close

తాజా వార్తలు

Published : 18/09/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ఏపీలో ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు

ఆరోగ్య ఆసరా పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు సాధారణ కాన్పుకు రూ.3వేలు, సిజేరియన్‌కు రూ.వెయ్యి అందిస్తున్నారు. ఇకపై సాధారణకాన్పుకు రూ.5 వేలు, సిజేరియన్‌కు రూ.3 వేలు చొప్పున ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సదుపాయాలు, సేవల ఆధారంగా ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి గ్రేడింగ్‌ తప్పనిసరి చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంద్రకీలాద్రిపై 17 నుంచి దసరా మహోత్సవాలు

2. కేసీఆర్‌ గుండెనిండా సెక్యులరిజం: కేటీఆర్‌

దేశాభివృద్ధిలో..ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవ మిషనరీలు కీలకపాత్ర పోషించాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మిషనరీ ఆస్పత్రులు సమర్థ పాత్ర పోషిస్తున్నాయన్నారు. మంత్రుల నివాస సముదాయంలో క్రైస్తవ పెద్దలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధే తమ లక్ష్యమని.. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గుండెనిండా సెక్యులరిజం ఉందన్నారు. హిందూ మతంలో పుట్టానని గర్వంగా చెప్పుకొనే కేసీఆర్.. ఇతర మతాలనూ అదే స్థాయిలో గౌరవిస్తారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చట్టాన్ని ఉల్లంఘించిన బలగాలపై చర్యలు

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఈ ఏడాది జులైలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ విషయంలో తమ బలగాలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆర్మీ పేర్కొంది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉల్లంఘనకు పాల్పడ్డాయని పేర్కొంది. ఈ మేరకు వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జులై 18న షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు ఆర్మీ పేర్కొంది. చనిపోయిన ఆ ముగ్గురూ రాజౌరీ జిల్లాకు చెందిన కూలీలుగా తర్వాత తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Update: మళ్లీ గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి పేటీఎం

గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి మళ్లీ పేటీఎం యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందులానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది. తొలగించిన కొద్ది గంటల్లోనే అందుబాటులోకి రావడం గమనార్హం. ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎంను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నా మాటలు వినిపించుకోలేదు: హర్‌సిమ్రత్‌

వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన మాటలను పెడచెవిన పెట్టిందని అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. తన మాటలను కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకపోవడం బాధగా ఉందని చెప్పారు. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘అమ్మను ఐసీయూలో ఉంచి మరీ నా బాధ్యతగా ఈ మూడు బిల్లుల కోసం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యా. రైతులకు మద్దతుగా నా వాణి వినిపించా. నా మాటలను పట్టించుకోకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశా’’ అని హర్‌సిమ్రత్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కవ్వింపు వైఖరిని చైనా విడనాడాలి

భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే వైఖరిని విడనాడాలని.. లద్దాఖ్‌ ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య స్థాయిలో కృషి చేయాలని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి చైనాకు హితవు పలికారు. ఈయన 2017 నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇల్లినాయిస్‌ రాష్ట ప్రతినిధిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ‘హౌస్‌ పర్మినెంట్‌ సెలక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటెలిజెన్స్‌’లో ఆయన ఏకైక భారతీయ అమెరికన్‌ సభ్యులు. ప్రస్తుతం సరిహద్దుల వద్ద ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే ప్రయత్నానికి పాల్పడొద్దంటూ భారత్‌, చైనాను గురువారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొవిడ్‌ ప్రపంచం: 3కోట్లు దాటిన కేసులు!

గతేడాది డిసెంబర్‌లో చైనాలో బయటపడ్డ కొవిడ్‌-19 మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కొన్ని రోజుల్లోనే ప్రపంచదేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌, ఇప్పటివరకు లక్షల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నిత్యం రెండు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, తాజాగా(సెప్టెంబర్‌ 18నాటికి) ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 3కోట్లకు(3,02,05,226) చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 9,46,673 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాకు అమెరికా షాక్‌.. ఆ యాప్‌లపై నిషేధం

అమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో పేర్కొంది. అమెరికా పౌరుల వ్యక్తిగతమైన సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జడేజాను అలా కాకుండా ఇలా అనాల్సింది

గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ అని సంబోధించడంపై మంజ్రేకర్‌ వివరణ ఇచ్చాడు. తన పదాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇంగ్లీష్‌ భాషతో ఇదే సమస్య అని పేర్కొన్నాడు. భారతీయులు విమర్శలపైన చాలా సున్నితంగా ఉంటారని, చాలా మందికి ఇక్కడ అది రెండో భాషగానూ ఉండదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఒకసారి తాను తెందూల్కర్‌ విషయంలో చేసిన ‘ఏనుగు వ్యాఖ్యలు’ దుమారం రేపాయని గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు కూడా జడ్డూ విషయంలో అలాగే జరిగిందని, ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ అంటే ప్రజలంతా మరోలా అర్థం చేసుకున్నారని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పెళ్లిలో కరోనా బుసలు.. 177మందికి వైరస్‌!

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. అమెరికాలో ఈ వైరస్‌ కేసుల తీవ్రత గతంలో కన్నా తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నప్పటికీ.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో కరోనా బుసలు కొట్టింది. అమెరికాలోని మైన్‌ రాష్ట్రం మిల్లినోకేట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుక సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. ఆగస్టులో జరిగిన ఈ వివాహ వేడుక ద్వారా 177మందికి వైరస్‌ సోకగా.. ఏడుగురు మృతిచెందినట్టు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) అధికారులు వెల్లడించారు. మిల్లినోకెట్‌ పట్టణంలోని ఓ చర్చిలో వివాహం జరగ్గా.. దానికి సమీపంలోని బిగ్‌మూస్‌ ఇన్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.