close

తాజా వార్తలు

Published : 15/10/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. ఊరే నీరైనది

ఏడాదిలో కురవాల్సిన వాన కొద్దిగంటల్లో కురిస్తే ఎలా ఉంటుంది? అదీ రెట్టింపు స్థాయిలో పడితే ఏమవుతుంది? హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో జరిగింది అదే. దాదాపు హైదరాబాద్‌లో 404 శాతం అధిక వర్షపాతం కురవగా రాష్ట్రవ్యాప్తంగా 54 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా రాష్ట్రమంతా వరదల్లో చిక్కుకుంది. హైదరాబాద్‌ నగరంలో పరిస్థితి బీభత్సంగా ఉంది. కొన్ని కాలనీల్లో అడుగుపెట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల బయట నిలిపి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి. మంగళవారం రాత్రి గల్లంతైనవారి ఆచూకీ ఇంకా చిక్కలేదు. 2000 పైచిలుకు కాలనీలు ముంపు బారిన పడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి

తెలంగాణ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ సూచించారు. శ్రీశైలం నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతున్నందున.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ‘వరదల కారణంగా విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. సహాయ శిబిరాల్లో ఉన్న వారితో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి కనీసం రూ.500 చొప్పున ఇవ్వండి. వారి ఇళ్లలో పరిస్థితిని ఆరా తీసి ఆదుకోండి. భారీ వర్షాలతో వేర్వేరు జిల్లాల్లో చనిపోయిన పది మంది బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం అందించండి...’ అని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గ్రిడ్‌కు ఇబ్బందేం లేదు..

భారీవర్షాల తాకిడికి కాలనీలు, అపార్టుమెంట్లలోకి వరదనీరు చేరటంతో ముందు జాగ్రత్తగా చాలాచోట్ల విద్యుత్తు సరఫరా నిలిపివేశామని ట్రాన్స్‌కో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. గ్రిడ్‌కు ఇబ్బందేమీ లేదన్నారు. నీటిని తొలగించగానే విద్యుత్తును పునరుద్ధరిస్తామని చెప్పారు.  ‘విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూములను ఏర్పాటుచేశాం. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 94408 11244 లేదా 94408 11245, 1912, 180042500028 నంబర్లకు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 73820 72104, 73820 72106, 1912. 100 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు’’ అని సీఎండీ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాష్ట్ర భద్రత కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించండి

రాష్ట్ర భద్రత కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతిపక్ష నేతకు స్థానం కల్పిస్తూ నాలుగు వారాల్లో తాజాగా జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్లో ప్రతిపక్షనేతను మినహాయిస్తూ 2018 ఏప్రిల్‌ 9న అప్పటి ప్రభుత్వం జీవో 42ను జారీ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రీడిజైనింగ్‌తోనే ముప్పు తప్పేది

‘‘వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వర్షాలు, వరదల్లో భారీ మార్పులు చోటు చేసుకొంటున్నాయి. దీనికి తగ్గట్లుగా మౌలికవసతుల్లో ఆధునిక పోకడలు అవసరం. డిజైనింగ్‌లో మార్పు రావాల్సిన అవసరం ఉంది’’ అని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కె.జె.రమేష్‌ అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని, మేల్కొని ఇకపైనైనా తగిన చర్యలు తీసుకోకపోతే తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యుద్ధానికి సన్నద్ధం కండి!

యుద్ధానికి సన్నద్ధం కావాలని, దేశానికి పూర్తి విధేయంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ తన సైనిక దళాలకు పిలుపునిచ్చారు. చైనా సైన్యం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మెరైన్‌ కోర్‌ దళాన్ని మంగళవారం పర్యవేక్షించిన సందర్భంగా వారినుద్దేశించి ఆయన చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. చైనా అధికారిక మీడియాను ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ‘‘యుద్ధానికి సన్నద్ధం కావడంపైనే మీ శక్తియుక్తులు, దృష్టినంతటినీ కేంద్రీకరించండి. అత్యంత అప్రమత్తంగా ఉండండి. పూర్తి స్వచ్ఛంగా, విశ్వసనీయంగా ఉండండి’’ అని జిన్‌పింగ్‌ సైనిక దళాలకు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గుజరాత్‌లో తనిష్క్‌ దుకాణంపై దాడి?

