close

తాజా వార్తలు

Updated : 24/11/2020 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొండ కాదిది.. పర్యావరణానికి గుదిబండ 


 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : పైన కనిపిస్తున్న ఫోటోను చూస్తే ఏదో కొండలా ఉంది అనిపిస్తోంది కదూ! కానీ అది కొండ కాదు. పర్యావరణానికి గుదిబండ. అది సహజంగా ఏర్పడలేదు మానవుల వల్ల పుట్టుకొచ్చింది. కొండ మానవుల వల్ల ఏర్పడటమేమిటీ? విడ్డూరం అనుకుంటున్నారా? అవును ఏళ్ల తరబడి చెత్తను ఓ చోట పోగేస్తే అది ఏర్పడింది మరి. 

తాజ్‌ మహల్‌ ఎత్తును మించిపోయేలా...
దిల్లీలోని ఘాజీపుర్‌లో ఉందీ ఈ చెత్తకొండ. దశాబ్దాలుగా దిల్లీలోని వ్యర్థాలను ఇక్కడ పడేయగా ఏర్పడింది. 1984 లో దిల్లీలోని చెత్తను వేయటానికి ఘాజీపుర్‌లో నలభై పుట్‌బాల్‌ మైదానాలంత వెడల్పు గొయ్యి తవ్వారు. పాత దిల్లీ సహా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను తెచ్చి ఇక్కడ వేసేవారు. అలా రెండు దశాబ్దాలు గడిచింది. నగరం విస్తరించటం, మారిన జీవన విధానం, ప్లాస్టిక్‌ వినియోగం పెరగటంతో 2002 నాటికీ ఈ గొయ్యి పూర్తిగా నిండిపోయింది. తరువాత ఈ డంప్‌యార్డ్‌లో కొన్ని మీటర్ల ఎత్తువరకు చెత్తను వేసేందుకు అనుమతులు ఇచ్చారు. దానిని పొడిగిస్తూ వచ్చారు. 25 మీటర్ల ఎత్తుకు మించి చెత్తను వేయరాదని ఆంక్షలు ఉన్నా..గత ఏడాది గణాంకాల ప్రకారం..ఇప్పుడున్న ఈ చెత్తగుట్ట ఎత్తు 213 అడుగులుగా ఉంది. ఇది తాజ్‌మహల్‌ ఎత్తు 239.5 అడుగులను దాటేస్తుందన్న అంచనాలూ రెండేళ్ల కిందటే వచ్చాయి.

రోజుకు రెండువేల టన్నుల చెత్త..
దిల్లీ నుంచి రోజుకు రెండువేల టన్నుల చెత్తను ట్రక్కుల్లో తెచ్చి ఇక్కడ పోస్తూపోయారు. అందుకే అది పెరుగుతూ పోయింది. కొండచరియలు విరిగి పడిన మాదిరిగా 2018లో భారీ వర్షాలకు చెత్తగుట్టలో కొంత భాగం పడిపోవడంతో ఇద్దరు మరణించారు. దాంతో ఇక్కడ చెత్త వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. కానీ మరో ప్రత్యామ్నాయ స్థలం దొరకలేదు. దాంతో పరిస్థితి మొదటికి వచ్చింది.

విమానాలకు అడ్డు వస్తుందేమోనన్న సుప్రీం..
ఈ కొండ విమానాలకు అడ్డు వస్తుందేమోనన్న సుప్రీంకోర్టు దానిపై ఎర్ర దీపాలు పెట్టాలని గతంలో ఆదేశించింది. 2018 నుంచి కోర్టులు, ఎన్జీటీ ఆదేశాల మేరకు దిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ ఆదేశాల తర్వాత ఇక్కడ చెత్త వేయటం తగ్గింది. ప్రత్యమ్నాయంగా నగర శివార్లలోని పలు ఖాళీ ప్రాంతాల్లో డంప్‌ యార్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలు తీసుకుంటున్నా..ఈ భారీ కొండను తరిగించటం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇలాంటి కొండలు ఏర్పడకుండా ఉండాలంటే వాడి పడేసే ప్లాస్టిక్ తగ్గించాలని, వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.ఈ చెత్తకొండ నుంచి వెలువడే మీథేన్‌ వంటి వాయువులకు మండే స్వభావం ఉంటుంది. దాంతో తరచూ ఇక్కడ మంటలు రేగుతుంటాయి. 

ఇంత కాలమైనా.. చర్యలు అంతంతే..
టన్నుల కొద్దీ వచ్చే వ్యర్థాలతో పేరుకుపోయిన ఈ కొండను కరిగించటానికి తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమేనని స్థానికులు అంటున్నారు. ‘‘ 25 ఏళ్లుగా ఇక్కడ చెత్త వేయటాన్ని చూస్తున్నాం. దీని వల్ల ఈ ప్రాంతంలో రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇక్కడ నివసించాలంటేనే కష్టంగా ఉంది. ప్రభుత్వాలు సత్వరమే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. రాజకీయ నేతలు ఎన్నోసార్లు దీనిని తొలగిస్తామని మాటిచ్చినా, ఏ మాత్రం నేరవేర్చలేదు. వస్తారు. పరిశీలిస్తారు. వెళ్తారు. ఈ చెత్తకుప్ప వల్ల ఊపిరి పీల్చుకోలేనంత దుర్వాసన వస్తోంది’’ అని స్థానికులు వాపోతున్నారు.Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన