close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/07/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. దేశంలో 10 చోట్ల క్లినికల్‌ పరీక్షలు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి టీకా (వ్యాక్సిన్‌) ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా  ఎదురుచూస్తోంది. ఈ విషయంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ముందడుగు వేయడం ఆశలు రేకెత్తిస్తోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాక్జిన్‌) ప్రి-క్లినికల్‌ దశను పూర్తిచేసుకొని మొదటి- రెండోదశ పరీక్షలకు అనుమతి సంపాదించింది. ఇదొక కీలకమైన మైలురాయి అని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభివర్ణించారు. ఈ నెలలోనే 10 చోట్ల మలి దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించబోతున్నామని ఆయన ‘ఈనాడు - ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కరోనాకు ఏది విరుగుడు? 

హైదరాబాద్‌ మహానగర పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందోనని రకరకాల అంచనాలున్నాయి. బుధవారం రెండో రోజు మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చర్చించారు. కొవిడ్‌ను అరికట్టేందుకు అవసరమైన సూచనలలో భాగంగా లాక్‌డౌన్‌ విధింపునకు కొంత మంది అనుకూలంగా మాట్లాడారు. ప్రతి రోజు వేయి చొప్పున కేసులు నమోదవుతున్నందున మళ్లీ అసాధారణ చర్యల అవసరం ఉందని వారు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా

భారతీయ రైల్వే పరిధిలో ప్రైవేటుగా ప్రయాణికుల రైళ్లు కూతపెట్టనున్నాయి. 12 క్లస్టర్లలోని 109 జతల రైలు మార్గాల్లో రైళ్లను నడపడానికి రైల్వేశాఖ ప్రైవేటు భాగస్వాముల నుంచి ‘అర్హతకు అభ్యర్థన’ (రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌- ఆర్‌ఎఫ్‌క్యూ)ను బుధవారం లాంఛనంగా ఆహ్వానించింది. ఎంపికైనవారు 35 ఏళ్లపాటు ఆయా మార్గాల్లో రైళ్లు నిర్వహించుకోవచ్చు. తొలిసారి శ్రీకారం చుడుతున్న ఈ విధానం ద్వారా ప్రైవేటు రంగం నుంచి రూ.30వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే అంచనా. ఎక్కువ రైళ్లు భారత్‌లోనే తయారవుతాయని ఆశిస్తోంది. ఒకసారి అర్హత సాధించిన తర్వాత అందుకు అవసరమైన ఆర్థిక వనరులు, రైళ్ల సమీకరణ, నిర్వహణ వంటివన్నీ ప్రైవేటు వారే చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అందరికీ ఆరోగ్య రికార్డు

‘‘విదేశాల్లో మాదిరిగా రాష్ట్రంలో మొదటిసారి ప్రతి కుటుంబానికీ ఓ ఫ్యామిలీ డాక్టర్‌ ఉన్నారన్న భావనను ప్రజల్లో కల్పిస్తాం. ప్రతి పౌరుడి ఆరోగ్యానికీ సంబంధించిన ‘ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు’ (ఈహెచ్‌ఆర్‌) తయారు చేస్తాం. 1,088 అధునాతన అంబులెన్సులను ఒకేరోజు ప్రారంభించడం రికార్డు. ఈరోజు నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తో అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో బుధవారం ఆయన ‘అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌, బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌, నియోనాటల్‌’ పరికరాలతో కూడిన 108 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. డ్రాగన్‌ తోకకు కత్తెర

సరిహద్దుల్లో దౌర్జన్యానికి తెగబడుతూ 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు గుణపాఠం చెప్పేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. డ్రాగన్‌ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే చైనా సంస్థలకు చెందిన 59 మొబైల్‌ యాప్‌లను భారత్‌లో నిషేధించిన ప్రభుత్వం.. తదుపరి హైవే నిర్మాణం, పారిశ్రామిక, టెలికాం, రైల్వే రంగాల్లోనూ చైనాను బహిష్కరించడానికి సన్నద్ధమైంది. జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలను బహిష్కరించనున్నట్లు కేంద్ర రహదారులు, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్‌ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందివ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో కేంద్రం వాటాగా రూ. 36,473 కోట్లుగా పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రెమిడెసివిర్‌.. మొత్తం అమెరికాకే!

