close

తాజా వార్తలు

Updated : 31/10/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే: జగన్‌

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017-18లో సాంకేతిక కమిటీ, రివైజ్డ్ కాస్ట్‌ కమిటీ ఆమోదించిన రూ.55,656 కోట్ల అంచనాలను ఆమోదించాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. సవరించిన అంచనాలను సీడబ్ల్యూసీ, సాంకేతిక కమిటీ ఆమోదించాయని చెప్పారు. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన అంచనా మొత్తం అవమానకరంగా ఉందని జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని గుర్తు చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. నిర్వహణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని విభజన చట్టంలో పేర్కొన్నట్లు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 7న జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్లు అరవింద్‌ కుమార్‌, లోకేశ్‌కుమార్‌లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పార్థసారథి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై వారితో చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో 80 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య 80 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 82,045 కరోనా పరీక్షలు నిర్వహించగా .. 2,783 కొత్త కేసులు నమోదు కాగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,690 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,708 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,92,083కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,575 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌లో  ఆ ఐదు చోట్లే 65% కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. అయితే, కొవిడ్‌ సోకినవారిలో మరణాలు తక్కువగా ఉండటం, కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం శుభసూచికం. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 551 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. అలాగే, మన దేశంలో మరణాల రేటు 1.5శాతం కంటే తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రతి 10లక్షల మంది జనాభాలో 88 మరణాలు నమోదవుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నాకు పేదరికం తెలుసు..అందుకే ఆకలి తీరుస్తున్నా 

5. దీపం కిందే ఉంటారా.. ఎల్‌ఈడీలోకి వస్తారా!

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు విమర్శలు చేశారు. బిహార్‌ అభివృద్ధికి భాజపా ఎంతో కృషి చేసిందని సోన్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఆర్జేడీ దీపం గుర్తును ఉద్దేశిస్తూ.. ‘ప్రజలారా మీరు ఏం కోరుకుంటున్నారు? దీపమా లేదా ఎల్‌ఈడీ బల్బులా’అని తేల్చుకోవాలన్నారు. బిహార్‌ శాసనసభకు మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు అక్టోబర్‌ 28న ఎన్నికలు పూర్తైన విషయం తెలిసిందే. మిగతా 172 స్థానాలకు నవంబర్‌ 3న రెండో దశ, నవంబర్‌ 7న మూడోదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అతను సీఎం అయినా ఆశ్చర్యపోను: రౌత్‌

బిహార్‌ ఎన్నికలపై శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సీఎం అయినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ మేరకు పుణెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఎవరి మద్దతూ లేకుండా ఈ ఎన్నికల్లో తేజస్వీ పోరాడుతున్నాడని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు జైల్లో ఉన్నా.. సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలు వెంటాడుతున్నా వెరవక ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సవాల్‌ విసురుడుతున్నాడని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తొలి జేమ్స్‌బాండ్‌ హీరో సీన్‌ కానరీ ఇకలేరు

స్కాటిష్‌ నటుడు, జేమ్స్‌బాండ్‌ తొలి పాత్రధారి సర్‌ థామస్‌ సీన్‌ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన ఆయన ఆస్కార్‌ పురస్కారం సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 90వ పుట్టిన రోజు జరుపుకొన్న ఆయన మూడు నెలలు తిరగకుండానే కన్నుమూయడంతో హాలీవుడ్‌ పరిశ్రమ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విద్యార్థిని హత్య: నిర్మాతలపై కంగన ఆగ్రహం

8. అది పార్టీ నిర్ణయం..ఈసీకి సంబంధం లేదు..

తనను ఎన్నికల సంఘం (ఈసీ) స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి తొలగించడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రాష్ట్రంలో వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని, తమ హెచ్చరికలను సైతం విస్మరిస్తున్నారని మండిపడిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆయన్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐసీఐసీఐకి లాభాల పంట 

కొవిడ్‌ ఆంక్షల సడలింపు తర్వాత రుణగ్రహీతలు పెరగడం, మొండి బకాయిలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐకి లాభాల పంట పండింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకు నికరలాభం ఆరు రెట్లు పెరిగి రూ. 4,251కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 655 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ఇక ఆదాయం కూడా రూ. 22,759.52కోట్ల నుంచి రూ. 23,650.77కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ చిత్తు: ముంబయి ఘన విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి విజయ పరంపర కొనసాగిస్తోంది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో దిల్లీని తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్ (25; 29 బంతుల్లో, 1×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఆ జట్టును బుమ్రా (3/17), బౌల్ట్‌ (3/21) దెబ్బతీశారు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇషాన్‌ కిషాన్‌ (72*; 47 బంతుల్లో, 8×4, 3×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌Xబెంగళూరు: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.