close

తాజా వార్తలు

Published : 04/12/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలను వినియోగించారు. 150 డివిజన్లకుగాను 1,122 మంది వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది. మధ్యాహ్నం మూడు గంటల్లోపు రెండో రౌండ్‌ పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటలకల్లా లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉండొచ్చు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2. మండలిలో మరోమారు ఎదురుదెబ్బ

ఏపీ శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వానికి మరో మారు ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు ఏకంగా నాలుగు బిల్లులను మండలి తిరస్కరించింది. వీటిల్లో మూడింటిపై ఓటింగ్‌ నిర్వహించగా వీగిపోయాయి. మరో బిల్లును తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం రూలింగ్‌ ఇచ్చారు. మండలిలో మొత్తం 8 బిల్లుల్ని ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టింది. వీగిపోయిన వాటిల్లో పెట్రోలు, డీజిల్‌పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపునకు సంబంధించిన రెండో సవరణ బిల్లు.. పెట్రోలు, డీజిల్‌పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపునకు సంబంధించి ఏపీ వ్యాట్‌ మూడో సవరణ బిల్లు.. ఆంధ్రప్రదేశ్‌ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను పెంపునకు సంబంధించిన సవరణ బిల్లులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అదే ప్రతిష్టంభన

వ్యవసాయ చట్టాల విషయమై కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య గురువారం జరిగిన రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎనిమిది గంటల పాటు సంప్రదింపులు జరిగినా ఎలాంటి ఫలితమూ వెలువడలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వే- వాణిజ్య శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌, పంజాబ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు, కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాశ్‌లు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జీవితకాల నిషేధ పిటిషన్‌ను వ్యతిరేకించిన కేంద్రం

రెండేళ్లకు మించి జైలు శిక్షపడిన ప్రజాప్రతినిధులను జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3)ని సవరించాలన్న భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సవరణ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో గురువారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అధికారులు, న్యాయవ్యవస్థలోని వారు తప్పుచేసి శిక్షకు గురైతే జీవితాంతం ఆయా ఉద్యోగాలకు అనర్హులైనట్లుగానే రాజకీయ నాయకులపైనా నిషేధం విధించాలని అశ్వినీకుమార్‌ 2017లో దాఖలుచేసిన ప్రధాన పిటిషన్‌లో కోరారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీకా ఎంపికే కీలకం

ప్రపంచవ్యాప్తంగా పలు కొవిడ్‌ టీకాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని, దేశ వాతావరణ పరిస్థితులకు తగిన దాన్ని ఎంపిక చేసుకోవడమే అత్యంత ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి స్పష్టం చేశారు. అప్పుడే ప్రజలకు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం టీకాలను అందించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ టీకా వచ్చినంత మాత్రాన అజాగ్రత్తగా ఉండకూడదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫోర్బ్స్‌ జాబితాలో నల్గొండ యువకుడు

ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ జాబితాలో తెలంగాణ వాసి, నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడు కోణం సందీప్‌ స్థానం దక్కించుకున్నారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కృషి చేసిన 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొందించిన ‘30 అండర్‌ 30 జాబితా’లో సందీప్‌ పేరును చేర్చింది. ఈ నెల 1న అమెరికాలో దీనిని విడుదల చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మొబైల్‌ యాప్‌ రూపొందించినందుకు సందీప్‌కు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను అత్యంత భద్రంగా రోగులకు వారి మాతృ భాషల్లోకి ఈ యాప్‌ తర్జుమా చేసి అందిస్తుందని సందీప్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జీఎస్‌టీ పరిహారం కోసం..అందరూ ఆప్షన్‌-1 వైపే

వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారం చెల్లింపు కోసం కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిన ఆప్షన్‌-1 పరిధిలోకి ఝార్ఖండ్‌ మినహా అన్ని రాష్ట్రాలూ చేరిపోయాయి. దీంతో ఇప్పటివరకూ దీన్ని ఎంచుకున్న రాష్ట్రాల సంఖ్య 27కి, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 3కి చేరింది. ఇందులో చేరిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,05,065 కోట్ల అదనపు రుణ సౌకర్యం కల్పించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,051 కోట్లు, తెలంగాణకు రూ.5,017 కోట్ల మేర అదనపు రుణం తీసుకొనే వెసులుబాటు వచ్చింది. అలాగే ఇప్పటివరకు జీఎస్‌టీ పరిహారం కింద 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి అయిదు వాయిదాల్లో రూ.30 వేల కోట్లు చెల్లించగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.804.15 కోట్లు, తెలంగాణకు రూ.299.88 కోట్లు దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అత్యంత సంపన్న మహిళ రోష్ని నాడార్‌

రోష్ని నాడార్‌, కిరణ్‌ మజుందార్‌ షా, లీనా గాంధీ తివారి... హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బయోకాన్‌, యూఎస్‌వీ ఛైర్‌పర్సన్లు అయిన ఈ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు కోటక్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘కోటక్‌ వెల్త్‌ హురున్‌ - లీడింగ్‌ వెల్దీ వుమెన్‌ 2020’ నివేదికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. రోష్ని నాడార్‌ సంపద రూ. 54,850 కోట్లు కాగా, కిరణ్‌ మజుందార్‌ షా సంపద రూ.36,600 కోట్లు, లీనా గాంధీ తివారీ సంపద రూ.21,340 కోట్లు అని ఈ నివేదిక తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇక మెరుపులే

వన్డే పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి. రెట్టించిన విశ్వాసంతో టెస్టు సిరీస్‌లో అడుగుపెట్టాలన్న తపన. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌ (2021) కోసం జట్టును గాడిన పెట్టుకోవాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా కీలక సమరానికి సిద్ధమైపోయింది. ఇక ధనాధన్‌ దంచుడే. వన్డే సిరీస్‌లో పైచేయి సాధించిన కంగారూలతో నేటి నుంచే టీ20 పోరు. రెండూ బలమైన జట్లే. మరి భారత్‌ పుంజుకుంటుందా? లేదా ఆసీస్‌ ఆధిపత్యం కొనసాగుతుందా? రసవత్తర పోరాటం ఖాయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎస్‌బీఐ యోనోలో సాంకేతిక సమస్య

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన యోనో యాప్‌లో గురువారం సాంకేతిక సమస్య తలెత్తింది. వినియోగదారులకు ‘ఎర్రర్‌ ఎం005’ సందేశం కనిపించింది. దీంతో లావాదేవీ పూర్తిచేసే సౌలభ్యం లేకుండా పోయింది.దీనిపై ఖాతాదారులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు. సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, ఖాతాదారులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యోనో లైట్‌ను ప్రత్యామ్నాంగా వినియోగించుకోవాల్సిందిగా ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన