close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/07/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ధైర్యమే రక్ష

కొవిడ్‌ విస్తృతంగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు, ప్రజల రాకపోకలు, వ్యాపార లావాదేవీలు మొదలవడంతో.. గత నెల రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇళ్లూ, కార్యాలయాలు, మార్కెట్లూ.. ఒక్కచోటని కాదు ఎక్కడ్నించి ఎవరి ద్వారా వైరస్‌ ముప్పు పొంచి ఉందోనన్న భయాందోళనలు వెన్నాడుతున్నాయి. దీంతో వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి కరోనా పాజిటివ్‌ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన అవసరమూ లేదు. అవగాహనతో ధైర్యంగా ఉంటే కరోనాను సగం జయించినట్లే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కరోనా పరీక్షల్లో జాప్యమెందుకు?

ప్రభుత్వ ప్రయోగశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల అన్ని ప్రయోగశాలల బాధ్యుల(ఇన్‌ఛార్జుల)తో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఓ వైపు రాష్ట్రంలో విస్తృతంగా నమూనాలను సేకరిస్తుంటే.. వాటి ఫలితాలను మూణ్నాలుగు రోజులైనా వెల్లడించకపోవడానికి కారణాలేంటి అని ఈ సందర్భంగా శాంతికుమారి.. ఆయా ప్రయోగశాలల బాధ్యులను ప్రశ్నించినట్లు తెలిసింది. సాంకేతిక నిపుణుల కొరత ఉందని, కొందరు భయంతో ఉద్యోగం మానేయగా, కొవిడ్‌ సోకడంతో మరికొందరు విధులకు హాజరు కావడం లేదని సంబంధిత ప్రయోగశాలల బాధ్యులు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి!

గాలి ద్వారానూ కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశముందన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తొలిసారిగా అంగీకరించింది. దీనికి సంబంధించి సశాస్త్రీయమైన వివరణను త్వరలో వెల్లడించనున్నట్లు  తెలిపింది. ఇటీవలే 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని కోరారు. తాజాగా డబ్ల్యూహెచ్‌వో నుంచి వచ్చిన స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి కొన్ని నెలల క్రితం నుంచే గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నా, డబ్ల్యూహెచ్‌వో వాటిని అంగీకరించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణలో నిరుద్యోగ రేటు 15.5%

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌, వైరస్‌ వ్యాప్తి కారణంగా వ్యాపార కార్యకలాపాలు, నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నిరుద్యోగం పెరుగుతోంది. జూన్‌ నెలకు రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 15.5 శాతంగా నమోదైంది. జాతీయ సగటు (10.99 శాతం) కన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) సర్వేలో వెల్లడైంది. కరోనా నేపథ్యంలో జాతీయ నిరుద్యోగ రేటు గణాంకాలను తాజాగా వెల్లడించింది. లాక్‌డౌన్‌తో లావాదేవీలు నిలిచిపోవడంతో మే నెలకు తెలంగాణలో నిరుద్యోగరేటు 34.8 శాతంగా నమోదైంది. నిబంధనలు సడలించిన తరువాత వ్యాపార లావాదేవీలు ప్రారంభమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్స

కరోనా వైరస్‌ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ (ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో) ఉచితంగా చికిత్స అందనుంది. వీటిలో అందించే చికిత్సకు రోజువారీ ఫీజులను ఏపీ ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. రోగికి అందించే చికిత్సను అనుసరించి రోజుకు గరిష్ఠంగా రూ.10,380, కనిష్ఠంగా రూ.3,250 వరకు ఫీజు చెల్లించేలా నిర్ణయించింది. బాధితుల తరఫున ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఫీజులు చెల్లిస్తారని సీఈవో మల్లికార్జున తెలిపారు. ఆరోగœ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో లేని ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులు చేరితే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే తీసుకోవాలని, ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రకటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎంవోలో శాఖలన్నీ ముగ్గురికే..

