
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. విమాన ప్రమాదంలో 97కి చేరిన మృతులు
పాకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు చేరింది. విమానంలో సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుప్పకూలడానికి ముందు రెండు మూడు సార్లు సమీప ప్రాంతాల్లో విమానం చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ల్యాండ్ చేయడానికి బదులు పైనే ఉండడం సురక్షితమని భావించినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. పైలట్ చివరి క్షణాల సంభాషణను విశ్లేషించిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చారు. రెండు రన్వేలు ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంచినప్పటికీ.. పైలట్ అందుకు సాహసించలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వడ్డీ రేట్లు తగ్గుతాయ్
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) శుక్రవారం పలు చర్యలను ప్రకటించింది. కీలక రేట్ల కోత, రుణ వాయిదాల మారటోరియం పొడిగింపు, ఎగుమతి- దిగుమతిదార్లకు ఊరట, ఎగ్జిమ్ బ్యాంకుకు సాయం వంటివి అందులో ఉన్నాయి. మార్చి నెలాఖరులో రెపో రేటును 0.75 శాతం తగ్గించగా.. తాజాగా మరో 0.4 శాతం కోత విధించింది. దీంతో 20ఏళ్ల కనిష్ఠ స్థాయి అయిన 4 శాతానికి రెపో రేటు పరిమితమైంది. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాలు చౌక కానున్నాయి. నెలవారీ వాయిదా(ఈఎమ్ఐ)లపై భారం తగ్గవచ్చు. ఆర్బీఐ నిర్ణయాన్ని బ్యాంకులు వినియోగదార్లకు బదిలీ చేయడంపై ఇది ఆధారపడి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రోగ నిరోధక శక్తే మన బలం..
మనుషులకు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు శరీరంలో చక్కెర స్థాయిలే మూలం. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య లెక్కల ప్రకారం భారత్‌లో 7.7 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం సమస్య ఉన్నట్లు గుర్తించారు. చక్కెర వ్యాధి బాధితుల్లో కరోనా వైరస్ ముప్పు రెండింతలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని కూడా అది అచేతనంగా మార్చేస్తుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన వైద్యనిపుణులు వెల్లడించారు. టైప్2 మధుమేహం బారిన పడినట్లు కూడా తెలియని వారు బ్రిటన్‌లోనే దాదాపు 10 లక్షల మంది ఉంటారని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. వంటగ్యాస్ సిలిండర్లకు రాయితీ కోత!
వంటగ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు రాయితీ సొమ్మును కేంద్రం నిలిపివేసింది. గృహ అవసరాల సిలిండరు పంపిణీ సందర్భంగా వినియోగదారులకు కేంద్రం కొంత రాయితీని అందజేస్తుంది. దీన్ని సిలిండరు కొనుగోలు చేసిన సందర్భంగా నగదు బదిలీ రూపంలో వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం కొన్నేళ్లుగా సాగుతోంది. అలాంటిది మే నెలలో రాయితీ సొమ్ము పడకపోవడంతో ప్రజల్లో చర్చనీయాంశం అయింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిర్ణయిస్తారు. పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీగా, వంటగ్యాస్ సిలిండర్ల ధరను ప్రతి నెల ఒకటో తేదీన నిర్ణయిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సేద్యంలో ప్రపంచంతో పోటీ పడదాం!
‘ప్రపంచంతో పోటీ పడాలి. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పంట ఉత్పత్తులు రావాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలకు అవి నిరంతరం ముడి సరకు అందించాలి. వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోవాలి. తెలంగాణలో సాగు విధానం ఈ పద్ధతిలో సాగాలి. సాగునీరు, పెట్టుబడులు, నైపుణ్యం కలిగిన రైతాంగం మనకు అండగా ఉన్నాయి. ఏ పంటయినా పండే సారవంతమైన నేలలున్నాయి. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, దీని అనుబంధ వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధి జరగాలి’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సీబీఐకి అప్పగింతను స్వాగతిస్తున్నాం
వైద్యుడు సుధాకర్‌పై పెట్టిన కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. కేవలం ఎన్95 మాస్కు అడిగిన పాపానికి వైద్యుణ్ని నిర్బంధించి హింసించారని శుక్రవారం ట్విటర్లో ఆరోపించారు. ఆయనపై ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం వెనకున్న కుట్రను సీబీఐ కచ్చితంగా బయటపెడుతుందని పేర్కొన్నారు. ఇది శుభపరిణామమని తెదేపా నేతలు వివరించారు. హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. హాంకాంగ్ స్వేచ్ఛ హాంఫట్!
హాంకాంగ్‌ను మరింతగా తన ఉక్కు పిడికిలిలో బిగించేందుకు వివాదాస్పద ‘జాతీయ భద్రతా చట్టం’ ముసాయిదాను చైనా శుక్రవారం తన పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనికి ఆమోదముద్ర లాంఛనమే. ఈ చట్టం వల్ల హాంకాంగ్ ప్రాదేశిక స్వయంప్రతిపత్తి, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులు, ‘వేర్పాటువాదుల’పై కొరడా ఝళిపించడానికే దీన్ని తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రబల ఆర్థిక శక్తి అయిన హాంకాంగ్ ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థ (ఎస్ఏఆర్)గా ఉంది. 1997 జులై 1న ఈ ప్రాంతం.. బ్రిటన్ నుంచి చైనా అధీనంలోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 50000 తాత్కాలిక ఉద్యోగాలు: అమెజాన్
కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో 50000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రకటించింది. గోదాములు, డెలివరీ నెట్వర్క్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో ఇ-కామర్స్ సంస్థల కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజుల్లో స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి సంస్థలు ఉద్యోగులను తొలగించగా.. అమెజాన్ బÅరీ సంఖ్యలో తాత్కాలిక నియామకాలకు ముందుకురావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. గంభీర్ × ఎమ్మెస్కే
టీమ్ ఇండియా సెలక్షన్ పక్రియపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ‘‘కెప్టెన్, కోచ్ కూడా సెలక్టర్లుగా ఉండాల్సిన సమయమొచ్చింది. తుది జట్టు ఎంపిక పూర్తిగా కెప్టెన్ చేతుల్లో ఉండాలి. కానీ అదే సమయంలో జట్టు ఎంపిక ప్రక్రియలో కోచ్, కెప్టెన్‌కు ఓటు హక్కు ఉండాలి. అప్పుడు ఎంపికైన జట్టు ప్రదర్శనకు సంబంధించి వాళ్లు బాధ్యత నుంచి తప్పించుకోలేరు’’ అని ఆన్లైన్లో చర్చ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సుద్దాల అశోక్‌తేజకు కాలేయ మార్పిడి చికిత్స
ప్రముఖ సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్స చేయనున్నారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైనట్లు అశోక్‌తేజ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వైద్యుల సూచన మేరకు శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేరానన్నారు. శనివారం ఉదయం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిపారు. తన కుమారుడు అర్జున్ కాలేయం ఇస్తున్నారన్నారు. అన్నయ్య ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని అశోక్‌తేజ సోదరుడు, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి