close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/07/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఇంటికే కరోనా కిట్‌

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ‘ఐసొలేషన్‌ కిట్‌’ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గోదావరి బోర్డును తప్పుదోవ పట్టిస్తున్న ఏపీ

 గోదావరి- పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించే పథకం విషయంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్‌ తప్పు దారి పట్టించిందని తెలంగాణ ఆరోపించింది. గోదావరి బోర్డు సమావేశంలో కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగినపుడు గోదావరి-పెన్నా అనుసంధానం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ చెప్పినదానికి, వాస్తవంగా జరుగుతున్న దానికి పొంతనలేదని, బోర్డును తప్పుదారి పట్టించారని పేర్కొంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గోదావరి నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష

తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, కచ్చితత్వంతో కరోనా పరీక్షలు చేసే రెండు ప్రత్యామ్నాయ పద్ధతులను సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. నెలరోజుల క్రితం వీటిని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ధ్రువీకరణకు పంపారు. వారి నుంచి అనుమతి వస్తే కరోనా పరీక్షల విధానంలో సమూలంగా మార్పులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కరోనా నిర్ధారణ కోసం ప్రస్తుతం చేస్తున్న రియల్‌టైమ్‌ క్వాంటిటేటివ్‌ రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-క్యూ పీసీఆర్‌) విధానంలో ఎక్కువ సమయం పడుతుండటంతో అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సచివాలయం కూల్చివేత.. ఆపండి

 రాష్ట్రప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనున్న క్రమంలో చేపట్టిన పాత భవనాల కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఈనెల 13వ తేదీ(సోమవారం) వరకు కూల్చివేత పనులను చేపట్టరాదంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనుల్లో నిబంధనలను పాటించలేదని ప్రాథమిక ఆధారాలను బట్టి వెల్లడవుతోందని పేర్కొంది. కూల్చివేతకు ముందుగా జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను సమర్పించారో లేదో చెప్పాలంది. ఈ వివరాలను సోమవారంలోగా సమర్పించాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎంసెట్‌పై ఏం చేద్దాం?

కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి సహాయ కేంద్రానికి ఫోన్లు, అధికారులకు ఈ-మెయిళ్లు హోరెత్తుతున్నాయి. ఎంసెట్‌ను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో విద్యార్థుల నుంచి అనేక సందేహాలు వస్తున్నాయి. దీంతో ఎంసెట్‌ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాహుల్‌ కాదంటే సోనియానే!

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు స్వీకరించాలని డిమాండ్లు వినిపిస్తున్నా.. సోనియా గాంధీయే కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుత పదవీకాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించాల్సిందిగా రాహుల్‌కు.. కాంగ్రెస్‌లో చాలామంది నచ్చచెబుతున్నా ఆయన ఇష్టపడడం లేదని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆపద ముంగిట ఆ పద

నగరంలో కోటి మంది వరకు జనాభా ఉన్నారు. కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 24 వేల మందిని తాకింది. వ్యాధి లక్షణాలు కనిపించక పరీక్షలు చేయించుకోని వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో కొవిడ్‌-19 వ్యాప్తి ఎక్కువ ఉందో తెలుసుకునేందుకు డివిజన్ల వారీ సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ విశ్లేషిస్తోంది. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో యాక్టివ్‌ కేసులు ఏస్థాయిలో ఉన్నాయో పరిశీలిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే 8 డివిజన్లలో వందకుపైగా కేసులుండగా, రెండు డివిజన్లలో 150కు పైగా యాక్టివ్‌ కేసులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఐసొలేషన్‌ బాధితులకు టోల్‌ ఫ్రీ నంబరు

8. ఇంటర్నెట్‌ లేని కంప్యూటరే వాడండి

సాంకేతిక యుగంలో రకరకాల పద్ధతుల్లో సైబర్‌ నేరగాళ్ళు కంప్యూటర్లు, ఫోన్లలోకి జొరబడి విలువైన సమాచారం తస్కరిస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత నష్టంతోపాటు ఒక్కోసారి దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (సీఐఎస్‌) విభాగం సైబర్‌ నేరాల బారినపడకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులకు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి చెందిన రహస్యాలు బయటకు పొక్కకుండా చూడటమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొవిడ్‌ పాలసీలు వచ్చేశాయి

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతోంది. ‘పాజిటివ్‌’గా తేలితే.. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. డబ్బును సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 చికిత్స కోసం ప్రత్యేకంగా పాలసీలను తీసుకురావాల్సిన అవసరం ఉందని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) భావించింది. దీనికి అనుగుణంగా రెండు సార్వత్రిక బీమా పాలసీలను రూపొందించి, నిబంధనలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అంతా కలిసి నన్ను తప్పించారు

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా తప్పించడం తన కెరీర్లోనే అతిపెద్ద ఎదురుదెబ్బ అని టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అన్నాడు. బెంగాలీ పత్రికతో మాట్లాడుతూ తనపై  అన్యాయంగా వేటు వేశారని చెప్పాడు. ‘‘2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌ వరకు వచ్చి ఓడిపోయాం. దాంతో 2007 ప్రపంచకప్‌ గెలవాలని కలలుగన్నా. నా సారథ్యంలో ఐదేళ్లు జట్టు గొప్పగా ఆడినందున నేను అలా కల కనడంలో తప్పులేదు. కానీ 2005లో అన్యాయంగా నన్ను కెప్టెన్‌గా తొలగించారు. మొదట వన్డే జట్టు నుంచి తప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.