close

తాజా వార్తలు

Updated : 23/10/2020 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. పోలవరం డీపీఆర్‌ 2 ఆమోదం ఎంతకు?

పోలవరం ప్రాజెక్టు వ్యయం ప్రతిపాదనలను ఆమోదించి పంపాలంటూ పోలవరం అథారిటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. 2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం రూ.20,389.61 కోట్లకే డీపీఆర్‌-2 ఆమోదిస్తున్నట్లు ఆర్థికశాఖ రాసిన లేఖను యథాతథంగా ప్రాజెక్టు అథారిటీకి పంపింది. దీనికి ఆమోదం తెలపాలని తొలుత కేంద్ర జలశక్తి శాఖను ఆర్థికశాఖ కోరింది. దీన్నే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదించి పంపాలని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. తక్షణమే ఈ పని చేయాలనీ ఆ లేఖలో కోరారు. ఆ లేఖ ప్రతిని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సైతం పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నష్టం రూ.9,422 కోట్లు

తెలంగాణలో వర్షాలు, వరద నష్టాల అంచనా కోసం కేంద్ర బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులతో సమావేశం కావడంతోపాటు హైదరాబాద్‌ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను, సిద్దిపేట జిల్లాలో ముంపు బారిన పడిన పంట పొలాలను స్వయంగా సందర్శించిన కేంద్ర బృంద సభ్యులు ముంపు బాధితులు, నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో ఆర్థిక శాఖ కన్సల్టెంట్‌ ఆర్‌.బి.కౌల్‌, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ కె.మనోహరన్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ ఎస్‌ఈ ఎస్‌.కె.కుస్వాహా, కేంద్ర జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎం.రఘురాం సభ్యులుగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు

3. అమరావతిని అంగుళమైనా కదల్చలేరు

ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని రాజకీయ పార్టీల నేతలు, ఐకాస ప్రతినిధులు, రాజధాని రైతులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, పదే పదే ఎవరిష్టం వచ్చినట్టు వారు రాజధాని మార్చాలంటే కుదరదని పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన ‘నేను చెప్పిందే వేదం.. నేను రాసిందే చట్టం’ అని జగన్‌ అనుకుంటే కుదరదన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగమే రాజధాని రైతులకు శ్రీరామరక్ష అని అన్నారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని శంకుస్థాపన ప్రదేశంలో నిర్వహించిన నిరసనల్లో తెదేపా, కాంగ్రెస్‌, వామపక్షాలు, వివిధ సంఘాల నేతలు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొవాగ్జిన్‌ ఆఖరు దశ పరీక్షలకు సన్నాహాలు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి మూడో దశ క్లినికల్‌ పరీక్షలు షురూ కానున్నాయి. దిల్లీలో గురువారం జరిగిన సమావేశంలో డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నిపుణుల కమిటీ అనుమతులిచ్చినట్లు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ సంచాలకులు డాక్టర్‌ ప్రీతిమీనా తెలిపారు. జంతువులతో పాటు మనుషులపై జరిగిన ఒకటి, రెండు దశల పరీక్షల ఫలితాలను అనుసరించి మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశలో 45 మందికి, రెండో దశలో 55 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా.. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరిన్ని ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్‌

అఖిల భారత స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఇకపై విద్యార్థులకు మరింత చేరువ కానుంది! వచ్చే ఏడాది నుంచి ఆ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. 23 ఐఐటీల ఉమ్మడి ప్రవేశ బోర్డు (జేఏబీ) ఈ మేరకు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నందుకుగాను జేఏబీని ఆయన అభినందించారు. ఇకపై విద్యార్థులు ప్రశ్నలను మరింత మెరుగ్గా, సమగ్రంగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ప్రవేశ పరీక్షలు మాతృభాషలోనే జరుగుతున్నాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నాయకులూ విరాళాలివ్వాలి

ఎన్నికల కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేసే రాజకీయ నాయకులు వరద బాధితుల కోసం ఆ సొమ్ము బయటకు తీయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల పెట్టుబడి అనుకుని వారి వారి నియోజకవర్గాల్లో రూ.50 కోట్లయినా ఖర్చు చేసి బాధితులకు అండగా ఉండాలని కోరారు. విరాళమనేది స్పందించి ఇవ్వాలే తప్ప.. ఎందుకు ఇవ్వలేదని అడగటానికి వీల్లేదన్నారు. జనసేన పార్టీ సామాజిక మాధ్యమ విభాగంతో గురువారం ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫిబ్రవరిలో పెళ్లి..సిక్కోలు జవాను వీరమరణం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను బొంగు బాబూరావు (28) ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాను భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా స్థానిక యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓటీటీ అదరహో

దేశీయ మీడియా, వినోద పరిశ్రమ ఏటా 10 శాతానికి పైగా వార్షిక వృద్ధితో సాగి, 2024 నాటికి 55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.1 లక్షల కోట్లు) స్థాయికి చేరొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం మీడియా, వినోద పరిశ్రమ రికవరీ ఆంగ్ల అక్షరం కే- ఆకృతిలో ఉందని, ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ), ఆన్‌లైన్‌ ప్రకటనలు, వీడియో/గేమ్స్‌/ఇ-స్పోర్ట్స్‌, మ్యూజిక్‌, పాడ్‌కాస్ట్‌లు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడింది. మొత్తం పరిశ్రమ ఆదాయంలో 2024కి ఓటీటీ వీడియో విభాగం వాటా 5.2 శాతానికి చేరనుంది. తర్వాతి స్థానంలో ఆన్‌లైన్‌ ప్రకటనలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాండే ధనాధన్‌

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో.. సన్‌రైజర్స్‌ గెలవాలంటే వీరిద్దరిలో ఒకరైనా రాణించడం ఎంతో ఆవశ్యకం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఛేదనలో వీరిద్దరూ 16 పరుగులకే నిష్క్రమించారు. అయినా మరో 11 బంతులుండగానే 155 లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది హైదరాబాద్‌. మరో వికెట్‌ కోల్పోకుండానే ఛేదించింది. కారణం మనీష్‌ పాండే. లీగ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడని మనీష్‌ రాజస్థాన్‌పై సిక్సర్లతో చెలరేగిపోయాడు. విజయ్‌ శంకర్‌ కూడా అర్ధసెంచరీతో అతడికి అండగా నిలవడంతో.. వార్నర్‌ బృందం నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఏడో ఓటమితో రాజస్థాన్‌ తర్వాతి దశకు చేరుకోవడమిక చాలా కష్టం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాడి పొగరు.. ఎగిరే జెండా

‘జల్‌ జంగిల్‌ జమీన్‌’ నినాదంతో తిరుగుబాటు బావుటా ఎగరేసిన మన్యం వీరుడు... కొమురం భీమ్‌. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ యోధుడి పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో! ఎస్‌.ఎస్‌.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. కొమురం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో టీజర్‌ని విడుదల చేశారు. అల్లూరి సీతారామ  రాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.