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎంవో అధికారులు పర్యవేక్షించే శాఖల్ని పునర్విభజించారు. మొత్తం శాఖల్ని ముగ్గురు అధికారులకే పంచారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు అగ్రాసనం వేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాల పర్యవేక్షణ సహా, చాలా ప్రధానశాఖలను ఆయనకే కేటాయించారు. మిగతా వాటిని ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌కు, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డికి కేటాయించారు. ఈ మేరకు ప్రవీణ్‌ ప్రకాషే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల కేటాయింపునకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నీ రద్దవుతాయని అందులో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొవిడ్‌పై రాష్ట్రాలకు ఎయిమ్స్‌ చేయూత

కొవిడ్‌ బారిన పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి, మరణాలు తగ్గించడానికి దిల్లీలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)ను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఎయిమ్స్‌ వైద్యనిపుణుల ద్వారా సంక్లిష్ట వైద్యసేవలపై రాష్ట్రాల్లోని డాక్టర్లకు ప్రతి మంగళ, గురువారాల్లో టెలీ, వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మార్గనిర్దేశం చేయనుంది. వెంటిలేటర్ల నిర్వహణ, ఆక్సిజన్‌ అందించడంలో మెలకువలను నేర్పి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తారు. కేంద్రం ఎంపిక చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దిల్లీ, గుజరాత్‌, కేరళ, కర్ణాటక, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, హరియాణా, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్రలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రవాణా ఖర్చులు.. ఇక తక్కువే

ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌ చట్టం 1993(ద ఎమ్‌ఎమ్‌టీజీ యాక్ట్‌) స్థానంలో ప్రతిపాదిత చట్టం ‘నేషనల్‌ లాజిస్టిక్స్‌ లా ఎఫిషియన్సీ అండ్‌ అడ్వాన్స్‌ ప్రిడిక్టబులిటీ యాక్ట్‌’ను తీసుకువస్తారు. తద్వారా ప్రస్తుత అసమర్థ, సమయం ఎక్కువ తీసుకునే లాజిస్టిక్స్‌ వ్యవస్థ రూపురేఖల్ని మారుస్తారు. ఈ కొత్త చట్టం ద్వారా లాజిస్టిక్స్‌ రంగాన్ని స్పష్టంగా నిర్వచించవచ్చని.. డిజిటైజేషన్‌ ప్రక్రియపై గట్టిగా దృష్టి సారించవచ్చని ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్‌ విభాగం) పవన్‌ అగర్వాల్‌ సైతం అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం లాజిస్టిక్‌ రంగం విషయంలో అస్పష్టత ఉంది. దాన్ని స్పష్టంగా నిర్వచించాలి. అందులో ఉన్న విభాగాలను వెల్లడించాల్సిన అవసరం ఉంద’ని పరిశ్రమల సంఘం నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోహ్లి.. కొలిచి తింటూ

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఆహారం విషయంలోనూ కఠినంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అతను కూడా ఏది తిన్నా కొలిచే తింటాడని తన భార్య అనుష్క శర్మ చెబుతోంది. చెప్పడమే కాదు కోహ్లి ఆహారాన్ని తూకం వేస్తున్న వీడియోనూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు కూడా చేసింది. ఆ వీడియోలో పోహాను బరువులు కొలిచే చిన్న యంత్రంపై కోహ్లి కొలుస్తూ కనిపించాడు. ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా వంద గ్రాముల పోహాను తూకం వేసుకున్నాడు. దాంట్లో ఎక్కువైనా దాన్ని తీసేయడం, తక్కువైతే కొంచెం వేయడం సరదాగా అనిపిస్తుంది. ‘‘ఈ ఇంట్లో ఇలా కొలిచి తింటాం. దానికి కారణం కోహ్లి’’ అని అనుష్క వ్యాఖ్య జతచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రభాస్‌ అభిమానులకు కానుక

కథానాయకుడు ప్రభాస్‌ 20వ చిత్రం విశేషాల గురించి అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం బుధవారం వారికో తీపి కబురు అందించింది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను జులై 10న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌లో వెల్లడించింది. ఇది ఒక పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ. దీనికి గుర్తుగా ఒక గడియారంతో లుక్‌ విడుదల చేసి... పై విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక పూజా హెగ్డే ప్రభాస్‌ సరసన నటిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.