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నవేళ అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై పోరులో సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటివరకు తేలిన ఒకే ఒక్క ఔషధం ‘రెమిడెసివిర్‌’ రాబోయే మూడు నెలలపాటు తమకు మాత్రమే అందేలా సంబంధిత తయారీ సంస్థ ‘గిలీడ్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా సెప్టెంబరు వరకు ఇతర దేశాలేవీ ఈ ఔషధాన్ని పొందే అవకాశాలు లేవు. కొవిడ్‌ బాధితుల్లో రెమిడెసివిర్‌ ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువున్నవారిలో ఐదు రోజుల కోర్సులో భాగంగా దీన్ని వినియోగిస్తున్నారు. భారత్‌ కూడా ఈ ఔషధ వినియోగాన్ని ఇప్పటికే సిఫార్సు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిన్న వ్యాపారాలకు 75 కోట్ల డాలర్ల సహకారం: ప్రపంచబ్యాంక్‌

భారత్‌లోని 15 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు ద్రవ్య లభ్యత పెంచేందుకు 75 కోట్ల డాలర్ల (సుమారు రూ.5700 కోట్ల) బడ్జెట్‌ సహకారం అందిస్తామని ప్రపంచబ్యాంక్‌ బుధవారం ప్రకటించింది. కొవిడ్‌-19 ప్రభావం నుంచి బయట పడేందుకు రూ.3.7 లక్షల కోట్ల రుణ ప్రణాళికను భారత ప్రభుత్వం ప్రకటించడంపై ప్రపంచబ్యాంక్‌ హర్షం వ్యక్తం చేసింది. బ్యాంకులు, సిడ్బీ ద్వారా కూడా వ్యవస్థలోకి నగదు చొప్పించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకుంటోందని ప్రపంచబ్యాంక్‌ భారత డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ ప్రశంసించారు. సామాజిక, ఆరోగ్య సంరక్షణ రంగాలకు ప్రకటించిన 200 కోట్ల డాలర్లకు అదనంగా ఈ నిధులు అందిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐసీసీలో ముగిసిన శశాంకం

ఐసీసీలో శశాంక్‌ మనోహర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఐసీసీకి తొలి స్వతంత్ర ఛైర్మన్‌ అయిన అతడి పదవీకాలం బుధవారంతో ముగిసింది. 2015 నవంబరులో ఐసీసీ బాధ్యతలు అందుకున్న మనోహర్‌.. పర్యాయానికి రెండేళ్ల చొప్పున రెండు పర్యాయాలు ఛైర్మన్‌గా పనిచేశాడు. నిబంధనల ప్రకారం మరో దఫా కూడా కొనసాగే వీలున్నా.. మనోహర్‌ దిగిపోవాలనే నిర్ణయించుకున్నాడు. ‘‘రెండు దఫాలు ఛైర్మన్‌గా ఉన్న మనోహర్‌ తన పదవి నుంచి దిగిపోయాడు. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా (హాంకాంగ్‌) తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆలియా..హృతిక్‌లకు ఆస్కార్‌ ఆహ్వానం

ఆస్కార్‌ పురస్కారం అందు కోవడం నటుల కల. కనీసం ఆ వేడుకలో పాల్గొనే అవకాశం దక్కినా సంతోషమే. ఆస్కార్‌ అకాడెమీ ఏటా ప్రకటించే అతిథుల జాబితాలో చోటుంటే ఆ గౌరవం...ఆనందమే వేరు. అలాంటి గౌరవం ఈసారి బాలీవుడ్‌ నటులు హృతిక్‌రోషన్‌, ఆలియాభట్‌లకు దక్కింది. 93వ ఆస్కార్‌ పురస్కారాల వేడుక వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందుతుంది. ఈసారి 819 సభ్యులకు ఆహ్వానం పంపినట్టు అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ట్విటర్‌లో ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.