close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఇటలీని మించనున్న విలయం

దేశంలో కొవిడ్‌ విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు రోగుల సంఖ్యలో ఆ దేశాన్ని కూడా మనం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి. దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరగా ఉంది. తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. మరోవైపు, మరణాల ఉద్ధృతీ పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో మునుపెన్నడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అదివో... అల్లదివో..!

తొలి రెండు రోజులు 8, 9 తేదీల్లో కొంతమంది తితిదే సిబ్బందికి ఆలయ ప్రవేశం ఉంటుంది. 10న తిరుమల స్థానికులకు అవకాశం కల్పిస్తాం. ఈ ప్రయోగాత్మక ప్రక్రియను పరిశీలించి 11 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తామ’’ని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌తో కలిసి దర్శనం విధివిధానాలను ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధికార పార్టీలో అసంతృప్తి సెగలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి.. పార్టీ ప్రజాప్రతినిధులే నిరసన గళమెత్తుతున్నారు. పదవులు చేపట్టి ఏడాదయినా.. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఏమీ చేయలేకపోతున్నామని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరత, తాగునీటి ఇబ్బంది, ఇతరత్రా సమస్యలపై స్వరం పెంచుతున్నారు. ఎంత ప్రయత్నించినా దోసెడు ఇసుక కూడా దొరికే పరిస్థితి లేదని, అంతటా ఆన్‌లైన్‌ మాయాజాలం నడుస్తోందని కొందరు మండిపడుతున్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం చొరవ చూపడం లేదని మరికొందరు ఆక్షేపిస్తున్నారు. మంత్రులకు నివేదికలు ఇచ్చినా పనులు జరగడం లేదని నిష్టూరమాడుతున్నారు. ఇలా గళం వినిపిస్తున్న వారిలో ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులూ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాలుగో జోన్‌గా అంతరిక్ష రంగం

విష్యత్తులో ఆర్థికాభివృద్ధికి అంతరిక్ష రంగం అద్భుత అవకాశం కల్పించనుందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశోధన, ప్రయాణం, పర్యాటకం, సాహసంతో పాటు భూమిపై ఉన్న కమ్యూనికేషన్‌, నావిగేషన్‌ల నిర్వహణకు అంతరిక్షం వేదికగా మారనుందని పేర్కొన్నారు. భూమి, గాలి, సముద్రంలా నాలుగో జోన్‌గా అంతరిక్షం నిలుస్తోందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 200 నుంచి 300 బిలియన్‌ డాలర్ల వాటా ఈ రంగానిదేనన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘అంతరిక్ష రంగంలో కొత్త అవకాశాలు’ అంశంపై శుక్రవారం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), జేఎన్‌టీయూ సంయుక్తంగా నిర్వహించిన వెబ్‌నార్‌ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పరిశ్రమలకు జీవితకాల భరోసా

ఏపీలో ఏర్పాటైన పరిశ్రమలకు జీవితకాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే అండగా ఉండేలా నూతన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి.. పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించిన పారిశ్రామికవాడల్లోనే ఏర్పాటు చేసేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి మండలి (ఎస్‌ఐపీబీ)పై శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. కొత్త పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు అనుమతుల విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు. వందలాది కోట్లతో ఏర్పాటు చేసే పరిశ్రమలు నిర్దేశిత వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించగలిగేలా పారదర్శక పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వచ్చే 80 ఏళ్లు గడ్డు కాలమే!

రానున్న 80 సంవత్సరాల్లో భారత్‌ వాతావరణపరంగా విధ్వంసకర పరిస్థితులను ఎదుర్కోనుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్దం అంతానికి దేశంలో ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉందని తమ అధ్యయనంలో పేర్కొన్నారు. సూపర్‌ కంప్యూటర్ల సాయంతో ప్రపంచ వాతావరణ మార్పులను విశ్లేషించిన ఆ అధ్యయన వివరాలను ‘ఎర్త్‌ సిస్టమ్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌లో గత నెలలో ప్రచురించారు. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ అల్‌మజ్‌ రోయియా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లాంటి అధిక జన సాంద్రత కలిగిన దేశాల్లో వాతావరణ మార్పులు పెను ముప్పును కలిగిస్తాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నగదు లభ్యత సమస్య లేదు

