close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/05/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. సరిహద్దుల్లోనే సంహారం

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ దండు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ గాలి మరలి రాష్ట్రంలోకి వచ్చినా వాటిని సంహరించేందుకు వీలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మలాతియాన్‌, క్లోరోఫైరిపాస్‌, లామ్డా సైలోత్రిన్‌ ద్రావణాలను, 12 అగ్నిమాపక, 12 జెట్టింగ్‌ యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తితిదే ఆస్తుల విక్రయంపై నిషేధం

తితిదేకి చెందిన ఆస్తులను భవిష్యత్తులోనూ విక్రయించకుండా నిషేధం విధిస్తూ ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసినట్లు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆస్తుల అమ్మకం గత ప్రభుత్వ హయాంలోని ధర్మకర్తల మండలి నిర్ణయమైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారని, ఆ ఆదేశాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. భక్తులు ఇచ్చిన ఆస్తులు ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉంటే, వాటిని ఏ విధంగా పరిరక్షించి ఉపయోగించుకోవాలనే అంశంపై కమిటీ వేయనున్నామన్నారు. ఇందులో ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు స్వామీజీలు, భక్తులను నియమించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బీసీలకు బాసట

పార్టీలో ఎప్పటిలానే వెనుకబడిన వర్గాలకు అగ్ర ప్రాధాన్యమిస్తామని, యువ నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని, వారి తరపున తెదేపా పోరాడుతుందని భరోసా ఇచ్చారు. చైనా కవ్వింపు చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తెదేపా పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు. ఆ అంశంపై మహానాడులో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. రెండు రోజుల పార్టీ మహానాడు కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ముగిస్తూ చంద్రబాబు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రతి రైలుకు కెప్టెన్‌

దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి రెండొందల రైళ్లు పట్టాలు ఎక్కనున్న నేపథ్యంలో జోన్‌ పరిధిలో కరోనా కట్టడికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. స్టేషన్లలోకి ప్రయాణికుల రాకపోకలు మొదలుకొని సిబ్బంది విధి నిర్వహణ, రక్షణ గురించి స్పష్టం చేసింది. జోన్‌ పరిధిలోని 6 డివిజన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రైలుకు ఓ కెప్టెన్‌ ఉండాలి. టికెట్‌ తనిఖీ సిబ్బందిలో సీనియర్‌ను ‘రైలు కెప్టెన్‌’గా నియమించాలి. ప్రయాణికులకు కనిపించేలా ‘కెప్టెన్‌’ బ్యాడ్జి ధరించాలి. రైలులోని  సిబ్బందితో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇప్పట్లో హోదా కష్టమే!

‘ప్రత్యేక హోదా మనకు కాస్త దూరంగానే ఉంది. అడగటం మానేస్తే హోదా రాదు అనే సంగతి తెలిసిన వాడిని. ఇప్పుడు మనతో కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు. ఈరోజు కాకున్నా రేపైనా కేంద్రం మనపై ఆధారపడే స్థితి వస్తుంది. ప్రత్యేక హోదా కల్పిస్తే మద్దతిస్తామని చెప్పే అవకాశం లభిస్తుంది. అప్పుడు కచ్చితంగా హోదా వచ్చి తీరుతుంది. రాష్ట్ర విభజనతో మనకు గణనీయమైన నష్టం వాటిల్లింది’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ పేర్కొన్నారు. ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక రంగంపై గురువారం సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పీజీ వైద్యవిద్య ఫీజులు తగ్గాయ్‌!

పీజీ వైద్య, దంత వైద్య విద్య ఫీజులు బాగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ప్రస్తుత విద్యా సంవత్సరంలో జనరల్‌ మెడిసిన్‌, ఇతర కోర్సుల ఫీజు కన్వీనర్‌ కోటాలో రూ.7.60 లక్షలు ఉండగా దీనిని రూ.4.32 లక్షలుగా నిర్ణయించారు. అంటే.. 43% మేర ఫీజు తగ్గినట్లు తెలిసింది. ప్రైవేటు వైద్య కళాశాలలన్నింట్లో(అన్‌ ఎయిడెడ్‌, నాన్‌ మైనార్టీ) ఒకే తరహా ఫీజులను ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. యాజమాన్య కోటాలో బి-కేటగిరి సీటు ఫీజు రూ.26,68,050 ఉండగా దీనిని రూ.8.64 లక్షలకు పరిమితం చేశారని, 67% ఫీజు తగ్గినట్లైందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏడాదిలోనే కరోనాకు వ్యాక్సిన్‌

కరోనాకు ఏడాదిలోపే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన దేశం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ కె.విజయరాఘవన్‌ తెలిపారు.  10-15 ఏళ్లలో రూపొందించే వ్యాక్సిన్‌కు 200-300 మిలియన్‌ డాలర్లు ఖర్చయితే, ఏడాది వ్యవధిలో దీనిని అందుబాటులోకి తీసుకురావటానికి 200-300 బిలియన్‌ డాలర్లు వ్యయం అవుతుందన్నారు. దేశంలో 30 బృందాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు. కాగా, 20 స్వదేశీ కంపెనీలు దేశంలో కొవిడ్‌ పరీక్ష కిట్లు తయారు చేస్తున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మన మొబైల్‌..మోగుతోంది

భారత టెలికాం రంగంపై విదేశీ పెట్టుబడి, టెక్‌ సంస్థలకు ఆసక్తి పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ జియో ప్లాట్‌ఫామ్స్‌లో గత నెల రోజుల వ్యవధిలోనే 1000 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. మరిన్ని రాబోతున్నాయనీ తెలుస్తోంది. మరో టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియాలో వాటా కొనుగోలుకు గూగుల్‌ ముందుకు వస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అబుదాబికి చెందిన ముబడాల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ సైతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 100 కోట్ల డాలర్లు(దాదాపు రూ.7,500 కోట్లు) దాకా పెట్టుబడులు పెట్టనున్నట్లు విశ్వసనీయ వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ తెలిపింది. ఈ విషయంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి స్పందన లేదు. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌ అనేది ప్రపంచ స్థాయి మదుపర్లను ఆకర్షిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐపీఎల్‌.. ఆ నగరాల్లో

ఈ ఏడాది ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిర్వహణకు ఇంకా అవకాశాలున్నాయని, మూడు లేదా నాలుగు మైదానాలున్న నగరాలను ఎంచుకుని మ్యాచ్‌లు నిర్వహించాలని టీమ్‌ఇండియా మాజీ  ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించేందుకు కచ్చితంగా అవకాశాలున్నాయి. వాటాదార్లందరూ ఒకే మాట మీద ఉండేలా చూడాలి. మూడు లేదా నాలుగు మైదానాలున్న నగరాలను గుర్తించాలి. ఆటగాళ్లు తరచుగా ఎక్కువ దూరం ప్రయాణించడం సవాలుతో కూడుకున్న పని కాబట్టి ఒక్క చోటనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని పరిశీలించాలి’ అని లక్ష్మణ్ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నన్ను ఒక్కరూ పిలవలేదు

సినిమా చిత్రీకరణల్ని పునః ప్రారంభించే విషయంలో జరుగుతున్న సమావేశాలకి తనని ఎవ్వరూ పిలవలేదన్నారు ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ. వీళ్లందరూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కూర్చుని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో దుమారం రేపాయి. గురువారం హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో జరిగిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశాలకి నన్ను ఒక్కరూ పిలవలేదంటూ అక్కడున్న వైద్యుల సమక్షంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చకు  దారితీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.