close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు విస్తృతం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు విస్తృతం చేశామని, కరోనా లక్షణాలు కనిపిస్తే ఎవరైనా యాంటిజన్‌ పరీక్షలు చేయించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట్‌ తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 65 కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హోం ఐసోలేషన్‌ సదుపాయం లేనివారు ప్రభుత్వ ఐసోలేషన్‌లో ఉండవచ్చని, నేచుర్‌క్యూర్‌, ఆయుర్వేద ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మృతుడి కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి: చంద్రబాబు

విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో ఇచ్చిన ప్యాకేజీని సాల్వెంట్‌ బాధితులకూ ఇవ్వాలని సూచించారు. ప్రమాదానికి కారకులైన సాల్వెంట్‌ కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని వదిలేసి పరామర్శకు వెళ్లిన నేతలను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యం వల్లే విశాఖలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గాంధీలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిరవధిక సమ్మె

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్దీకరణ సహా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి పొరుగుసేవల సిబ్బంది గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులను కాపాడుతున్నా సరైన వేతనాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేను బీజేపీలో చేరట్లేదు..! సచిన్‌ పైలట్‌

రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత సచిన్‌ పైలట్‌ మరోసారి స్పందించారు. తాను బీజేపీలో చేరట్లేదని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సచిన్‌ పేర్కొన్నారు. అయితే, సచిన్‌ తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, సచిన్‌ పైలట్‌పై చర్యలు తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందించింది. తమ పార్టీలోకి ద్వారాలు తెరిచే ఉన్నాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తేల్చుకో.. సైన్యమా.. సోషల్‌ మీడియానా..? 

భారత సైన్యంలో సోషల్‌ మీడియా యాప్‌లను డిలిట్‌ చేయాలనే ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ అధికారికి చుక్కెదురైంది. నిన్న ఈ కేసు విచారణ సందర్భంగా దిల్లీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  ‘‘సైన్యం సోషల్‌ మీడియా బ్యాన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఫేస్‌బుక్‌ ఖాతాను డిలిట్‌ చేయాలి. ఒక సైనిక అధికారిగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. సైన్యం నుంచి వైదొలగిన తర్వాత మరో కొత్త ఖాతాను ఫేస్‌బుక్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఇప్పటి ఖాతాలానే పనిచేస్తుంది. దేశ భద్రతపై ఆందోళనలు చెలరేగుతున్న సమయంలో మినహాయింపులు ఇచ్చే ప్రశ్నే తలెత్తదు’’ అని జస్టిస్‌ రాజీవ్‌ సహాయ్‌, ఆశా మేనన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 15 గంటలపాటు భారత్‌-చైనా చర్చలు!

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య నిన్న 15గంటలపాటు చర్చలు జరిగాయి.  మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన చర్చలు బుధవారం తెల్లవారుజామున 2గంటలకు ముగిసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. గల్వాన్‌ లోయ ఉద్రిక్తతల అనంతరం ఇంతటి సుదీర్ఘ సమయం భేటీ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగుసార్లు కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్‌లో ఈ చర్చలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్లాస్మా బాణం!

జీవితం ఓ ప్రవాహం. దీనికి ఆధారం మన లోపలి ప్రవాహం! అవును.. అదే ప్లాస్మా ప్రవాహం. శరీరంలోని అన్ని కణాలకు, అన్ని అవయవాలకు అత్యవసరమైన రక్తాన్ని కదిలించే జీవద్రవ్యం. ఆక్సిజన్‌ను మోసుకెళ్లే ఎర్ర రక్తకణాలు.. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు.. రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్‌లెట్లు.. హార్మోన్లు, ఎంజైమ్‌లు, పోషకాలు.. ఒక్కటేమిటి? మన ప్రాణం నిలవటానికి అవసరమైన సమస్త సరంజామా అంతా ప్లాస్మాలో తేలియాడుతూనే అన్ని భాగాలకు చేరుకుంటాయి. అంటే ఇది కదిలితేనే మనం కదులుతామన్నమాట! మందూ మాకూ లేని కొవిడ్‌-19 చికిత్స విషయంలోనూ ఇది మనల్ని కదిలిస్తోంది. కొత్త కరోనా వైరస్‌ను మన శరీరం ఇంతకు ముందెన్నడూ ఎదుర్కొలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌: ఒక్కరోజే 29,429 కేసులు, 582 మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 29,429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 9,36,181కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా మరో 582 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో భారత్‌లో కొవిడ్‌ మరణాల సంఖ్య 24,309కు చేరినట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 5,92,032 మంది కోలుకోగా మరో 3,19,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా  కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. బుధవారం ఉదయం 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.  ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కుమ్రం భీం జిల్లాలో ఎదురు కాల్పులు

కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులకు తారసపడిన ముగ్గురు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా పోలీసులు మాంగీ, గుండాల, పంకిడి మాదర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌  నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.