close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. బీసీ నాయకత్వంపై ఎందుకింత పగ?: చంద్రబాబు

తెదేపాలోని బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే  బీసీ నేతలపై ఏసీబీ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు పెట్టిన సర్కార్‌.. ఇప్పుడు హత్యానేరం కింద కేసులు పెడుతోందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారని గుర్తుచేశారు. తమ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌పై మండలిలోనే మంత్రులు దాడిచేశారన్నారు. ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయిస్తారా? అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటి?

సీఎం కేసీఆర్‌కు కొండపోచమ్మ కాల్వకు సంబంధం ఏంటని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణను తెచ్చిన తమ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై రాజకీయాలు తగవని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులను చూసి ప్రతి ఒక్కరూ గర్వించాలని సూచించారు. వర్షాకాలం చెరువులకు గండ్లు పడటం, వాటిని పూడ్చడం సహజమేనని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌, భాజపాకు నచ్చడం లేదని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ సైతం పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అచ్చెన్నాయుడి బెయిల్‌ తిరస్కరించిన అనిశా కోర్టు

మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడి బెయిల్‌ పిటిషన్‌ను అనిశా న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుతం బెయిల్‌ ఇవ్వలేమని తెలిపింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో ఆయన రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు కాబట్టి తనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నీట్‌, జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కొత్త తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్‌  1 - 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు, సెప్టెంబర్‌ 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు. అలాగే, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ట్విటర్‌లో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు. వాస్తవానికి గత నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు లాక్‌డౌన్‌తో కేంద్రం ఈ నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొవిడ్‌ ఆస్పత్రిలో అరాచకం: ఆ వృద్ధుడి మృతి

విజయవాడలోని కొవిడ్‌ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. ఆ ఆస్పత్రిలోనే అతడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. గత నెల 24న కరోనా ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుడు మృతి చెందాడు. అదే రోజు మృతిచెందినట్టు అధికారులు ఇప్పుడు వెల్లడించడం అక్కడి నిర్లక్ష్య ధోరణికి అద్దంపడుతోంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే, ఆ వృద్ధుడి భార్య తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఎన్నిసార్లు ఆస్పత్రి సిబ్బందిని అడిగినా సరైన సమాధానం రాలేదు. తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అంతర్జాతీయ విమాన సేవలు జులై 31 తర్వాతే..!

దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకు కొనసాగిస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్ని నడపనున్నట్టు తెలిపింది.  కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 15 వరకు పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సంగక్కరను పది గంటలు విచారించారు! 

‘భారత్‌కు 2011 ప్రపంచకప్‌ను అమ్మేశాం’ అనే అంశంపై జరుగుతున్న విచారణ శ్రీలంకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు వరుసగా క్రికెటర్లను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కరను గురువారం ఏకంగా 10 గంటలకు పైగా విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ తర్వాత సంగా పరిస్థితి ఏంటో, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహేళ జయవర్ధనె సైతం విచారణ కార్యాలయానికి వచ్చాడు. ప్రస్తుతం అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ‘భారత్‌కు ప్రపంచకప్‌ అమ్మేశాం. ఇందులో ఆటగాళ్ల ప్రమేయం లేదు’ అంటూ శ్రీలంక మాజీ క్రీడామంత్రి మహిందానంద ఆల్తుగమాగె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనా పెట్టుబడులున్న దేశీయ యాప్స్ ఇవీ!‌

చైనాతో వివాదం నేపథ్యంలో ఆ దేశానికి గట్టి దెబ్బ కొట్టాలని భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. దీని వల్ల దాదాపు రూ. 80వేల కోట్లు చైనా నష్టపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా యాప్స్‌ నిషేధం మంచి నిర్ణయమే. కానీ చైనాను పూర్తిగా మన దేశం నుంచి పారదోలే అవకాశాలు తక్కువే. ఎందుకంటే.. డ్రాగన్‌ యాప్స్‌ను నిషేధించినా.. అక్కడి పెట్టుబడుదారులు మన దేశీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం చాలా మందికి తెలియదు. మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్‌లో చైనా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సెల్ఫీ మోజులో ఐదుగురు మృతి

సరదా సెల్ఫీ మహారాష్ట్రలో ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. పాల్గర్‌ జిల్లాలోని కాల్‌మాండవి జలపాతంలోకి దిగిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో, ఆ ప్రవాహ వేగాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఆ ప్రవాహంలో మునిగిపోయారు. కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు నీటిలోకి దిగిన మరో ముగ్గురు సైతం ప్రవాహ ధాటికి నిలవలేకపోయారు. ప్రమాదంలో ఆ ఐదుగురు కూడా మృత్యువాత పడ్డారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణరాజు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు‌ పిటిషన్‌ ఇచ్చామని వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సభాపతి హామీ ఇచ్చారని తెలిపారు. స్వపక్షంలో విపక్షం మాదిరిగా రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో అదే పార్టీపై విమర్శలు చేయడం విశ్వాస రాహిత్యమేనని స్పష్టం చేశారు. ‘రఘురామకృష్ణరాజు నైతిక విలువలు కోల్పోయారు. పార్టీలోని వారినే దూషించి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారు’ అని విజయ సాయిరెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.