close

తాజా వార్తలు

Published : 26/11/2020 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. తీరం దాటిన ’నివర్‌‘

తమిళనాడు, పుదుచ్చేరిలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటింది.  పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటాక గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భాజపాలోకి స్వామిగౌడ్‌

తెరాసలో ఉద్యమకారులకు జరుగుతున్న అవమానాన్ని భరించలేకే, వారి ఆత్మగౌరవం కోసమే తాను భాజపాలో చేరినట్లు తెలంగాణ శాసనమండలి మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ పేర్కొన్నారు. ఆత్మగౌరవంకోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినా మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైందని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన తాను రెండేళ్లలో వందసార్లు  కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరానన్నారు. అయినా ఇవ్వలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపాది మతిలేని పాలనే

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా హయాంలో ముమ్మాటికీ మతిలేని పాలనే కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘మూడు రాజధానుల పేరుతో విధ్వంసం, వైకాపా నాయకులు తమ వాటాల కోసం పరిశ్రమలను తరిమేసి పెట్టుబడులు పోగొట్టడం, 20 శాతం మందికే సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి మిగతా 80 శాతం మందికి ఎగ్గొట్టడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యకాండ మతిలేని పాలన కాక మరేంటి?’ అని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి అన్ని స్థానాలకు నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ధరణిలో నమోదు చేయని ఆస్తుల మాటేంటి?

ఒక వ్యక్తికి ఉన్న అన్ని ఆస్తులను ధరణిలో నమోదు చేయాలా? నమోదు చేయని ఆస్తుల మాటేంటి? వాటిపై వారసత్వం వస్తుందా? ఆ ఆస్తులను తరువాత విక్రయించుకునే వీలుందా? అంటూ హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకరికి అయిదు ఆస్తులుంటే వేర్వేరుగా పాస్‌బుక్‌లు ఇస్తారా? ఒకటే ఇస్తారా? అని ప్రశ్నించింది. ధరణిలో నమోదు చేయకపోతే హక్కులు వదులుకోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 300ఎ కల్పించిన ఆస్తి హక్కుకు భంగం కాదా అంది. ధరణిలో సమాచారానికి భద్రత ఏముంది అని అడిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చిరువ్యాపారికి చేదోడు

చిరువ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులు సమాజానికి మేలు చేస్తున్న మహానుభావులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివర్ణించారు. వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారని, ఆదాయం చాలా తక్కువగా ఉన్నా వారు పడుతున్న శ్రమ అధికమని గుర్తుచేశారు. అయితే అసంఘటిత రంగంలోని చిరువ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు అందక ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 నుంచి రూ.10ల వడ్డీతో అప్పులు చేస్తున్నారని, ఈ దుస్థితి మారాలని భావించే ‘జగనన్న తోడు’ పథకం కింద రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చిన్నారులపై ఎస్సీ ఎస్టీ కేసు

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోటలో 10నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు పిల్లలపై ముచ్చుమర్రి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..  ప్రాతకోటలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులో ఆరుగురు చిన్నారులు మూత్రం పోస్తుండగా సురేఖ, రమణ దంపతులు అడ్డుకున్నారు. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. ముగ్గురు పారిపోయారు. దొరికినవారిని ప్రశ్నించగా కొందరు గ్రామస్థుల సూచనలతోనే ఇలా చేసినట్లు పిల్లలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈవీఎంలను నిషేధించాలి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లను నిషేధించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో దావా దాఖలయింది. రానున్న ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్‌లను ప్రవేశపెట్టాలని కూడా ఆ వ్యాజ్యంలో కోరారు. న్యాయవాది సి.ఆర్‌.జయ సుకిన్‌ దీన్ని దాఖలు చేశారు. ఈవీఎంలలో లోపాలు కలగడానికి ఆస్కారం ఉందని, వీటి కచ్చితత్వంపై అనుమానాలు రావడంతో చాలా దేశాలు నిషేధించాయని తెలిపారు. వీటి ద్వారా అక్రమాలు చేసేందుకు తయారీ దశలోనే అవకాశం ఉందని, ప్రపంచంలోని ఏ యంత్రమూ లోపాలకు అతీతం కాదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆత్మవిశ్వాసం పెంచేలా నూతన విద్యావిధానం

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మశోధన పెంపొందించడమే నూతన విద్యావిధానం లక్ష్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయం స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సొంత నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఉన్నప్పుడే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మోదీ చెప్పారు. నూతన విద్యావిధానంపై సమగ్రంగా చర్చించాలని, తద్వారా తక్షణ అమలుకు తోడ్పాటు అందించాలని ఉపాధ్యాయులను, విద్యార్థులను ఈ సందర్భంగా కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాంత్రికుడు మరో లోకానికి

దుఖః సాగరంలో సాకర్‌ ప్రపంచం. క్రీడా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం తన ఆఖరి పేజీ రాసేసుకుంది. అద్వితీయమైన ఆటతో, విలక్షణ వ్యక్తిత్వంతో ఫుట్‌బాల్‌ ప్రేమికులను అనంతమైన వినోదంలో ఓలలాడించి, ఉర్రూతలూగించి అంతులేని వినోదాన్ని పంచిన  సమ్మోహనశక్తి మరో లోకాన్ని అలరించడానికి వీడ్కోలు తీసుకుంది. ఆటకే మారుపేరుగా మారిన మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేడు. ఎన్నోసార్లు తీవ్ర అనారోగ్యం పాలైనా.. చిరుత లాంటి పరుగుతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించినట్లు ఛేదించిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఈసారి మాత్రం పైచేయి సాధించలేకపోయాడు. ఆరు పదుల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పనులు మొదలయ్యాయి

‘ఆదిపురుష్‌’ కోసం ప్రభాస్‌ పనులు మొదలు  పెట్టినట్టు తెలుస్తోంది. చిత్రంలోని పాత్రకి తగ్గట్టుగా ఆయన నాజూగ్గా మారుతున్నారు. ఇటీవల ఆయన లుక్‌ బయటికొచ్చింది. సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఇదివరకటి కంటే సన్నగా, దృఢంగా కనిపిస్తున్నారు ప్రభాస్‌. కొంతకాలం కిందటే లుక్‌ టెస్ట్‌లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత ప్రత్యేక నిపుణుల సమక్షంలో కసరత్తులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఓం రౌత్‌  దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం, రామాయణంలోని యుద్ధ నేపథ్యాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన