
తాజా వార్తలు
ఏపీ ప్రభుత్వం చొరవ చూపాలి: గీతా ఆర్ట్స్
కేసీఆర్ ప్రకటనపై అల్లు అరవింద్, రాజమౌళి, మహేశ్ హర్షం
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వంలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ చూపాలని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ విజ్ఞప్తి చేసింది. కరోనా కష్టకాలంలో చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రాయితీల పట్ల ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న చిరంజీవి, నాగార్జునలకు తమ సంస్థ గీతా ఆర్ట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ ప్రకటన పట్ల దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, పూరీ జగన్నాథ్, సంపత్ నంది, కథానాయకుడు మహేశ్ బాబు, నటి ఛార్మితోపాటు పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశాయి. కేసీఆర్ ప్రకటన చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొస్తుందన్న రాజమౌళి ట్వీట్ చేశారు. తప్పకుండా పరిశ్రమలో మంచి పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు పరిశ్రమకు ఎంతో మేలు చేకూర్చేలా ఉన్నాయని మహేశ్ అన్నారు. వెండితెరపై ఆధారపడిన లక్షలాది కార్మికులకు కేసీఆర్ చేయూతనిచ్చారని తెలిపారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ పరిశ్రమపై దృష్టి సారించిన కేసీఆర్, కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే విషయంపై పూరీ స్పందిస్తూ.. కష్టకాలంలో పరిశ్రమకు అవసరమైన నిర్ణయాలను ప్రకటించి, ఆదుకోవడం పట్ల కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. థియేటర్లని ఎప్పుడైనా తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో పాటు.. రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్, థియేటర్లకి కనీస విద్యుత్ ఛార్జీల రద్దు, ప్రదర్శనల సంఖ్య పెంచుకోవడం, టికెట్ ధరల్లో సవరణలు చేసుకునే వెసులుబాటుపై కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.