తనిష్క్‌ ఆభరణాల సంస్థ రూపొందించిన ఓ వాణిజ్య ప్రకటన ఇటీవల వివాదాస్పదమైన నేపథ్యంలో.. గుజరాత్‌లోని కఛ్‌ జిల్లా గాంధీధాం పట్టణంలో ఆ సంస్థకు చెందిన దుకాణంపై దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. దుకాణం నిర్వాహకులను కొంతమంది బెదిరించారని తెలుస్తోంది. ఆ ప్రకటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆ దుకాణం ద్వారానికి నిర్వాహకులు క్షమాపణ పత్రం అంటించడంతో ఈ ప్రచారం మొదలైంది. ‘‘తనిష్క్‌ రూపొందించిన అవమానకరమైన ప్రకటనపై కచ్‌ జిల్లా హిందూ సమాజానికి మేం క్షమాపణలు చెబుతున్నాం’’ అని గుజరాతీలో ఆ లేఖ రాసి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎగవేతలుంటే..రుణ పునర్‌వ్యవస్థీకరణ లేనట్లే

రుణ పునర్‌వ్యవస్థీకరణకు అర్హత పొందాలంటే, ఆ రుణ ఖాతాలో 2020 మార్చి 1 నాటికి ఎటువంటి ఎగవేతలు ఉండకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో ఒకసారి రుణ పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పిస్తూ ఆగస్టు 6న ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.‘2020 మార్చి 1 వరకు 30 రోజులకు మించి బకాయిలు కట్టకుండా ఉండి, ఆ తర్వాత మళ్లీ చెల్లింపులు జరిగి క్రమబద్దీకరణ అయిన స్టాండర్డ్‌ ఖాతాలకు రుణ పునర్‌వ్యవస్థీకరణ అర్హత ఉంటుంద’ని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దిల్లీ మళ్లీ..

ఆఖర్లో బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేయడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌ (57; 33 బంతుల్లో 6×4, 2×6), శ్రేయస్‌ అయ్యర్‌ (53; 43 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో మొదట దిల్లీ 7 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఆర్చర్‌ (3/19) చక్కని బౌలింగ్‌తో దిల్లీకి కళ్లెం వేశాడు. ఛేదనలో రాజస్థాన్‌ 8 వికెట్లకు 148 పరుగులే చేయగలిగింది. స్టోక్స్‌ (41; 35 బంతుల్లో 6×4) రాణించడంతో ఓ దశలో బలమైన స్థితిలో నిలిచిన ఆ జట్టు.. చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయింది. నార్జ్‌ (2/33), దేశ్‌పాండే (2/37), అశ్విన్‌ (1/17), రబాడ (1/28) రాజస్థాన్‌ను దెబ్బతీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా సొంత అనుభవాలే ‘కలర్‌ఫొటో’

‘‘ఇంటర్నెట్‌ లేని కాలంలో ప్రేమలు ఎలా ఉండేవో, ప్రేమికులు ఎలా మాట్లాడుకునేవారో మా సినిమాలో అందంగా చూపించాం’’ అన్నారు సాయిరాజేశ్‌. ఆయన బెన్ని ముప్పానేనితో కలిసి నిర్మించిన చిత్రం ‘కలర్‌ ఫొటో’. సందీప్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. సుహాస్‌, చాందినీ చౌదరి జంటగా నటించారు. సునీల్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ నెల 23న ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘‘నా సొంత అనుభవాల నుంచి తయారు చేసుకున్న కథ ఇది. దర్శకుడు సందీప్‌ నాకు ఎప్పట్నుంచో స్నేహితుడు. నేనే నిర్మాతగా ‘కలర్‌ఫొటో’ చిత్రాన్ని రూపొందించాం. రంగు వివక్ష గురించి నిజాయతీగా, నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని, భావోద్వేగాల్ని పంచుతూనే మేం అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాం’’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.