close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/05/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. రెక్కలకు చిక్కులు

కరోనా దెబ్బతో రెండు నెలలుగా స్తంభించిపోయిన దేశీయ విమానాలు ఎట్టకేలకు సోమవారం నుంచి రెక్కలు కట్టుకుని ఎగిరినా వివిధ కారణాల వల్ల ప్రయాణికులకు మాత్రం చుక్కలు కనిపించాయి. ఏ విమానం వెళ్తుందో, ఏది వెళ్లదో తెలియక వందల మంది అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి చేరుకుని, బోర్డింగ్‌ పాసు చూపించిన తర్వాత అసలు ఆ విమానమే లేదని తెలిశాక ఆగ్రహం, ఆవేదనలతో రగిలిపోయారు. సోమవారం తెల్లవారుజాము నుంచి విమానాలు తిరుగుతాయనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచే ఆత్రుతగా నిరీక్షిస్తూ కూర్చొన్నవారిలో అనేకమందికి సర్వీసుల రద్దుతో నిరాశే ఎదురయింది. ప్రత్యామ్నాయం సూచించకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేశారేమిటని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తితిదే ఆస్తుల విక్రయం నిలిపివేత

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తితిదే ఆస్తుల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం  పక్కనపెట్టింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దీనిపై పునఃసమీక్ష చేయాలని తితిదేను ఆదేశించింది. మతపెద్దలు, భక్తులతో మాట్లాడి ఆ భూములను ఆలయాల నిర్మాణం, ధర్మప్రచారం, మతపరమైన కార్యక్రమాల వంటివాటికి వినియోగించుకోవచ్చేమో పరిశీలించాలని సూచించింది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేవరకు ఆస్తుల విక్రయాలను నిలిపివేస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 50ఆస్తుల విక్రయానికి సంబంధించి 2016 జనవరి 30న అప్పటి తితిదే పాలకవర్గం చేసిన తీర్మానం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాగ్యనగరంపై భానుడి పంజా!

హైదరాబాద్‌ నగరం రేడియేషన్‌ కేంద్రంగా మారుతోంది. కొన్నాళ్లుగా ఎండలు మండిపోతుండటంతో అతినీల లోహిత(యూవీ) కిరణాలు పంజా విసురుతున్నాయి. యూవీ సూచిక అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మరో వారం రోజుల వరకు పరిస్థితి ఆందోళనకరంగానే ఉండే అవకాశముందంటూ ప్రపంచ పర్యావరణ సంస్థ(డబ్ల్యూఈవో) అంచనా వేసింది. సూర్యుడి నుంచి వచ్చే ఎండ వేడిలో నేరుగా మనిషి శరీరంలోకి చొచ్చుకునిపోయే శక్తిమంతమైన యూవీ కిరణాలు ఉంటాయి. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే చర్మం మండినట్లుగా అనిపిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వాయిదా పడని వేధింపులు!

చిరు ఉద్యోగం....జీతం కొంచెమే. అయినా రెక్కల కష్టంతో బతుకు బండిని సాఫీగానే నడిపే వాళ్లు. లాక్‌డౌన్‌ కారణంగా మూత పడిన కంపెనీలు జీతాలు చెల్లించలేదు. పలు సంస్థలు సగమే జీతం చెల్లించాయి. ఈ పరిణామాలతో నెలకు ఎంతో కొంత వాయిదాలు చెల్లిస్తామనే విశ్వాసంతో వస్తువులు కొనుగోలు చేసిన చిరుద్యోగులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోయి, వాయిదాల సొమ్ము చెల్లించాలంటూ ఫైనాన్స్‌ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక లక్షలాది మంది సతమతమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 17 నాటికి స్టైరీన్‌ లీకేజీపై నివేదిక

ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌ లీకైన దుర్ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ జూన్‌ 17 నాటికి నివేదిక సమర్పించే అవకాశముంది. వివిధ రకాల సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని మెయిల్‌ ద్వారా, నేరుగా ఇప్పటికే స్వీకరించిన కమిటీ.. నెలాఖరు వరకూ దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్నవారు  మే 31లోగా convenorhpc@@gmail.com మెయిల్‌కు ఆ వివరాలు పంపించాలని సూచించింది. జూన్‌ 10కల్లా వివిధ నియంత్రణ సంస్థలు, ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రతినిధులు సహా ఇతర స్టేక్‌ హోల్డర్స్‌ నుంచి వాటిపై సమగ్ర సమాచారాన్ని తీసుకోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రోజుకు 2 లక్షల కొవిడ్‌ పరీక్షలు

