close

తాజా వార్తలు

నాడు శివాజీకి జరిగినట్లే.. దీదీ ఇంట్లో

బెంగాల్‌ సీఎంపై గవర్నర్‌ విసుర్లు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై మరోసారి విరుచుకుపడ్డారు ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌. ఆ మధ్య దీదీ నివాసంలో జరిగిన దుర్గా పూజ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో సీఎం ఇంట్లో తాను చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘ఔరంగజేబు రాజ్యానికి వెళ్లి అవమానపడ్డ శివాజీలా అయ్యింది నా పరిస్థితి’ అంటూ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇండియా టుడే కాంక్లేవ్‌ ఈస్ట్‌ 2019 సదస్సులో మాట్లాడుతూ గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మమతాబెనర్జీ, గవర్నర్‌ మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. అయితే ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నప్పటికీ.. దసరా సందర్భంగా తమ నివాసంలో ఏర్పాటుచేసిన దుర్గాపూజకు దీదీ గవర్నర్‌ను ఆహ్వానించారు. అక్టోబరు 11న జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కూడా పాల్గొన్నారు. తాజాగా దానిపై స్పందించిన జగదీప్‌.. ‘ఆ రోజు నన్ను అవమానించిన తీరు ఔరంగజేబు రాజ్యంలో శివాజీ ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేసింది. అయితే మమతాబెనర్జీని నేను ఔరంగజేబుతో పోల్చట్లేదు. బహుశా.. నాకు జరిగినట్లుగా ఏ రాష్ట్ర గవర్నర్‌కు జరగలేదేమో..! దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆ కార్యక్రమం మొత్తం అధికారిక మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారమైంది. అయితే అందులో గవర్నర్‌ను కనీసం నాలుగు సెకన్లు కూడా చూపించలేదు’ అని చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో పాలన అస్తవ్యస్తంగా మారుతోందని, తాను చాలా ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. 

1666లో ఔరంగజేబు తన పుట్టినరోజు సందర్భంగా శివాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. అయితే అప్పుడు శివాజీని సభలో సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపర్చాడు. అలా ముఖ్యమంత్రి కూడా తనను ఇంటికి పిలిచి అవమానించారని గవర్నర్‌ ఆరోపించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.