టాటా గ్రూపు నిధుల సమీకరణ కోసం పెట్టుబడుల నగదీకరణకు సిద్ధమవడం లేదని, తమ వద్ద సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు. కొవిడ్‌-19  ప్రభావంతో టాటా గ్రూపు వ్యాపారాలు దెబ్బ తిన్నాయని, ఆయా సంస్థలకు నగదు లభ్యత కొరత ఏర్పడిందని, దీంతో టాటా గ్రూపు పెట్టుబడుల్ని నగదీకరించనుందని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో, చంద్రశేఖరన్‌ వివరణ ఇచ్చారు. టాటా సన్స్‌ బోర్డు శుక్రవారం సమావేశమై, గ్రూపులోని వివిధ కంపెనీలకు అవసరమైన నగదును కేటాయించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. బోర్డు సమావేశాన్ని ప్రస్తావించకుండా ‘ఇటీవలి వదంతులపై స్పష్టత ఇస్తున్నట్లు’ టాటా సన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒకే ఒక్కడు ‘అక్షయ’కుమార్‌

బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి ఒకేఒక్కడు అనిపించు కున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫోర్బ్స్‌ టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో ఈ ఏడాదీ మన దేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు అక్షయ్‌. సుమారు రూ.366 కోట్ల సంపాదనతో 52వ స్థానంలో నిలిచారు. గతేడాది రూ.490 కోట్ల సంపాదనతో 33వ స్థానంలో ఉన్న అక్షయ్‌ ఈసారి కరోనా ప్రభావంతో ఆదాయం కోల్పోయారని ఫోర్బ్స్‌ పేర్కొంది. తన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ది ఎండ్‌’తో   అమెజాన్‌ ప్రైమ్‌లోకి అడుగుపెట్టడం అక్షయ్‌ సంపాదనలో కీలకంగా   నిలిచిందని ఫోర్బ్స్‌ తెలిపింది. అక్షయ్‌ నుంచి రానున్న ‘బచ్చన్‌పాండే’, ‘బెల్‌బాటమ్‌’ చిత్రాల ద్వారా సుమారు రూ.100 కోట్లు వసూలు చేశారని ఫోర్బ్స్‌ నివేదికలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యువరాజ్‌ క్షమాపణలు

ఇటీవల టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి పాల్గొన్న ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ కార్యక్రమంలో స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశాడు. చాహల్‌ గురించి మాట్లాడుతూ అతను ‘భాంగి’ అనే పదాన్ని వాడటంపై ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాడు. ‘‘స్నేహితులతో సంభాషిస్తున్నపుడు అపార్థంతో ఆ మాట అన్నాను. ఒక బాధ్యతాయుతమైన భారతీయుడిగా అనుకోకుండా ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కులం, రంగు లాంటి వాటి ఆధారంగా నేనెప్పుడూ ఎవరి మీదా వివక్ష చూపడాన్ని నేను అంగీకరించను’’ అని యువీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాతృమూర్తినే నరికేసిన ‘మత్తు’ కత్తి

మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదనే కోపంతో పనసకాయలు కోయడానికి ఉపయోగించే కత్తితో కన్నతల్లి మెడపై వేటువేశాడో కర్కోటకుడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె ఆస్పత్రిలో మరణించింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని గంగానమ్మపేటలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తెనాలికి చెందిన శశీదేవి(65) భర్త గతంలోనే మృతిచెందారు. దాంతో ఆమె తన కుమారుడు లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి ఉంటోంది. అతనికి భార్య, నలుగురు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ పిల్లల ఆలనాపాలనా చూడడమే గాక తోపుడుబండిపై ప్లాస్టిక్‌ సామాన్లను విక్రయించగా వచ్చే కొద్దిపాటి మొత్తాన్ని కూడా ఈమె కొడుకు కుటుంబం కోసమే వెచ్చిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.