ప్రస్తుతం దేశంలో రోజూ లక్ష కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆ సంఖ్యను 2 లక్షలకు పెంచేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ప్రస్తుతం 610 ప్రయోగశాలల ద్వారా రోజూ 1.40 లక్షల పరీక్షలు చేసే సామర్థ్యానికి ఐసీఎంఆర్‌ చేరుకోగలిగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నేపథ్యంలో పెరిగే కేసులకు అనుగుణంగా పరీక్షలనూ పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరీక్షల వ్యూహాల్లో వస్తున్న మార్పులను అనుసరించి ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటోంది. ఇప్పుడు వలసకూలీలు, కొవిడ్‌పై పోరాడుతున్న సిబ్బందికీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒక్కడు.. 10 హత్యలు

ముగ్గురు పిల్లలున్న ఓ మహిళతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అంతేకాకుండా.. ఆమె పెద్దకుమార్తెపైనా కన్నేశాడు. తనను మనువాడతానని చెప్పి కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడమేంటని నిలదీసినందుకు ఆ మహిళను హతమార్చాడు. ఆమె కోసం బంధువులు ప్రశ్నించడంతో నేరం ఎక్కడ బయటపడుతుందోనని ఏకంగా 9 మందిని జలసమాధి చేశాడు. వరంగల్‌ గొర్రెకుంట గోనె సంచుల గోదాము వద్ద పాడుబడ్డ బావిలో 9 మంది విగతజీవులుగా తేలిన కేసు మిస్టరీని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఒకే బావిలో రెండ్రోజుల వ్యవధిలో 9 మృతదేహాలు బయటపడటంతో ఈ కేసు సంచలనంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒక్క డాలరుకే మీడియా సంస్థ విక్రయం

న్యూజిలాండ్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన ‘స్టఫ్‌’ను కేవలం ఒక్క డాలరుకే విక్రయించనున్నట్టు సోమవారం యాజమాన్యం ప్రకటించింది. ‘నైన్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌’ అనే కంపెనీ ఆధీనంలో ఈ సంస్థ పనిచేస్తోంది. అదే సంస్థ మహిళా సీఈఓ అయిన సినియడ్‌ బౌచర్‌కు దీన్ని విక్రయిస్తోంది. ‘స్టఫ్‌’ సంస్థ పలు జాతీయ వార్తా పత్రికలను ప్రచురించడంతో పాటు, వెబ్‌సైట్లను నిర్వహిస్తోంది. మొత్తం 900 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 400 మంది పాత్రికేయులు. ఉద్యోగులనే భాగస్వాములుగా చేసుకుని సంస్థను నిర్వహిస్తామని సీఈఓ తెలిపారు. ప్రకటనల ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థపై కరోనా పిడుగులా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోహ్లీ నుంచి అన్నీ కావాలి

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు భారత సారథి విరాట్‌ కోహ్లి అంటే ప్రత్యేకమైన అభిమానం. విరాట్‌ నుంచి ఒక నైపుణ్యాన్ని తీసుకునే అవకాశం వస్తే ఏది ఎంచుకుంటావని అడిగితే.. కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసేసుకుంటానని నవ్వుతూ చెప్పాడు విలియమ్సన్‌. ‘‘కోహ్లి బంతిని హిట్‌ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. అతని నైపుణ్యాలన్నింటినీ అప్పు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇక పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ కవర్‌డ్రైవ్‌, స్టీవ్‌ స్మిత్‌ బంతిని ఫీల్డర్ల మధ్య ఖాళీల్లోంచి పంపే విధానాన్ని, వార్నర్‌ బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌లను సొంతం చేసుకోవాలని ఉంది’’ అని కేన్‌ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనాపై తొలి చిత్రం

‘‘ఈ ప్రపంచంలో కరోనా వైరస్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం తనదే’’ అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా రెండు నెలలుగా ప్రపంచంతో పాటు చిత్ర పరిశ్రమ కూడా స్తంభించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ క్లిష్ట కాలంలోనూ ‘కరోనా వైరస్‌’ పేరుతో ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ను పూర్తి చేశారు వర్మ. సోమవారం ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించారు ఆయన. ‘‘ఈ ప్రపంచంలో కరోనా వైరస్‌ కథా నేపథ్యంతో తెరకెక్కిన తొలి చిత్రమిదే. పూర్తిగా లాక్‌డౌన్‌ కాలంలోనే పూర్తి చేశాం. క్రియేటివిటీకి లాక్‌డౌన్‌ అడ్డంకి కాదని మా నటులు, చిత్ర బృందం నిరూపించారు. ట్రైలర్‌ మంగళవారం సాయంత్రం’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు వర్మ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.