close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/05/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. బోరుబావిలో పడిన బాలుడి మృతి

మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది.‌ 17 అడుగుల లోతు నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే  బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు ఆక్సిజన్‌ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈ నెలా జీతాల్లో కోత

లాక్‌డౌన్‌ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, నిబంధనలు సడలించినా రాబడి పెరగలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రానికి ప్రతినెలా రూ.12 వేల కోట్ల రాబడి రావాల్సి ఉండగా మే నెలలో కేవలం రూ.3100 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మే నెల వేతనాల్లో కూడా కోత కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పదవీ విరమణ ఉద్యోగుల పింఛన్లలో 25 శాతం, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో పది శాతం కోత కొనసాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రం దివాలా

ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం సాగుతోందని, వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏడాదిలో రూ.80 వేల కోట్ల అప్పులు చేసిందని.. అదీ చాలక ప్రజలపై రూ.50 వేల కోట్ల పన్నుల భారం వేసిందని మండిపడ్డారు. ఆస్తులు అమ్మినా కూడా అభివృద్ధి శూన్యమేనని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఏమైంది? తెలంగాణతోనూ, కేంద్రంతోనూ ఉన్న సమస్యలు ఎన్ని పరిష్కరించారని ఆయన నిలదీశారు. ‘‘రాబోయే రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఎలా మనుగడ సాగిస్తుందో తెలియని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం తప్పులు చేసి, తెదేపాపై నెపం వేస్తోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమెరికాలో పోలీస్‌ కర్కశం

మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసుల అమానుష తీరు కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఒక ఆఫ్రికన్‌అమెరికన్‌ వ్యక్తి మెడపై పోలీసు ఒకరు మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు. ‘దయచేసి నా గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు’ అని విలవిలలాడిపోతూ, అతను వెలిబుచ్చిన ఆవేదన ఆ పోలీసు అధికారి ముందు అరణ్య రోదన అయింది. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి  ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక్కరి నుంచి 80 మందికి వైరస్‌

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం  జి.మామిడాడ గ్రామంలో కరోనా పాజిటివ్‌తో మరణించిన ఓ వ్యక్తి(సూపర్‌ స్ప్రెడర్‌) ద్వారా 80 మందికి వైరస్‌ సోకడం సంచలనం సృష్టిస్తోంది. ఓ సూపర్‌ స్ప్రెడర్‌ ద్వారా ఇంత మందికి కొవిడ్‌ సోకడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. జిల్లాలో బుధవారం నాటికి 160 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో సగం ఆ వ్యక్తి అనుబంధంగా నమోదైనవే కావడం గమనార్హం. ఈ నెల 21న జి.మామిడాడలో 53 ఏళ్ల వ్యక్తి కాకినాడ   జీజీహెచ్‌లో చేరి..కొన్ని గంటల్లోనే మరణించారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ గుర్తించారు. ఆ వ్యక్తి నుంచే పెదపూడి, బిక్కవోలు, రామచంద్రపురం, మండపేట, అనపర్తి మండలాల్లోని 80 మందికి కరోనా వైరస్‌ వ్యాప్తిచెందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సంక్రమణ వేగం తగ్గుముఖం

దేశంలో కరోనా సంక్రమణ వేగం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసుల వృద్ధిరేటు రెండు రోజులుగా 5%లోపే ఉంది. మరోవైపు వరుసగా ఆరోరోజు దేశంలో 6 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా 24 గంటల్లో 6,387 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. కొత్తగా 3,935 మంది కోలుకోగా, 170 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాల్లో 80% మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీల్లోనే చోటుచేసుకున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 97 మంది మృత్యువాతపడటం అక్కడి విషమ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉత్తరాదిలో బుధవారం ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ మందులు నన్ను సైకోగా మార్చొచ్చు

