close

తాజా వార్తలు

Published : 26/09/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. దసరా రోజే ‘ధరణి’ ప్రారంభం

కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొస్తున్న  ధరణి పోర్టల్‌ దసరా పండుగ రోజు ప్రారంభం కానుంది. ప్రజలు మంచి ముహూర్తంగా భావించే విజయదశమి రోజున పోర్టల్‌ను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ప్రారంభానికి అనువుగా అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మారిన రిజిస్ట్రేషన్‌ విధానం, వెంటనే మ్యుటేషన్‌, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్‌ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో కరోనా ఉద్ధృతి: మరో 7200 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తి రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే తాజాగా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 75,990 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7293 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా మరో 57మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తంగా 55,23,786 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,68,751 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 5663 మంది మృత్యువాత పడగా.. 5,97,294మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 65,794 క్రియాశీల కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిర్ణయాధికారానికి దూరంగా ఇంకెంతకాలం?

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఐరాస భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రశ్నించారు. యావత్‌ ప్రపంచం కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌వైపు చూస్తోందన్నారు. తమకున్న సామర్థ్యంతో మానవాళిని ఈ మహమ్మారి నుంచి బయటపడేయగలమని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశంలో వేదికపై ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చివరి చూపునకు నోచుకోలేకపోయా..!

తన స్నేహితుడు, సోదర సమానుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం పట్ల ప్రఖ్యాత గాయకుడు ఏసుదాసు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుతో కలిసి అనేక ఏళ్లు ప్రయాణం చేశానని, ఆయన సొంత సోదరుడి కంటే ఎక్కువని.. ప్రకటన విడుదల చేశారు. ‘నాతో కలిసి పనిచేస్తున్న వారందరిలోనూ బాలు నాకు చాలా దగ్గర. గత జన్మలో నేను, బాలు సొంత సోదరులం అనుకుంటా. బాలు సంగీతాన్ని సంప్రదాయబద్ధంగా నేర్చుకోకపోయినప్పటికీ.. ఈ రంగంలో ఆయన నైపుణ్యం అమోఘం. ఆయన పాడటమే కాదు.. చక్కగా కంపోజ్‌ చేస్తారు’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వ్యాక్సిన్ వచ్చినా..మరో సవాలు!

కరోనా మహమ్మారి విలయతాండవానికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం ఇప్పుడు అది పెద్ద సవాలని ఇప్పటికే చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది క్లిష్టమైన వ్యవహారంగా మారనుంది. దీన్ని ఉద్దేశించి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా ఓ ప్రశ్నను సంధించారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి వచ్చే సంవత్సర కాలానికి కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చుచేయగలదా?అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేమే వాటిని చూడలేం: వాట్సాప్‌ 

వాట్సాప్‌ సందేశాలను మూడో వ్యక్తి పొందేందుకు వీలు లేకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసినట్లు సామాజిక మాధ్యమ సంస్థ వెల్లడించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వాట్సాప్‌ సందేశాలను పరిశీలించగా డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్‌ బ్యూరో (ఎన్‌సీబీ)బాలీవుడ్ లోని పలువురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది.  దాంతో సమాచార భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సంస్థ ప్రకటన వెలువడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆస్పత్రి నిర్వాకం.. మృతదేహాలు తారుమారు!

హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చికిత్సపొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందాడు. బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పడంతో మృతుడి బంధువులు రూ.10లక్షలు చెల్లించారు. అంత్యక్రియల కోసం ఒక మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని చూపించండని బంధువులు ప్రాధేయపడినా నిబంధనలు ఒప్పుకోవని చితికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏం చేస్తాడు! ధోనీకి తప్పడం లేదు మరి

ఎప్పుడూ లేని విధంగా ఎంఎస్‌ ధోనీ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతున్నాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. టాప్‌ఆర్డర్‌ ఇబ్బందులతో అతడికి మరో దారి లేదని పేర్కొన్నాడు. అంబటి రాయుడు, సురేశ్‌ రైనా లేకపోవడం వల్ల ధోనీకి మిడిలార్డర్‌ సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించాడు. యూఏఈలో జరుగుతున్న లీగులో చెన్నై తొలివారమే మూడు మ్యాచులు ఆడింది. రెండింట్లో ఓడింది. గాయం కారణంగా అంబటి రాయుడు జట్టుకు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో సైతం ఇంకా గాయం నుంచి  కోలుకున్నట్టు కనిపించలేదు. జట్టు కూర్పు కుదరకపోవడంతో మహీ ఐదుగురు బౌలర్లనే ఆడిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ కోతి ఆచూకీ చెప్తే రూ.50 వేలు!

సాధారణంగా కావాల్సిన వారెవరో కనిపించకుండా పోతే ఆచూకీ తెలిపిన వారికి రివార్డు లిస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం చూసుంటాం. కానీ, ఓ కోతి ఆచూకీ చెప్తే డబ్బులిస్తామనటం ఎప్పుడైనా చూశారా? అదీ తక్కువేం కాదు..అక్షరాల రూ.50 వేలు. ఈ వ్యవహారం పంజాబ్‌లోని చండీగఢ్‌ ప్రాంతంలో జరిగింది. మరి ఆ కోతికి అంత క్రేజ్‌ ఎందుకొచ్చిందో తెలుసా? చండీగఢ్‌కు చెందిన పచ్చబొట్టు ఆర్టిస్ట్‌ కమల్‌జీత్‌ సింగ్‌, ఆయన మేనేజర్‌ దీపక్‌ ఓహ్రా ఓ కోతిని పెంచుకునే వాళ్లు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువులను అక్రమంగా పెంచుకోవడం నేరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇన్‌స్టాగ్రామ్‌.. 4గంటలు.. ప్రపంచ రికార్డు

దిగ్గజ ప్రసారకర్త సర్‌ డేవిడ్‌ అట్టెన్‌బొరో ఓ అరుదైన ఘనత సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించుకొని ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రకృతి ప్రేమికుడైన బ్రిటన్‌కు చెందిన అట్టెన్‌బొరో గురువారం మొట్టమొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని మనమందరం ఏకమై భూగోళాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.