
తాజా వార్తలు
గ్రేటర్లో పోలింగ్ శాతమిదే!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 46.55శాతం పోలింగ్ నమోదైనట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ శాతాన్ని ఆయన వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఆర్సీపురం డివిజన్లో 67.71 శాతం.. అత్యల్పంగా యూసఫ్‌గూడ డివిజన్లో 32.99 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో స్పల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది.
సీపీఐ, సీపీఎం పార్టీల గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌కు రేపు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందుకోసం డివిజన్ పరిధిలో 69 పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ ఏర్పాటు చేసింది. రీపోలింగ్ దృష్ట్యా డివిజన్ పరిధిలోని అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. సెలవును అన్ని కార్యాలయాల అధిపతులు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ఈ నెల 4న జరగనుంది. మొత్తం 30 కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 31 మంది పరిశీలకులను నియమించింది. వారిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వీరంతా లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది.