొత్తం రూ.5 లక్షలలోపు ఉంటే దాన్ని వెంటనే వాపసు చేస్తామని బుధవారం ఆ విభాగం వర్గాలు తెలిపాయి. దీనివల్ల 14 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. అన్నిరకాల జీఎస్‌టీ, కస్టమ్స్‌ రీఫండ్‌ బకాయిలనూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బ్రెజిల్‌ అధ్యక్షుడి నోట రామాయణం

కొవిడ్‌-19 చికిత్సలో ఉపయోగపడుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాల్సిందిగా భారత్‌ను బ్రెజిల్‌ అభ్యర్థించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం లేఖ రాశారు. అందులో రామాయణాన్ని ప్రస్తావించడం గమనార్హం. ‘‘రాముడి సోదరుడు లక్ష్మణుడిని రక్షించడం కోసం హిమాలయాల నుంచి హనుమంతుడు సంజీవని తెచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి జీసస్‌ స్వస్థత చేకూర్చాడు. బర్తిమయికి చూపు తెప్పించాడు. అలాగే ప్రజల రక్షణార్థం కరోనా కట్టడికి మనం కలిసి పనిచేద్దాం’’ అని అందులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీ తబ్లిగీ సభ్యులపై యూపీలో కేసు

రాష్ట్రానికి చెందిన తబ్లిగీ సభ్యులను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ సదస్సుకు హాజరైన వీరు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగిరాకుండా ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకుంటున్నారు. బావార్చీలోని శాంగిబెగ్‌ ప్రాంతానికి చెందిన ఓ 50 ఏళ్ల వృద్ధుడు వీరికి ఆశ్రయమిచ్చారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ రావటంతో పోలీసులు ఆ ప్రాంతం మొత్తం దిగ్బంధించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అంటు వ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే అభియోగాలపై ఏపీకి చెందిన ఈ 10 మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులపై కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముడిచమురుతో నింపేద్దాం

దేశీయ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతులే తీరుస్తున్నాయ్‌. ఇప్పుడు ముడిచమురు ధర అంతర్జాతీయంగా బాగా తక్కువగా ఉన్నందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్‌ దేశాల నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుని, దేశంలో ఉన్న వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వ కేంద్రాలను నింపడానికి సిద్ధమైంది. దేశంలో 5.33 మిలియన్‌ టన్నుల అత్యవసర చమురు నిల్వ సామర్థ్యం ఉంది. ఇవి 9.5 రోజుల చమురు అవసరాలకు సరిపోతాయి. ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాదూర్‌లలో మనకు భూగర్భ చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జడేజాలా బ్యాట్‌ తిప్పానా?

మైదానంలో బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ సంబరాలు చేసుకునేది ఎవరూ అంటే వచ్చే సమాధానం.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన జడ్డూ.. అర్ధశతకం లేదా శతకం సాధించినపుడు బ్యాట్‌ను కత్తిలా తిప్పుతాడనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జడేజాలా బ్యాట్‌ను తిప్పానా అంటూ డేవిడ్‌ వార్నర్‌ అభిమానులను అడుగుతున్నాడు. గతంలో ఐపీఎల్‌లో తన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోసం ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌ కోసం వార్నర్‌ బ్యాట్‌ను తిప్పాడు. దానికి సంబంధించిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వార్నర్‌.. జడేజాలా బ్యాట్‌ను తిప్పానా అని అభిమానులను అడిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏకమై పోరాడితే.. నవ్వులు విరబూస్తాయి

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశమంతా ఏకతాటిపై నడిచి పోరాడితేనే దీన్ని కట్టడి చేయగలం. అందుకోసం ప్రజల్లో చైతన్యం నింపడానికి బాలీవుడ్‌ సమాయత్తమైంది. ప్రముఖ బాలీవుడ్‌ తారలంతా కలిసి ఓ ప్రత్యేక వీడియో గీతాన్ని రూపొందించారు. ‘ముష్క్‌రాయేగా ఇండియా’ అంటూ సాగే ఈ గీతం  ఆకట్టుకుంటోంది. ఇందులో అక్షయ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌రావ్‌, ఆయుష్మాన్‌ ఖురానా, భూమి  పెడ్నేకర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, విక్కీ కౌశల్‌, అనన్యా పాండే, కృతి సనన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాకీ భగ్నానీ తదితరులు తమదైన శైలిలో అలరించారు. కౌశల్‌ కిషోర్‌ రచించిన ఈ గీతానికి విశాల్‌ మిశ్రా స్వరాలు అందించి ఆలపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.