close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/06/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. 8 నుంచి జాగ్రత్త సుమా

లాక్‌డౌన్‌ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తున్నా తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఒకవేళ ఇవి కట్టడి ప్రాంతాల్లో (కంటెయిన్‌మెంట్‌ జోన్లలో) ఉంటే మూసే ఉంచాలని ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లు, ప్రార్థన స్థలాలను ఆ రోజు నుంచి తెరిచే వీలు కల్పిస్తున్న నేపథ్యంలో 40 అంశాలతో సవివరమైన మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం దీనికి అనుగుణంగా జీవో 75ను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆన్‌లైన్‌ చదువుకొనాల్సిందే

తెలంగాణలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో 30 లక్షల మంది చదువుతున్నారు. వారిలో సగం మందిని పక్కనపెట్టినా మిగిలిన 15 లక్షల మంది విద్యార్థులకు తల్లిదండ్రులు ట్యాబ్‌ లేదంటే ల్యాప్‌టాప్‌ కొననున్నారని అంచనా. ఒక్కో విద్యార్థికి రూ.20 వేల ఖర్చు లెక్కన మొత్తం వ్యయం రూ.3,000 కోట్లు అవుతుంది. బడ్జెట్‌ పాఠశాలలు కూడా ఆన్‌లైన్‌ పాఠాల మార్గం పడితే ఈ కొనుగోళ్లు ఇంకా పెరుగుతాయి. రాష్ట్రంలో ఇంటర్‌, ఆపై విద్యార్థులు రూ.23 లక్షల మంది ఉన్నారు. వారిలో సగం మంది వీటిని కొనుగోలు చేసినా దాదాపు రూ.2,500 కోట్లు అవసరం. అంటే ఈ ఏడాది ఆన్‌లైన్‌ తరగతుల కోసం తల్లిదండ్రులపై కనీసం రూ.5,500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. గగనతలంలో నష్టాల విహారం

చైనాలో కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) తొలి కేసు నమోదు కాకముందు ఏ రోజు చూసినా ప్రపంచ గగనతలంలో సుమారు 20 వేలకు తగ్గకుండా పౌర విమానాలు ఎగురుతూ ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. మనదేశంలోనూ దాదాపు 600 విమానాలు నిలిచిపోయినా, ప్రస్తుతం మూడోవంతు కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల రెండున్నర నెలల పాటు తీవ్రంగా నష్టపోయిన విమానయాన సంస్థలు, సడలింపుల ఫలితంగా ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నా... పరిస్థితి వెంటనే మారేలా లేదు. అయితే ఫిబ్రవరి నాటి ధరలతో పోలిస్తే, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర ఇప్పుడు సగం మేర ఉండటమే విమానయాన సంస్థలకు ప్రధాన ఊరట కల్పించే అంశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పారిశుద్ధ్య కార్మికుని పోస్టుకు రూ.లక్ష

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుని పోస్టును గుత్తేదారులు రూ.లక్షకు అమ్ముకుంటున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తన నియోజకవర్గంలో ఇలాంటి పనులు జరుగుతుండడం బాధాకరమని, అవమానంగా ఉందన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని వ్యక్తులకు కాకుండా ముంబయికి చెందిన వారికి కాంట్రాక్టు ఇస్తే ఇలాగే ఉంటుందని, తక్షణమే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇంట్లోనే కరోనా వైద్యం

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455ను సంప్రదించాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మున్ముందు పెను సవాళ్లు

కరోనా కారణంగా మున్ముందు పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. ఎవరూ ధైర్యం కోల్పోకుండా, నిబద్ధతతో వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పేదలకు వేగంగా న్యాయ సహాయం అందించడానికి సంబంధించిన విధానాలతో రూపొందించిన ప్రత్యేక హ్యాండ్‌బుక్‌ను ఆయన గురువారం విడుదల చేశారు. అనంతరం వెబినార్‌ ద్వారా రాష్ట్రాల న్యాయ సేవల ప్రాధికార సంస్థల ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్లు, సభ్య కార్యదర్శులు, హైకోర్టు న్యాయసేవల కమిటీల అధ్యక్షులు, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థల ఛైర్మన్లు, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలకు తులిప్‌ పోర్టల్‌: కేంద్రం

దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ‘ద అర్బన్‌ లెర్నింగ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ (తులిప్‌)’ను చేపట్టింది. గురువారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురిలు తులిప్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని బయటకొచ్చినవారు ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అట్లాస్‌ సైకిల్స్‌ మూసివేత

ప్రపంచ సైకిళ్ల దినోత్సవం రోజు (ఈనెల 3)నే దేశీయంగా ప్రఖ్యాతి చెందిన అట్లాస్‌ సైకిల్స్‌ మూతపడింది. అన్ని కార్యకలాపాలను ఆ కంపెనీ మూసివేసింది. ‘ఆర్థిక ఒత్తిళ్ల మధ్య తయారీ కార్యకలాపాలను ప్రారంభించే స్థితిలో లేమని.. అందుకే సాహిబాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) యూనిట్‌ను మూసివేయాలని నిర్ణయించిన’ట్లు కంపెనీ పేర్కొంది. కనీసం ముడి పదార్థాలను కొనలేని తీవ్ర నగదు సమస్యలో ఉన్నటు వివరించింది. ఈ ప్లాంటు మూసివేతతో ఇందులో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. హరియాణాకు చెందిన అట్లాస్‌ 1951లో సైకిళ్ల తయారీని మొదలుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కృనాల్‌కు మాత్రమే చెప్పా

తండ్రి కాబోతున్నానని ఇటీవల ప్రకటించిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన భాగస్వామి నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమాయణం గురించి వెల్లడించాడు. తన నిశ్చితార్థం గురించి అమ్మానాన్నకు చెప్పలేదని, అన్న కృనాల్‌కు మాత్రమే ముందుగా తెలుసని హార్దిక్‌ తెలిపాడు. ఓ షోలో అతను మాట్లాడుతూ.. ‘‘నటాషాతో నిశ్చితార్థం విషయం అమ్మానాన్నకు తెలియదు. ఆమెకు ఉంగరం తొడగబోతున్నానని రెండు రోజుల ముందు కృనాల్‌కు చెప్పా. నా ప్రేమ దొరికిందని తెలుసుకున్నా. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ.. మెరుగైన వ్యక్తిగా మారుతున్నానని భావిస్తున్నా. నా పరిమితులను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నా. నా భాగస్వామికి ప్రాధాన్యతనివ్వాలని అనుకున్నా’’ అని హార్దిక్‌ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మంచానికి కట్టేసి.. మర్మాంగాలను కోసేసి...

కలకాలం కలిసి ఉందామని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య కలహాలు పెరిగాయి. చివరికి భర్తను అతి కిరాతకంగా భార్య హత్య చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన కఠారి అప్పారావు, తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ మద్యానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త చేష్టలతో ఆమె విసుగు చెందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.