‘విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో నాపై ప్రయోగిస్తున్న మందులు నన్ను సైకోగా మార్చే ప్రమాదం ఉంది. రోజూ రాత్రిపూట నాలుగు రకాల మాత్రలు, ఒక ఇంజక్షన్‌ ఇస్తున్నారు. ఆ సమయంలో పెదాలు తడారిపోవటం, మూత్రం ఆగిపోవటం, కళ్లు మసకబారడం, ఆయాసం రావడం, తల తిరుగుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. పెదవులపై పుండ్లు వస్తున్నాయి. క్రమేణా శ్వాసనాళ సంబంధ న్యుమోనియాకు దారితీయొచ్చు. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ రామిరెడ్డి పలు రకాల మానసిక రుగ్మతలకు వినియోగించే డ్రగ్స్‌ను ఇస్తున్నారు’ అని డాక్టర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మిడతలపై యుద్ధం

పంటలను ధ్వంసం చేస్తోన్న మిడతలను నిర్మూలించేందుకు పలు రాష్ట్రాలు రంగంలోకి దిగాయి. రాజస్థాన్‌ ప్రభుత్వం డ్రోన్‌తో పోరాటాన్ని ప్రారంభించగా యూపీ ప్రభుత్వం ఝాన్సీ జిల్లాలో అగ్నిమాపక శకటాల ద్వారా పురుగుమందుల పిచికారీ చేపట్టింది. తాజాగా మిడతల దండు ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో 17 కి.మీ. పొడవైన ఒక మిడతల దండు సంచరిస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. పంజాబ్‌లోనూ మిడతల ఉద్ధృతి పెరుగుతోంది. వీటి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. మన దేశంలో రబీ పంటలపై ఈ పురుగుల ప్రభావం తక్కువేనని, ప్రస్తుతం ప్రారంభం కానున్న ఖరీఫ్‌ పంటలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ‘మిడతల హెచ్చరిక సంస్థ (ఎల్‌డబ్ల్యూఓ)’ బుధవారం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కరోనా రోగుల చికిత్సలో ‘సైటోసార్బ్‌’

కరోనా రోగుల చికిత్సకు సైటోసార్బ్‌ పరికరాన్ని ఉపయోగించడానికి బయోకాన్‌ అనుబంధ సంస్థ బయోకాన్‌ బయోలాజిక్స్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. ఈ రక్త శుద్ధి పరికరాన్ని రోగుల్లో ప్రొ-ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చేంత వరకు ఈ అనుమతులు ఉంటాయి. 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న కరోనా రోగుల చికిత్సకు దీనిని వాడేందుకు ప్రజా ప్రయోజనార్థం కింద అనుమతి పొందినట్లు బయోకాన్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
10.
ఆ గౌరవం దక్కని వారితో ఓ జట్టు

క్రికెట్‌ మక్కాగా పిలిచే లార్డ్స్‌లో సెంచరీ, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు లేదా మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన చేసిన వారి పేర్లను హానర్స్‌ బోర్డుకు ఎక్కిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 400 మందికిపైగా క్రికెటర్లు ఇలా హానర్స్‌ బోర్డు ఎక్కారు. అయితే దిగ్గజ క్రికెటర్లు కొందరికి మాత్రం ఆ కల నెరవేరలేదు. అందులో సచిన్‌ కూడా ఉన్నాడు. టెస్టు కెరీర్లో 51 టెస్టు సెంచరీలు చేసిన సచిన్‌కు లార్డ్స్‌లో ఒక్క శతకం కూడా లేదు. ఇలా ప్రత్యేక ప్రదర్శన చేయలేకపోయిన దిగ్గజ ఆటగాళ్లతో లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం 11 మంది సభ్యుల జట్టును రూపొందించింది. ఆ జట్టుకు డబ్ల్యూ.జి గ్రేస్‌ కెప్టెన్‌. భారత్‌ నుంచి సచిన్‌, సెహ్వాగ్‌, కోహ్లి ఈ జట్టులో ఉన్నారు. లారా, గిల్‌క్రిస్ట్‌, వార్న్‌, వసీం అక్రమ్‌, డెన్నిస్‌ లిల్లీ, అంబ్రోస్‌ కూడా ఈ జట్టులో సభ్యులే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.