close

తాజా వార్తలు

Updated : 18/11/2020 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫైజర్‌ టీకా కొందామా.. వద్దా..?

నిల్వ చేయగలమా? మార్గాలను అన్వేషిస్తున్న కేంద్రం

దిల్లీ: కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి తమ టీకా బాగా పనిచేస్తోందన్న ఫైజర్‌ ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది. కానీ, దాన్ని నిల్వ చేయడానికి -70 (మైనస్‌ 70) డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమన్న వార్త పెద్ద సవాల్‌నే విసురుతోంది. దీంతో ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌ను కొనుగోలుచేయాలా?లేదా? అన్న గందరగోళం నెలకొంది. చాలా దేశాల్లో ఆ ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వచేసే వసతులు లేకపోవడమే అందుకు కారణం. భారత్‌ సైతం అదే సందిగ్ధంలో పడింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తే.. ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటన్న దానిపై దృష్టి సారించింది. 

భారత జనాభాకు సరిపడా వ్యాక్సిన్‌ డోసులు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వి.కె.పాల్‌ తెలిపారు. అయినప్పటికీ.. ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయలేంటి అన్నదానిపై దృష్టిసారించామన్నారు. ఏదేమైనా ఫైజర్‌ టీకా భారత్‌కు రావడానికి మరికొన్ని నెలలు పట్టొచ్చని స్పష్టం చేశారు. -70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడం ఏ దేశానికైనా సవాల్‌తో కూడుకున్న అంశమేనని తెలిపారు. అయినా, తప్పనిసరిగా కొనాల్సి వస్తే అనుసరించాల్సిన ప్రక్రియపై దృష్టి సారించామని పేర్కొన్నారు. అలాగే, దాని పంపిణీకి ప్రణాళికల్ని సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. టీకా సామర్థ్యంపై భరోసానిచ్చిన మోడెర్నా, ఫైజర్‌ రెండింటిపైనా దృష్టి సారించామన్నారు. 

మన దేశంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌లలో ఐదు విజయవంతమయ్యే అవకాశం ఉందని పాల్‌ తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే భారత జనాభాకు సరిపడా డోసులు అందుతాయన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ జరుపుతున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కావస్తున్నాయని తెలిపారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయన్నారు. జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న టీకా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేసుకుందన్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ ప్రయోగాల్ని రెడ్డీస్‌ ల్యాబ్‌ ఒకేసారి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తున్న టీకా ప్రాథమిక దశలో ఉందని వివరించారు. 

టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామన్న ప్రధాని మోదీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. అది తుది దశలో ఉందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్నామన్నారు. టీకా రాగానే తొలుత వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన వర్గాలకు సంబంధించిన జాబితాను సైతం సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తున్నామన్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన